అప్పట్లో సందడి చేసిన సంఘవి!

(అక్టోబర్ 4న నటి సంఘవి పుట్టినరోజు)

అందాలతో కనువిందు చేస్తూ, అభినయంతోనూ అలరించిన నటి సంఘవి. తమిళ, తెలుగు చిత్రాలతో ఓ వెలుగు వెలిగిన సంఘవి మత్తుగాచూస్తూ ప్రేక్షకులపై మత్తు చల్లి గమ్మత్తు చేసింది. దాంతోనే తనకంటూ కొంతమంది అభిమానులను సంపాదించుకుంది.

సంఘవి అసలు పేరు కావ్య రమేశ్. 1977 అక్టోబర్ 4న మైసూరులో జన్మించింది. ఆమె తండ్రి రమేశ్ ఇ.ఎన్.టి. స్పెషలిస్ట్. మైసూర్ మెడికల్ కాలేజ్ లో ప్రొఫెసర్ గా పనిచేసేవారు. ప్రముఖ కన్నడ దర్శకులు పుట్టన్న కణగల్ చిత్రాలతో పేరు సంపాదించిన ఆరతి అక్క మనవరాలే సంఘవి. తన చిన్నమ్మమ్మ ఆరతిని చూసి, తానూ చిత్రసీమలో చేరాలనే అభిలాష పెంచుకుంది సంఘవి. దాంతో చెన్నై చేరి అవకాశాల కోసం వేట ఆరంభించింది. సెల్వ దర్శకత్వంలో అజిత్ కుమార్ హీరోగా రూపొందిన ‘అమరావతి’ తమిళ చిత్రంతో తెరంగేట్రం చేసింది సంఘవి. తమిళ, కన్నడ, మళయాళ చిత్రాల్లో నటిస్తోన్న సంఘవికి డి.రామానాయుడు నిర్మించిన ‘తాజ్ మహల్’తో తెలుగులో నటించే అవకాశం లభించింది. ఆ సినిమా విజయం సాధించడంతో తెలుగునాట కూడా సంఘవిని పలు చిత్రాలు పలకరించాయి. రామానాయుడు నిర్మించిన “తాత-మనవడు, ఓహో నా పెళ్ళంట, నాయుడుగారి కుటుంబం” వంటి చిత్రాలలో వరుసగా నటించింది.

బాలకృష్ణతో “సమరసింహారెడ్డి, గొప్పింటి అల్లుడు”, చిరంజీవితో ‘మృగరాజు’, నాగార్జునతో “సీతారామరాజు”, వెంకటేశ్ తో “సరదా బుల్లోడు, సూర్యవంశం” చిత్రాలలో కీలక పాత్రలు పోషించింది సంఘవి. సుమన్ తో ‘ప్రియమైన శ్రీవారు, అబ్బాయిగారి పెళ్ళి’, రాజశేఖర్ తో ‘శివయ్య, రవన్న’, సురేశ్ తో ‘పట్టుకోండి చూద్దాం’, వంటి చిత్రాలలోనూ ఆమె అలరించింది. కృష్ణవంశీ రూపొందించిన ‘సిందూరం’లో సంఘవి ప్రధాన నాయిక. ఆమె నటించిన “లాహిరి లాహిరి లాహిరిలో, ఆంధ్రావాలా, సందడే సందడి, చిరంజీవులు” చిత్రాలు కూడా ఆకట్టుకున్నాయి. ఇప్పటికీ తన దరికి చేరిన చిత్రాలలో సంఘవి నటిస్తూనే ఉన్నారు. అయితే తెలుగు సినిమాల్లో ఆమె కనిపించక చాలా రోజులు అవుతోంది. ఇక ముందైనా సంఘవిని తెలుగు సినీజనం గుర్తు చేసుకొని మళ్ళీ అవకాశం కల్పిస్తారేమో చూడాలి.

-Advertisement-అప్పట్లో సందడి చేసిన సంఘవి!

Related Articles

Latest Articles