ఏపీలో చిన్నారుల కోసం ప్రత్యేకంగా మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రి నిర్మాణం..!

క‌రోనా సెకండ్ వేవ్ ఇంకా పూర్తిగా త‌గ్గ‌నేలేదు.. థ‌ర్డ్ వేవ్ హెచ్చ‌రిక‌లు భ‌య‌పెడుతున్నాయి.. దీంతో.. థ‌ర్డ్ వేవ్ వ‌స్తే ఎలా..? చిన్నారులు ఎక్కువ మంది కోవిడ్ బారిన‌ప‌డితే ఏం చేద్దాం అనే దానిపై ఫోక‌స్ పెట్టాయి ప్ర‌భుత్వాలు.. ఇక‌, ఏపీ ప్ర‌భుత్వం చిన్నారుల కోసం ప్ర‌త్యేకంగా ఆస్ప‌త్రినే నిర్మించాల‌ని నిర్ణ‌యానికి వ‌చ్చింది.. ఏపీలో 20 ఏళ్ల లోపు 11.07 శాతం మంది ఉన్నార‌ని తెలిపిన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనీల్ కుమార్ సింఘాల్.. మూడో దశలో 20 ఏళ్ల లోపున్న వారికి రెండింతల కేసులు నమోదైనా చికిత్స అందించేందుకు సిద్దంగా ఉన్నామ‌న్నారు.. చిన్నారులకు కరోనా సోకితే ఎలాంటి చికిత్స అందించాలని.. మందుల వినియోగం, మాస్కుల లభ్యత వంటి వాటిపై ఫోకస్ పెట్టిన‌ట్టు వెల్ల‌డించారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా మూడో దశ కరోనాలో చిన్నారులకు చికిత్స అందించే అంశంపై అధ్య‌య‌నం చేస్తున్నామ‌న్న ఆయ‌న‌.. చిన్న పిల్లలు పాజిటివ్ అయితే తల్లులు కూడా ఉండాల్సి వస్తుంది.. అలాంటి వారికి 45 ఏళ్ల వయస్సుతో సంబంధం లేకుండా వ్యాక్సిన్ వేయాలని నిర్ణ‌యం తీసుకున్నామ‌న్నారు..

ఇక‌, విశాఖ‌లో 500 బెడ్లతో చిన్నారుల కోసం ప్రత్యేకంగా మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రి నిర్మాణానికి నిర్ణ‌యం తీసుకున్నామ‌న్నారు అనిల్ కుమార్ సింఘాల్.. డీపీఆర్ కూడా సిద్ధంగా ఉంద‌ని.. వెంటనే పనులు ప్రారంభిస్తామ‌ని తెలిపారు.. మ‌రోవైపు విజయవాడ, తిరుపతిల్లో కూడా పిడీయాట్రిక్ ఆస్పత్రుల నిర్మాణానికి నిర్ణ‌యం తీసుకున్నామ‌ని.. పీహెచ్సీలు, ఏరియా ఆస్పత్రులను కూడా మూడో దశ కరోనా చికిత్స కోసం సన్నద్ధం చేస్తున్నామ‌న్నారు.. అవసరమైన మేరకు పిడీయాట్రీషీయన్సుని నియమించుకునేందుకు సన్నాహాలు చేస్తామ‌ని వెల్ల‌డించారు వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనీల్ కుమార్ సింఘాల్.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-