నిజంగానే చిత్రసీమలో ‘మణి’ ఓ రత్నం!

దేశం గర్వించదగ్గ దర్శకుల్లో మణిరత్నం తనకంటూ ఓ స్థానం సంపాదించారు. అంతర్జాతీయ వేదికలపై సైతం మణిరత్నం హవా విశేషంగా వీచింది. ఇంతకూ మణిరత్నంలో అంత గొప్పతనం ఏముందబ్బా? అంటూ ఎకసెక్కేలు చేసేవారు ఉన్నారు. ఎందుకంటే చాలా రోజులుగా మణిరత్నం చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తమ సత్తా చాటలేకపోతున్నాయి. పైగా ఆయన నుండి వస్తున్న చిత్రాలలోనూ పాతకథలే కనిపించాయి. దాంతో ఈ తరం జనం మణి సినిమాలను అంతగా పట్టించుకోవడం లేదు. అందువల్ల నవతరం ప్రేక్షకులకు మణిరత్నం చిత్రాల్లోని గొప్పతనమూ అర్థం కాదు. ఈ రోజు కాకపోయినా, మరో నాడయినా సినిమాలపై మోజున్న ఈ తరం పిల్లలు ఖచ్చితంగా మణిరత్నం చిత్రాలను అధ్యయనం చేయవలసి ఉంటుంది. కళలకు ఎల్లలు లేవు. సకల కళలకు వేదిక అయిన సినిమా కళకు ఇక ఎక్కడుంటాయి ఎల్లలు? సినిమా కూడా ఓ కళ, దానికీ కొన్ని నిర్దుష్టమైన సూత్రాలు ఉంటాయి. వాటిని అనుసరిస్తూ సినిమాలను తెరకెక్కించిన వారి కళ ప్రపంచంలోని నలుమూలల ఉన్న సినీప్రియులకు అర్థమవుతుంది. పాత సూత్రాలను తోసిరాజని, కొత్త సూత్రాలను రూపకల్పన చేసినప్పుడూ ‘అద్భుతం’ అనిపిస్తుంది. మణిరత్నం సినిమాల్లో గ్లామర్ తో పాటు గ్రామరూ ఉండేది. అందుకే సినిమా పరిజ్ఞానం ఉన్న అందరికీ మణి చిత్రాల్లోని గ్రామర్ అర్థమయ్యేది, అందులోని గ్లామరూ ఆకట్టుకొనేది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మేరియో ప్యూజో రాసిన ‘గాడ్ ఫాదర్’ ఆధారంగా ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా రూపొందించిన ‘గాడ్ ఫాదర్’ ట్రయాలజీ సినీ ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ‘గాడ్ ఫాదర్’ తొలి రెండు భాగాలు ఎంతగానో మురిపించాయి. ఈ చిత్రాలను అధ్యయనం చేసి, దర్శకత్వంలో రాణించిన వారు ఎందరో ఉన్నారు. వారిలో మణిరత్నం కూడా నేనూ ఉన్నానని చాటుకున్నారు. ‘గాడ్ ఫాదర్’ స్ఫూర్తితో మణిరత్నం తెరకెక్కించిన ‘నాయకన్’ చిత్రం ‘టైమ్ మేగజైన్’ ఎంపిక చేసిన టాప్ 100 మూవీస్ లో చోటు చేసుకుంది. దీనిని బట్టే మణిరత్నం ప్రతిభా పాటవాలేపాటివో అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రం తెలుగులో ‘నాయకుడు’ పేరుతో అనువాదమై ఇక్కడి వారినీ ఆకట్టుకుంది.

‘టైమ్ -100’లో మణిరత్నం ‘నాయకన్’ చిత్రం చూసిన అమెరికన్లు సైతం ఆ సినిమా గాడ్ ఫాదర్ ఇన్ స్పిరేషన్ తో రూపొందిందంటే నమ్మలేక పోయారు. ‘గాడ్ ఫాదర్’ స్ఫూర్తితోనే హిందీలో ‘ధర్మాత్మ’ చిత్రాన్ని రూపొందించి, అందులో నటించి ఘనవిజయం సాధించిన ఫిరోజ్ ఖాన్ కూడా ‘నాయకన్’ చూసి ఫిదా అయిపోయారు. ‘నాయకన్’ను ‘దయవాన్’ పేరుతో హిందీలో రీమేక్ చేశారు. అయితే ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. అది వేరే విషయం. ‘దయవాన్’ చూశాకే, ఉత్తరాది వారికి మణిరత్నంలోని ప్రతిభ ఏంటో అర్థమయింది. మణితో సినిమాలు తీయాలని హిందీ సినిమా ప్రముఖులు పరుగులు తీశారు. మణి రూపొందించిన ‘రోజా, బొంబాయి, దిల్ సే’ చిత్రాలు ‘టెర్రరిజమ్ ట్రయాలజీ’గా పేరొందాయి. అంతర్జాతీయ యవనికలపైనా, ఆ చిత్రాల్లోని కథాంశం ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలను చూసిన విదేశీయులు సైతం మణిరత్నం చిత్రాలను అధ్యయనం చేసి, కితాబు నిచ్చారు.

