ఆస్కార్ ఫెర్నాండెజ్‌ మృతికి పలువురి సంతాపం

కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు ఆస్కార్ ఫెర్నాండెజ్‌ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయస్సు 80 సంవత్సరాలు.. కొన్ని రోజులుగా మంగళూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన… ఇవాళ తుదిశ్వాస విడిచారు. జులైలో యోగా చేస్తూ పడిపోవడంతో ఫెర్నాండెజ్‌ తలకు గాయమై, రక్తం గడ్డ కట్టింది. డాక్టర్లు సర్జరీ చేశారు. ఐతే చికిత్స తర్వాత కూడా ఫెర్నాండెజ్ కోలుకోలేకపోయారు. పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. ఫెర్నాండెజ్‌ గాంధీ కుటుంబానికి ఆప్తులు. సోనియా, రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితులు. మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీకి పార్లమెంట్‌ సెక్రటరీగా ఫెర్నాండెజ్ వ్యవహరించారు. అందుకే కాంగ్రెస్ పార్టీలో ఫెర్నాండెజ్‌ను మ్యాన్ ఆఫ్ ఆల్ సీజన్స్‌గా పిలుచుకుంటారు. యూపీఏ 1 హయాంలో కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రిగా, ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించారు ఫెర్నాండెజ్.

ఆస్కార్ ఫెర్నాండెజ్‌ 1941 మార్చి 27న కర్ణాటకలోని ఉడుపిలో జన్మించారు. ఆయన తండ్రి రోక్ ఫెర్నాండెజ్ హెడ్ మాస్టర్. సెయింట్ సీసిలీస్ కాన్వెంట్ స్కూల్లో విద్యను అభ్యసించిన ఆస్కార్ ఆ తర్వాత ఎంజీఎం కాలేజీలో చదువుకున్నారు. కొంతకాలం వ్యవసాయం చేశారు. ఉత్తమ వరి ఉత్పత్తిదారుడి అవార్డు కూడా అందుకున్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న ఆస్కార్ ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లారు. కాంగ్రెస్‌లో చేరి… అత్యున్నతస్థాయికి ఎదిగారు. స్పోర్ట్స్‌ అంటే ఆస్కార్ ఫెర్నాండెజ్‌కు అమితాసక్తి. కబడ్డీ, వాలీబాల్, స్విమింగ్ అంటే ఆయనకు ఎంతో ఇష్టం. యక్షగానంలో ఆయన దిట్ట. కూచిపూడి కూడా నేర్చుకున్నారు. బహుముఖ ప్రజ్ఞాశీలి అయిన ఫెర్నాండెజ్‌ను కోల్పోవడం పార్టీకి తీరని లోటని గుర్తు చేసుకున్నారు కాంగ్రెస్ నేతలు. ఇటు, తెలంగాణ సీఎం కేసీఆర్‌ కూడా ఫెర్నాండెజ్‌ మృతికి సంతాపం తెలిపారు..

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-