పోటీ నుండి తప్పుకున్న ‘గంగూబాయి’

వచ్చే యేడాది జనవరి 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా దర్శక ధీరుడు రాజమౌళి మాగ్నమ్ ఓపస్ మూవీ ‘ట్రిపుల్ ఆర్’ విడుదల కాబోతోంది. దాంతో సంక్రాంతి బరిలో నిలిచే ఇతర సినిమాల పరిస్థితి సందిగ్థంలో పడింది. ఇప్పటికే ప్రిన్స్ మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’ మూవీ విడుదలను వాయిదా వేశారు. జనవరి 6న రావాల్సిన అలియాభట్ ‘గంగూబాయి కతియవాడి’ చిత్రాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నట్టు తాజాగా ప్రకటించారు. చిత్రం ఏమంటే ‘ట్రిపుల్ ఆర్’ మూవీలో అలియాభట్ నాయికగా నటించింది. అలానే అందులో కీలక పాత్ర పోషించిన బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్ గన్ సైతం ‘గంగూబాయి’లో ప్రత్యేక పాత్ర పోషించారు. సో… ముందు అనుకున్నట్టు ‘గంగూబాయి’ జనవరి 6న విడుదలై వుంటే వీరిద్దరి సినిమాలు బ్యాక్ టు బ్యాక్ వచ్చినట్టు అయ్యేది. వారి సినిమాతో వారి చిత్రమే పోటీపడేది. కానీ ఆ పోటీని తప్పిస్తూ, దర్శక నిర్మాత సంజయ్ లీలా బన్సాలీ ఈ రోజు ‘గంగూబాయి కతియావాడి’ని ఫిబ్రవరి 18న రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. ఒకరకంగా ఈ మార్పు ‘ట్రిపుల్ ఆర్’ హిందీ వర్షన్ కు మేలు చేస్తుందనే చెప్పాలి. అదే సమయంలో ‘గంగూబాయి’ సినిమాను తెలుగులోనూ డబ్ చేస్తున్నారు కాబట్టి, ఇక్కడ ఆ మూవీ విడుదలకు ఫిబ్రవరి 18న సరైన థియేటర్లు దొరికే ఆస్కారం ఏర్పడుతుంది.

Related Articles

Latest Articles