కంగనా వ్యాఖ్యలకు గాంధీ మునిమనవడి కౌంటర్

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ గాంధీజీపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఎవరైనా ఒక చెంపపై కొడితే మరో చెంప చూపించాలంటూ గాంధీ చెప్పిన సూత్రాన్ని బుధవారం నాడు కంగనా విమర్శించింది. గాంధీ చెప్పిన సిద్ధాంతంతో మన స్వాతంత్ర్యం పొందామని తనకు ఎవరో చెప్పారని… అలా ఆజాది రాదని.. కంగనా ఓ పోస్ట్ చేసింది. అయితే కంగనా వ్యాఖ్యలపై గాంధీ ముని మనవడు తుషార్ స్పందించారు.

Read Also: దుస్తులపై నుంచి తాకినా లైంగిక వేధింపులే.. స్పష్టం చేసిన సుప్రీంకోర్టు

గాంధేయవాదులు మాత్రమే రెండో చెంప చూపిస్తారని కొందరు ఆరోపిస్తున్నారని… కానీ మరో చెంప చూపించడానికి గాంధీ ద్వేషులకు అనుకున్న దాని కంటే ఎక్కువ ధైర్యం కావాలని తుషార్ గట్టిగా సమాధానమిచ్చారు. వాళ్లు వీరత్వాన్ని అర్థం చేసుకోలేని పిరికిపందలు అని, అసమర్థులు అని విమర్శించారు. ఆనాటి భారతీయులు రెండో చెంప చూపించి ఎంతో ధైర్యాన్ని చూపించారని.. అందుకే వారంతా హీరోలు అయ్యారని తుషార్ అన్నారు. భిక్షగాడు అని పిలవడాన్ని కూడా బాపూజీ స్వాగతించారని.. తన దేశం, తన ప్రజల కోసం ఇలాంటి మాటలను గాంధీజీ పట్టించుకోలేదని తుషార్ గుర్తు చేశారు. అబద్ధాలను ఎంత బిగ్గరగా అరిచి చెప్పినా.. నిజం నిలకడగా ఉంటుందన్నారు. అయితే అబద్ధాలపై స్పందిస్తేనే నిజాలు తెలుస్తాయన్నారు.

కాగా భారతదేశానికి స్వాతంత్ర్యం 1947లో కాదని 2014లో వచ్చిందని కంగనా ఇటీవల వ్యాఖ్యలు చేసింది. అంతేకాకుండా నేతాజీ సుభాష్‌ చంద్రబోస్, భగత్ సింగ్‌లకు గాంధీజీ నుంచి మద్దతు లభించలేదని… అందుకే ప్రజలు తెలివిగా ఆలోచించి గాంధీకి మద్దతు ఇస్తారా లేదా నేతాజీకి మద్దతు ఇస్తారా అనే విషయం తేల్చుకోవాలని సూచించింది. దీంతో కంగనా వ్యాఖ్యలపై విమర్శల వర్షం కురుస్తోంది.

Related Articles

Latest Articles