పండుగ పేరు చెబితే హడలిపోతున్న హుజురాబాద్ అభ్యర్థులు?

తెలంగాణలోని హుజూరాబాద్ లో తప్ప రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ కూడా ఎలాంటి ఎన్నికలు లేవు. ఈ ఒక్క ఉప ఎన్నికనే రాబోయే సార్వత్రిక ఎన్నికలను డిసైడ్ చేయనుందని ప్రచారం జరుగుతోంది. దీంతో గతంలో ఎన్నడూ లేనివిధంగా హుజూరాబాద్ లో రాజకీయవేడి రాజుకుంది. ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాకముందే ఇక్కడ అన్ని పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. త్వరలోనే ఉప ఎన్నిక షెడ్యూల్ వస్తుందని అందరూ భావిస్తుండగా కేంద్ర ఎన్నికల సంఘం అందరికీ షాకిచ్చింది.

కరోనా నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. దీపావళి తర్వాతే ఉప ఎన్నికకు షెడ్యూల్ వస్తుందని సూత్రప్రాయంగా హింటిచ్చింది. దీంతో హుజురాబాద్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు నిరుత్సాహంలో మునిగిపోయారు. ఇప్పటికే ఎన్నికల కోసం అభ్యర్థులు లక్షలాది రూపాయలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. నిత్యం అక్కడ విందు రాజకీయాలు నడుస్తుండటంతో మద్యం ఏరులై పారుతుందని సమాచారం. ఈ ఎన్నిక అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకం కావడంతో ఎవరూ తగ్గెదేలే అన్నట్లుగా డబ్బులను ఖర్చు చేస్తున్నారు.

ప్రస్తుతం ఎన్నికలు వాయిదా పడడంతో నేతలు నిరుత్సాహపడుతున్నారు. మరో రెండునెలలపాటు ఓటర్లను కాపాడుకోవాలంటే ఖర్చు తడిసిమోపడు కానుందని పోటీ చేస్తున్న అభ్యర్థులు బాధపడుతున్నారట. దీనికితోడు మున్ముందు అన్ని పెద్దపెద్ద పండుగలే ఉండటంతో ఖర్చు గురించి ఆలోచిస్తేనే నేతల గుండెలు గుబేలుమంటున్నాయట. వినాయక చవితి, దసరా పండుగలను తొమ్మిదిరోజుల నిర్వహించాలంటే మాములు విషయం కాదు. సరే లే తర్వాత చుద్దాం అంటే ఇప్పుడు నడవదు. దీంతో తప్పనిసరిగా అందరినీ కలుపుకుపోక తప్పని పరిస్థితి నెలకొంది.

ఇదే అదునుగా కొందరు యువజన సంఘాల నాయకులు వీధికో మండపాన్ని పెడుతూ చందాలను వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికితోడు గణపతి బప్పా సెంటిమెంట్ ఉన్న నేతలకు ఎవరినీ కాదనలేని పరిస్థితి. దీంతో ఎలక్షన్ కు ముందే నేతలు వేలకు వేలకు సమర్పించుకుంటారని తెలుస్తోంది. వినాయక చవితి తర్వాత దసరా రానుంది. ఈ పండుగ తెలంగాణలో అతిపెద్ద పండుగ. బతుకమ్మ ఆటపాటలు కోలాహాలాలు.. ఆ జోషే వేరేలే అన్నట్లు సాగుతుంది. ఈ పండుగకు ప్రధానంగా దావత్ లు ధూం ధాం వేడుకలు జరగాల్సిందే.

దీంతో ఎన్నికల ముందే అన్ని పార్టీల అభ్యర్థులకు చుక్కలు కన్పిస్తున్నాయట. ముఖ్యంగా గెలుపు కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్ధపడుతున్న బీజేపీ, టీఆర్ఎస్ అభ్యర్థులకు ‘ఇన్ ఫ్రంట్ క్రోకడైల్ ఫెస్టివల్’ అన్నట్లుగా పరిస్థితి మారింది. ఇప్పటికే లక్షలాది రూపాయలను మంచినీళ్లలా ఖర్చు చేసిన నాయకులు ఈ విఘ్నాన్ని కూడా విజయవంతంగా దాటేందుకే సిద్ధమవుతున్నారట. దీంతో హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఈ పండుగలు పీడకలను మిగిలిస్తుండగా.. స్థానికులకు మాత్రం నిజంగానే పండుగను తీసుకొచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Related Articles

Latest Articles

-Advertisement-