ట్యాంక్‌బండ్‌లో గణేష్‌ నిమజ్జనంపై రేపే క్లారిటీ..!

హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌లో వినాయక నిమజ్జనంపై ఉత్కంఠ కొనసాగుతోంది.. అయితే, హైదరాబాద్‌ వినాయక నిమజ్జనంపై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. హుస్సేన్‌సాగర్‌లో ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ విగ్రహాల నిమజ్జనానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించడంతో.. జీహెచ్‌ఎంసీ.. సుప్రీంకోర్టులో అప్పీల్‌కు వెళ్లింది. ఈ ఏడాది నిమజ్జనాలకు అనుమతించాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరింది. ఈ అప్పీల్‌ను స్వీకరించిన సుప్రీంకోర్టు.. రేపు విచారణ చేపట్టనుంది.

నిమజ్జనం నిబంధనలకు సంబంధించి తీర్పును పునఃసమీక్షించలేమని.. హైకోర్టు తేల్చి చెప్పడంతో సిటీలోని భారీ గణనాథుల నిమిజ్జనంపై సందిగ్ధం ఏర్పడింది. హైదరాబాద్‌లో గణేష్‌ నిమజ్జనాన్ని ఈనెల 19న నిర్వహించాలని అధికారికంగా నిర్ణయించారు. పోలీసులు కూడా అందుకు అనుగుణంగానే ప్రణాళికను సిద్ధం చేశారు. మట్టిగణపతులపై ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో.. వాటి నిమజ్జనానికి జీహెచ్‌ఎంసీ ఏర్పాట్లు ప్రారంభించింది. పది అడుగుల కంటే చిన్న విగ్రహాలను మినీ పాండ్స్‌లో నిమజ్జనం చేస్తున్నారు. పది అడుగులకు మించి ఎత్తున్న విగ్రహాలను చెరువులో నిమజ్జనం చేసేలా భారీ క్రేన్లను ఏర్పాటు చేసింది. నగరంలోని చెరువుల వద్ద ఇప్పటికే నిర్మించిన మినీపాండ్స్‌ దగ్గర నిమజ్జనాలు జరుగుతున్నాయి. పెద్ద సైజు విగ్రహాల కోసం క్రేన్లను అందుబాటులో ఉంచారు. మరోవైపు నిమజ్జనంపై సుప్రీంకోర్టులో కూడా తీర్పు అనుకూలంగా రాకపోతే.. ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురావాలని గణేష్ ఉత్సవ సమితి కోరుతోంది.

Related Articles

Latest Articles

-Advertisement-