ప్రైవేట్‌ టీచర్లు, సిబ్బందికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ !

కరోనా సృష్టించిన సంక్షోభంతో ప్రైవేట్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది ఆకలి బాధలు తీర్చి, అక్కున చేర్చుకొన్న తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ప్రయివేట్ పాఠశాలలకు సంబంధించిన బోధన, బోధనేతర సిబ్బందికి ప్రభుత్వం అందిస్తున్న ఆపత్కాల సహాయాన్ని వ్యక్తిగత అకౌంట్లకు జమ చేసే కార్యక్రమాన్ని సోమవారం నాడు నగరంలోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో లాంఛనంగా ప్రారంభించారు. మే నెలకు సంబంధించిన రూ. 40 కోట్ల 94 లక్షల 86 వేలను 2,04,743 మంది బోధన, బోధనేతర సిబ్బంది అకౌంట్లకు నేడు బదలాయించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది ఇబ్బందుల్ని పెద్దమనసుతో అర్థం చేసుకొని ముఖ్యమంత్రి కేసీఆర్‌ మానవీయ నిర్ణయం తీసుకోవడం జరిగిందని అన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అంతగా ఆశాజనకంగా లేకపోయినా దేశంలోనే ప్రప్రథమంగా ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో పనిచేసే టీచర్లు, సిబ్బందికి ఆర్థికంగా చేయూతనిచ్చి ప్రభుత్వం అండగా నిలిచిందని తెలిపారు. కరోనా సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఛానళ్ల ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు డిజిటల్ తరగతులను నిర్వహించి, విద్యార్థుల్లో నాణ్యత ప్రమాణాలు తగ్గకుండా చర్యలు చేపట్టడాన్ని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రశంశించిందని మంత్రి పేర్కొన్నారు.

అదేవిదంగా యూ ట్యూబ్, ఇతర మాధ్యమాల ద్వారా తరగతుల నిర్వహణను కూడా కేంద్ర ప్రభుత్వం కొనియాడిందని అన్నారు. స్కూళ్లు మళ్లీ తెరిచే వరకూ ప్రయివేట్ పాఠశాలలకు సంబందించిన బోధన, బోధనేతర సిబ్బందికి నెలకు రూ.2 వేల చొప్పున ఆపత్కాల ఆర్థిక సాయంతోపాటు కుటుంబానికి నెలకు ఉచితంగా 25 కిలోల రేషన్‌బియ్యం పంపిణీ చేస్తామని మంత్రి తెలిపారు. ఏప్రిల్ మాసానికి గాను ముందుగా 1,25,587 మంది లబ్దిదారులను గుర్తించి వారి వ్యక్తిగత ఖాతాల్లో 2 వేల రూపాయల చొప్పున జమ చేయడం జరిగిందని తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం 25 కోట్ల 11 లక్షల 74 వేలు విడుదల చేయడం జరిగిందని వివరించారు.

వీరికి 11 కోట్ల 88 లక్షల 99 వేల 492 రూపాయల విలువైన 3139 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఒక్కొక్క రికి 25 కిలోలు అందించడం జరిగిందని అన్నారు. ఈ ఆపత్కాల సహాయాన్ని మరింత మందికి విస్తరించాలని ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు గౌరవ ముఖ్యమంత్రి గారిని మరోసారి కోరడంతో ముఖ్యమంత్రి కెసిఆర్ గారు దయార్ద్ర హృదయం తో ప్రయివేటు పాఠశాల ల యజమాన్యుల కోరికను మన్నించి మరో 79, 156 మందిని లబ్ది దారులుగా ప్రకటించడం జరిగిందని వివరించారు. వీరికి ఇప్పటికే ఏప్రిల్ నెలకు సంబంధించిన ఆపత్కాల సహాయాన్ని కూడా అందించామని తెలిపారు.

రాష్ట్రంలోని 11,046 ప్రయివేటు పాఠశాలల్లో పనిచేస్తున్న వారిలో రెండు విడతల్లో 2,04,743 మందిని లబ్దిదారులుగా గుర్తించడం జరిగిందని తెలిపారు. ఇకపై వీరందరికీ ప్రతీ నెలా 40 కోట్ల 94 లక్షల 86 వేల రూపాయలు, 19 కోట్ల 38 లక్షల 40 వేల 435 రూపాయల విలువైన బియ్యాన్ని అందించడం జరుగుతుందని అన్నారు. మే నెలకు సంబంధించిన బియ్యాన్ని నేటి నుండి 25 తేదీ వరకు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పాఠశాల విద్య సంచాలకులు దేవసేన తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Latest Articles