‘గుడ్ లక్ సఖి’ సైతం వెనక్కి వెళ్ళింది!

సూపర్ స్టార్ రజనీకాంత్ ‘పెద్దన్న’ చిత్రంలో ఆయన చెల్లిగా కీలక పాత్ర పోషించింది జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేశ్. ఆ సినిమా నవంబర్ 4వ తేదీ విడుదల కాగా, ఆమె టైటిల్ రోల్ పోషించిన ‘గుడ్ లక్ సఖి’ చిత్రం 26న విడుదల కావాల్సి ఉంది. కానీ ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లోనూ విడుదల చేయాలని భావించిన నిర్మాతలు ఇప్పుడు కాస్తంత వెనక్కి వెళ్ళారు.

ఈ విషయాన్ని చిత్ర నిర్మాత సుధీర్ చంద్ర తెలియచేస్తూ, ”పలు కారణాల వల్ల ఈ సినిమా విడుదలను వాయిదా వేశాం. మరికొన్ని సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి, థియేటర్ల సమస్య ఏర్పడకుండా ఉండేందుకు, భారీ ఎత్తున ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఇలా అన్ని కోణాల్లో ఆలోచించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం. అన్ని విధాలుగా మాకు డిసెంబర్ 10 సరైన తేదీ అనుకున్నాం. ఈ సినిమా విజయంపై మాకు నమ్మకం ఉంది. ప్రేక్షకులందరికీ అద్భుతమైన అనుభూతిని ఈ మూవీ ఇస్తుందని నమ్ముతున్నాం” అని తెలిపారు. నగేశ్ కుకునూర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆది పినిశెట్టి, జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు. సహ నిర్మాత శ్రావ్య వర్మ నేతృత్వంలో ఎక్కువ మంది మ‌హిళా స‌భ్యులతో ఈ చిత్రం రూపుదిద్దుకోవడం విశేషం. ఇదిలా ఉంటే డిసెంబర్ 2న బాలకృష్ణ ‘అఖండ’ విడుదల కాబోతున్న నేపథ్యంలో వరుణ్‌ తేజ్ ‘గని’ చిత్రం డిసెంబర్ 3 నుండి డిసెంబర్ 24కు వాయిదా పడిన విషయం తెలిసిందే!

Related Articles

Latest Articles