కాంగ్రెస్ లో పెరుగుతున్న అసమ్మతి.. నేతలతో అధిష్టానం కీలక భేటి?

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి కొత్త ఛైర్మన్ ఎంపిక కోసం అధిష్టానం ఎంత సమయం తీసుకుందో అందరికీ తెల్సిందే. పార్టీలోని అందరూ సీనియర్ల మనోభావాలను పరిగణలోకి తీసుకొని ఎట్టకేలకు టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని అధిష్టానం ప్రకటించింది. అయితే తొలి నుంచి రేవంత్ రెడ్డికి పార్టీలోని సీనియర్ల నుంచి సవాళ్లు ఎదురవుతూనే వస్తున్నాయి. వీటన్నింటిని రేవంత్ ఒక్కొక్కటిగా దాటుకుంటూ ముందుకు పోతున్నారు. అయితే రోజురోజుకు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా సీనియర్లంతా గళం విప్పుతుండటంతో పార్టీ పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది. దీంతో ఎప్పుడు, ఏం జరుగుతుందోనన్న ఆందోళన ఆపార్టీ శ్రేణుల్లో నెలకొంది.

దూకుడు రాజకీయాలకు రేవంత్ రెడ్డి కేరాఫ్ గా నిలుస్తున్నారు. టీపీసీసీగా నియామకం అయ్యాక వరుసగా సభలు, సమావేశాలు నిర్వహిస్తూ పార్టీలో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఇదంతా బాగున్నప్పటికీ ఆయన పార్టీలోని సీనియర్లను కలుపుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నారు. పార్టీలో చర్చించకుండా రేవంత్ ఏకపక్షంగా నిర్ణయాలు ఎలా తీసుకుంటారని సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. తమ నియోజకవర్గాల్లో చేసే కార్యక్రమాలకు సైతం సమాచారం ఇవ్వడం లేదంటూ రేవంత్ పై సీనియర్లు మూకుమ్మడి దాడి చేస్తున్నారు.

రేవంత్ రెడ్డి టీపీసీసీగా నియామకం అయ్యాక పార్టీలోని సీనియర్ల అందరితో వరుసగా భేటి అయ్యారు. అందరినీ కలుపుకుపోతానని ప్రకటించాడు. అయితే ఇప్పుడు ఆయన తన వర్గానికే ప్రాధాన్యం ఇస్తున్నాడని సీనియర్లు ఆరోపిస్తున్నారు. దళిత, గిరిజన దండోరా కార్యక్రమాలే ఇందుకు నిదర్శనమంటూ రేవంత్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంద్రవెల్లి సభకు సీతక్క అధ్యక్షత వహించడం.. రావిర్యాల సభను రేవంత్ టీం ముందుండి నడిపించడం.. మూడుచింతలపల్లి దీక్షలో సీనియర్లు తెరపై కన్పించే పరిస్థితి లేకపోవడం.. గజ్వేల్ సభలో రేవంత్ మాత్రమే ఫోకస్ అవడాన్ని ఆయన వ్యతిరేకవర్గం తట్టుకోలేకపోతుంది.

ఈ సభల సాక్షిగానే రేవంత్ సొంత నిర్ణయాలను ప్రకటించడాన్ని సీనియర్లు తప్పుబడుతున్నారు. అధికారిక ప్రతినిధుల పేర్లు సైతం పార్టీలో చర్చించకుండానే ప్రకటించడం రేవంత్ ఒంటెద్దు పోకడలకు నిదర్శనమని విమర్శిస్తున్నారు. ఇటీవల గాంధీభవన్‌లో జరిగిన అఖిలపక్ష సమావేశానికి ఎవరెవరు వస్తున్నారనే సమాచారం పార్టీలోని ముఖ్య నేతలకు ఇవ్వకపోవడం ఏంటనే ప్రశ్నిస్తున్నారు. రేవంత్ గతంలో చెప్పిన దానికి ప్రస్తుతం చేస్తున్న దానికి ఎలాంటి పొంతన లేదని మండిపడుతున్నారు. దీంతో పార్టీలో పరిస్థితి రేవంత్ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా మారిపోయింది.

మరోవైపు రేవంత్ రెడ్డి ఢిల్లీ పెద్దలు అండగా నిలుస్తున్నట్లు తెలుస్తోంది. సీనియర్లు.. సీనియర్లు అంటూ పార్టీని ఏడేళ్లుగా ముంచుతున్నారనే భావన అధిష్టానంలో ఉంది. దీంతో సీనియర్లను కట్టడి చేసే ప్రయత్నం అధిష్టానం చేస్తోంది. రేవంత్ తో కలిసి నడవాల్సిందేనంటూ సూచిస్తుంది. ఈ విషయంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి మాణిక్యం ఠాకూర్ రేవంత్ కు అండగా నిలుస్తున్నారు. కాగా రేవంత్ కు వ్యతిరేకంగా పార్టీలోని సీనియర్లంతా ఏకమవుతుండటం ఆసక్తిని రేపుతోంది. ఇలాంటి సమయంలోనే నేడు కీలకమైన పీఏసీ సమావేశం జరునుంది. ఈ భేటికి ఎవరెవరు వస్తారు? ఏమేమీ చర్చకు వస్తాయనేది ఉత్కంఠతను రేపుతోంది. దీంతో ఈ సమావేశంలో ఎవరు పైచేయి సాధిస్తారనేది మాత్రం వేచిచూడాల్సిందే..!

-Advertisement-కాంగ్రెస్ లో పెరుగుతున్న అసమ్మతి.. నేతలతో అధిష్టానం కీలక భేటి?

Related Articles

Latest Articles