రైతుల ఆందోళనల విరమణ..! నేడే తుదినిర్ణయం..

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ శివార్లలో రైతులు చేపట్టిన ఆందోళనకు ఏడాది దాటింది.. సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలతో ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ దిగివచ్చారు.. రైతులకు క్షమాపణలు చెప్పి.. కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు.. అయితే, మరికొన్ని డిమాండ్ల సాధన కోసం రైతులు ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు.. కానీ, తాజా పరిస్థితి చూస్తుంటే ఆందోళన విరమించే అవకాశాలు కనిపిస్తున్నాయి.. తమ భవిష్యత్తు కార్యాచరణపై సంయుక్త కిసాన్‌ మోర్చా ఇవాళ కీలక ప్రకటన చేయనుంది. రైతు సమస్యలపై రైతు సంఘాలు లేవనెత్తిన దాదాపు అన్ని డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని, మున్ముందు లేవనెత్తాల్సిన సమస్యలు, ఆందోళనపై రైతు సంఘాల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని రైతు సంఘం నేత కుల్వంత్‌ సింగ్‌ సంధు వెల్లడించారు.. ఈ మేరకు ఇవాళ ఎస్‌కేఎం ప్రకటన చేసే అవకాశం ఉంది.

ఇప్పటికే వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్న కేంద్రం.. తాము లేవనెత్తిన దాదాపు అన్ని డిమాండ్ల పరిష్కారంపై సానుకూలంగా ఉందని.. దానిపై కేంద్ర సర్కారు నుంచి లేఖ వచ్చిందని చెబుతున్నారు రైతు సంఘాల నేతలు.. 40 రైతు సంఘాలతో కూడిన ఎస్‌కేఎం ప్రతినిధులు నిన్న భేటీ అయ్యారు.. రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా మాట్లాడి, కమిటీ ఏర్పాటు చేసుకోవాలని సూచించిన నేపథ్యంలో జరిగిన ఈ సమావేశంలో.. అన్ని అంశాలు చర్చకు వచ్చాయి.. సుదీర్ఘ కాలంగా సాగుతోన్న ఆందోళనను విరమించాలంటూ కేంద్రం చేసిన ప్రతిపాదనపై కూడా చర్చించినట్లుగా తెలుస్తోంది.. ఇక, రైతు సమస్యల పరిష్కారంపై కేంద్రం సానుకూలత వ్యక్తం చేస్తుండడంతో ఆందోళలకు ముగింపు పలికే అవకాశాలున్నాయని ఎస్‌కేఎం నేతలు చెబుతున్నారు… దీనిపై భారత్‌ కిసాన్‌ యూనియన్‌ రాకేష్‌ టికాయత్‌ కూడా కొంత క్లారిటీ ఇచ్చారు.. ఆందోళన విరమణపై తుది నిర్ణయం బుధవారం తీసుకుంటామని వెల్లడించారు.. మొత్తంగా ఇవాళ ఆందోళన విరమణపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.

Related Articles

Latest Articles