మణిరత్నం చిత్రాలు వ్యాపారపరంగానూ ఘనవిజయాలను సాధించాయి. పాత కథాంశాన్నే కొత్తగా చెప్పడంలో మణి ఎప్పుడూ ముందుంటారు. తండ్రి ఒక్కరే, తల్లులు వేరయిన ఇద్దరు కొడుకుల మధ్య సాగిన ‘ఘర్షణ’ ఆధారంగా ‘అగ్నినచ్చత్రం’ తెరకెక్కించినప్పుడు జనం జేజేలు పలికారు. వీటికి ముందు పరాజయాల పర్వంలో కొట్టు మిట్టాడిన మణి ‘మౌనరాగం’ ఆలపించగానే జనం ఒక్కసారిగా ఆయనవైపు దృష్టి సారించారు. ఆ తరువాత నుంచీ మణి వైవిధ్యంతో ప్రయాణం సాగించారు. అందుకే ఇతరుల చిత్రాలకు భిన్నంగా మణి సినిమాలు ఆకట్టుకున్నాయి. తమిళనాట టాప్ స్టార్స్ గా వెలుగొందిన కమల్ హాసన్, రజనీకాంత్ తోనూ, తరువాతి తరం కథానాయకులు ప్రభు, కార్తిక్ తోనూ మణి రూపొందించిన చిత్రాలు విశేషాదరణ చూరగొన్నాయి. ప్రఖ్యాత హాలీవుడ్ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్ బెర్గ్ రూపొందించిన ‘ఇ.టి.’ స్ఫూర్తితో మణి తెరకెక్కించిన ‘అంజలి’ ఆబాలగోపాలాన్నీ ఎంతగానో మురిపించింది. మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ఏకైక తెలుగు చిత్రం ‘గీతాంజలి’. ఈ సినిమాలో ప్రేమ ప్రేమను కోరుకుంటుందనే అంశాన్ని మణి తెరపై ఆవిష్కరించిన తీరు జనాన్ని ఆకట్టుకుంది.

మణి చిత్రాల ద్వారా ఎందరో చిత్రసీమలో వెలుగులు చూశారు. మణి ‘మౌనరాగం’తోనే కార్తిక్, రేవతి స్టార్ డమ్ చూశారు. ‘అగ్నినచ్చత్రం’తో ప్రభు, అమల స్టార్ డమ్ అందుకోగా, నిరోషాకు ఆ సినిమాతోనే మంచి గుర్తింపు లభించింది. రజనీకాంత్ ‘దళపతి’లో ఓ కీలక పాత్రలో కనిపించిన అరవింద స్వామి, మణి ‘రోజా’తో పాపులర్ స్టార్ అయిపోయాడు. ఇదే ‘రోజా’తో సంగీత దర్శకునిగా పరిచయమైన ఎ.ఆర్.రహమాన్ ఆ తరువాత మణి చిత్రాలతోనే తనదైన బాణీ పలికించాడు. ఈ రోజున రహమాన్ ఏ స్థాయిలో ఉన్నాడో అందరికీ తెలుసు. అప్పటి నుంచీ మణి సినిమాల్లో ఓ చిన్న రోల్ చేసినా చాలు అని అందరూ ఆశించేవారు. మణి ‘ఇరువర్’తోనే ఐశ్వర్యారాయ్ తెరంగేట్రం చేసింది. మణి సినిమాలతోనే పి.సి.శ్రీరామ్, సంతోష్ శివన్, రాజీవ్ మీనన్, రవి కె.చంద్రన్ వంటి సినిమాటోగ్రాఫర్స్ కు ఎనలేని పేరు లభించింది. ఇలా చెప్పుకుంటూ పోతే మణి చిత్రాల ద్వారా చిత్రసీమలో వెలుగు చూసిన వారి జాబితా పెరుగుతూ పోతుంది. ప్రముఖ నటీనటులే కాదు, పేరున్న సినిమాటోగ్రాఫర్స్, నిర్మాతలు ఎందరో మణితో పనిచేయాలని తపించారు. దానిని బట్టే ఆయన క్రేజ్ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. అందువల్ల ఈ తరం ప్రేక్షకులకు ఆయన గొప్పతనం అంతగా తెలియక పోయినా, ఆయన చిత్రాలను అధ్యయనం చేసిన రోజున మణి ప్రతిభకు అప్రతిభులు కాకమానరు. చారిత్రక నేపథ్యంలో మణిరత్నం తెరకెక్కిస్తున్న ‘పొన్నియన్ సెల్వన్’తో ఆయన మరోమారు తనదైన బాణీ పలికిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. మరి ఫ్యాన్స్ అభిలాషను మణి ఏ మేరకు నెరవేరుస్తారో చూడాలి.

(జూన్ 2న మణిరత్నం పుట్టినరోజు)

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-