మాడుగుల టీడీపీలో గ్రూప్ ఫైట్..నలిగిపోతున్న క్యాడర్ !

ఆయన ఎమ్మెల్యేగా గెలిచింది ఒకసారి.. ఓడింది రెండుసార్లు. పార్టీ అవకాశం ఇచ్చినా నెగ్గుకు రాలేకపోయారు. ఇప్పుడు నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి మూడు ముక్కలాటలా తయారైంది. ఈసారి కష్టమని భావించారో ఏమో ఇంకో నియోజకవర్గంపై కర్చీఫ్‌ వేయాలని చూస్తున్నారట. దీంతో ఆయనకు పార్టీ ఛాన్స్‌ ఇస్తుందా లేక.. షాక్‌ ఇస్తుందా? అనే చర్చ జరుగుతోంది. ఇంతకీ ఎవరాయన?

మాడుగుల టీడీపీలో గ్రూప్‌ ఫైట్‌!

విశాఖ జిల్లా మాడుగుల. టీడీపీ ఆవిర్భావం తర్వాత మాడుగుల నియోజకవర్గంలో తొమ్మిదిసార్లు ఎన్నికలు జరిగితే ఆరుసార్లు ఆపార్టీ అభ్యర్ధులే గెలిచారు. 2004లో కాంగ్రెస్ నుంచి కరణం ధర్మశ్రీ గెలవడంతో టీడీపీ హవాకు బ్రేకులు పడ్డాయి. బలమైన కేడర్ ఉండటంతో 2009 ఎన్నికల్లో టీడీపీ మళ్లీ పుంజుకుంది. ఆ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు గవిరెడ్డి రామానాయుడు. వైసీపీ వచ్చాక మాడుగుల రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. లీడర్లు, కేడర్ ఫ్యాన్ గూటికి చేరడంతో టీడీపీకి ఎదురు దెబ్బలు తప్పలేదు. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ పాగా వేసింది. నాయకత్వ లోపంతో టీడీపీ డీలా పడింది. పార్టీలో గ్రూప్ తగాదాలు ఎక్కువయ్యాయి.

మూడు ముక్కలాటలో నలిగిపోతున్న కేడర్‌!

పార్టీలో వర్గపోరు మాడుగుల టీడీపీ ఇంఛార్జ్‌గా ఉన్న గవిరెడ్డి కాళ్ల కిందకు నీళ్లు తెచ్చాయట. ప్రస్తుతం ఓ వర్గానికి గవిరెడ్డి.. మరోవర్గానికి పైలా ప్రసాద్‌.. ఇంకో వర్గానికి పీవీజీ కుమార్‌ నాయకత్వం వహిస్తున్నారట. పైలా ప్రసాద్‌.. 2009లో పీఆర్పీ నుంచి పోటీ చేసి.. ఆ తర్వాత టీడీపీలో చేరారు. పీవీజీ కుమార్‌ ఇటీవలే వైసీపీని వీడి సైకిల్‌ ఎక్కారు. టీడీపీ ఏదైనా కార్యక్రమానికి పిలుపిస్తే ముగ్గురు నేతలు వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. ఒకరి దగ్గరకు వెళ్తే మరొకరు తమను పట్టించుకోక కేడర్‌లో నిరుత్సాహం నెలకొందట. ఈ మూడు ముక్కలాటలో నలిగిపోవడంకంటే కామ్‌గా ఉండటం మంచిదనే అభిప్రాయంలో సీనియర్లు ఉన్నారట.

అభద్రతా భావంలో రామానాయుడు?

మాడుగులలో టీడీపీకి ఈ పరిస్ధితి రావడానికి మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు ఎదుర్కొంటున్న అభద్రతా భావమే కారణమట. త్వరలోనే నియోజకవర్గాల వారీగా పార్టీ సమీక్షలు చేయనుంది. గెలుస్తారు అని అనుకున్నవాళ్లనే ఇంఛార్జ్‌లుగా చేస్తారని టాక్‌. అదే జరిగితే మాడుగుల టీడీపీకి కొత్త నాయకత్వం వస్తుందనే ప్రచారం గట్టిగా ఉంది. ఇంఛార్జ్‌ పదవిని కాపాడుకోవడానికి గవిరెడ్డి.. కొత్తగా పగ్గాలు చేపట్టడానికి పైలా ప్రసాద్‌లు పోటీ పడుతున్నారట. అయితే పీవీజీ కుమార్‌ పేరును పార్టీ అధిష్ఠానం పరిగణనలోకి తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదనే వాదన ఉంది. చివరకు రేస్‌లో ప్రసాద్‌, కుమార్‌లే ఉంటారని చెవులు కొరుక్కుంటున్నాయి పార్టీ శ్రేణులు.

గవిరెడ్డికి క్లాస్‌ తీసుకున్న అచ్చెన్న!

మాడుగులలో పెత్తనం కోసం చూస్తోన్న ముగ్గురు నేతలు స్థానికంగా ఉండటం లేదు. వైజాగ్‌ నుంచి రాజకీయాలు చేస్తున్నారట. పార్టీ కార్యక్రమాలు ఉంటేనే మాడుగుల వెళ్తున్నారట. తాజా పరిణామాలను గమనించిన తర్వాత ఇంఛార్జ్‌ పదవితోపాటు, వచ్చే ఎన్నికల్లో టికెట్‌ కూడా పోతుందనే భయం రామానాయుడిని వెంటాడుతోందట. ఇటీవలే ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నను కలిసి.. తనకు మరోసారి ఛాన్స్‌ ఇవ్వాలని కోరారట రామానాయుడు. మాడుగుల పరిణామాలను ఏకరవు పెట్టేందుకు కొంతమంది సన్నిహితులు, ముఖ్య నాయకులను వెంట తీసుకెళ్లారు. ఈ సందర్భంగా రామానాయుడికి అచ్చెన్న ప్రైవేట్‌గా క్లాస్‌ తీసుకున్నట్టు తెలుస్తోంది. మాడుగులలో టీడీపీ ప్రస్తుత పరిస్థితికి రామానాయుడు వైఖరే కారణమని చెప్పినట్టు వినికిడి.

విశాఖ దక్షిణ నియోజకవర్గంపై గవిరెడ్డి కన్నేశారా?

ఈ పరిణామాల తర్వాత రామానాయుడు మరో ఆలోచన చేస్తున్నారట. బంగారం వ్యాపారైన ఆయన ఎక్కువగా వైజాగ్‌లోనే ఉంటారు. అందుకే తనకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండే విశాఖ సిటీ పరిధిలోనే పోటీ చేయడం కరెక్ట్‌ అని భావించారట. సిట్టింగ్‌ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ కుమార్‌ పార్టీ ఫిరాయించడంతో ఖాళీ అయిన విశాఖ దక్షిణ నియోజకవర్గం కోసం రామానాయుడు ప్రయత్నిస్తున్నారట. కొందరు పార్టీ పెద్దలను కలిసి ఆశీర్వదించమని కోరినట్టు టాక్‌. అయితే ఈ మొత్తం వ్యవహారంలో అటు తిరిగి ఇటు తిరిగి ఏకంగా సీటుకే ఎసరొచ్చే పరిస్థితి తలెత్తిందట. దీంతో ఇదంతా గవిరెడ్డి స్వయం కృతాపరాధమే అంటోంది మాడుగుల టీడీపీ కేడర్. మరి ఏం జరుగుతుందో చూడాలి.

-Advertisement-మాడుగుల టీడీపీలో గ్రూప్ ఫైట్..నలిగిపోతున్న క్యాడర్ !

Related Articles

Latest Articles