పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గించేదాకా పోరాటం: బీజేపీ

పెట్రోలు, డీజిల్‌పై వ్యాట్ తగ్గించేదాకా…. బీజేపీ దశల వారీ ఉద్యమం ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తెలిపారు. ఈరోజు మధ్యాహ్నం పార్టీ మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి పదాధికారులు, వివిధ మోర్చాల అధ్యక్షులతో బండి సంజయ్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో చేపట్టాల్సిన నిరసన కార్యక్రమాలపై చర్చించారు. నేడు, రేపు అన్ని మండల కేంద్రాల్లో ఎద్దుల బండ్లపై బీజేపీ కార్యకర్తల ధర్నాలు ఉంటాయన్నారు. డిసెంబర్ 1న బీజేవైఎం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లో ప్లకార్డులు, నల్లబ్యాడ్జీలతో నిరసన, 2న మహిళా మోర్చా ఆధ్వర్యంలో కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలపై బ్యానర్లతో నిరసన, 3న ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లోని అంబేద్కర్ విగ్రహాల వద్ద ధర్నాలు, 4న ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో గాంధీ విగ్రహాల వద్ద ధర్నాలు, 5న ఎస్టీ మోర్చా, 6న కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మార్కెట్ యార్డుల వద్ద నిరసన, డిసెంబరు 7న మైనార్టీ మోర్చా కార్యకర్తల ధర్నా కార్యక్రమాలు ఉంటాయని బండి సంజయ్‌ తెలిపారు.

పెట్రోలో, డీజిల్‌పై విధించిన 35.2 శాతం వ్యాట్ ను తగ్గించకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోలు, డీజిల్ ధరలపై వ్యాట్ ను తగ్గించే వరకు బీజేపీ ఆధ్వర్యంలో నేటి నుండి దశల వారీగా ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ‘‘కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ ప్రజలపై భారం పడకూడదనే ఉద్దేశంతో దీపావళి సందర్భంగా ఈనెల 3న పెట్రోల్ ధరలను ఒక్కో లీటర్ పై రూ. 5లు, డీజిల్ పై రూ. 10 తగ్గించారు. ప్రజలపై భారం తగ్గించేందుకు రాష్ట్రాలు తమ పన్నుల వాటాను కూడా తగ్గించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని పిలుపు మేరకు కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలుసహా దాదాపు 23 రాష్ట్రాల ప్రభుత్వాలు ధరలను తగ్గించాయి. కేసీఆర్‌ సర్కార్‌ తగ్గించలేదని ఆరోపించారు. 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత పెట్రోలు, డీజిల్ పై పెంచిన 4 శాతం వ్యాట్ ను తగ్గించే చర్యలు తీసుకోకుండా సమస్యను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.

గత ఏడాది మే నుండి ఈ ఏడాది నవంబర్ వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్రోల్‌పై లీటర్‌కు రూ. 8.83, డీజిల్‌పై రూ.5.68 వ్యాట్‌ని పెంచింది. సాధారణంగా ఇన్‌పుట్ ధర పెరుగుదల సమయంలో అదనపు పన్ను విధింపును కేంద్రం అనుమతించడం లేదు. ప్రజావాణికి అనుగుణంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించే వరకు బీజేపీ ఆందోళన కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఈ విషయంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, వివిధ మోర్చాల నాయకులు స్ఫూర్తిదాయకంగా పోరాడాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.

Related Articles

Latest Articles