సమంత ఐటమ్ సాంగ్ చేస్తే!?

టాలీవుడ్ లో ప్రస్తుతం హాట్ టాపిక్ సమంత ఐటమ్ సాంగ్. నాగచైతన్యతో విడిపోయిన తర్వాత తెలుగులో ఏ కొత్త సినిమా సైన్ చేయని సమంత ‘పుష్ప’ సినిమాలో ఐటమ్ సాంగ్ చేస్తున్నట్లు వార్తలు వినవస్తున్నాయి. ఈ విషయాన్ని అటు ‘పుష్ప’ యూనిట్ కాని ఇటు సమంత కానీ ధృవీకరించలేదు. అయితే ఈ నెల 28 నుంచి ఈ పాట చిత్రీకరణ మొదలు కానుందని, దీనికోసం భారీ సెట్ ను రూపొందిస్తున్నారని, ఈ పాట కోసం సమంత కోటిన్నర వరకూ వసూలు చేస్తుందని ఇలా పలు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

అయితే సమంత ఐటమ్ సాంగ్ విషయంలో పాజిటీవ్, నెగెటీవ్ రియాక్షన్స్ వెలువడుతున్నట్లు సోషల్ మీడియా కోడై కూస్తోంది. గతంలో పారితోషికం ముఖ్యం కాదు… సెల్ఫ్ శాటిస్ ఫ్యాక్షన్ ఉన్న సినిమాలనే చేస్తానన్న సమంత ఇప్పుడు కేవలం టెంప్టింగ్ రెమ్యూనరేషన్ కోసమే ఐటెం నంబర్‌కి అంగీకరించటం సబబు కాదని కొందరు వ్యాఖ్యానిస్తుంటే… తనని తాను మళ్ళీ ప్రూవ్ చేసుకోవటానికి, ఎలాంటి పాత్రలనైనా చేయగలను అని నిరూపించుకోవటానికి ఈ ఐటమ్ నెంబర్ పనికి వస్తుందని మరి కొందరంటున్నారు. ఒక్కటి మాత్రం నిజం. సమంత ఏ పాత్రలోనైనా ఇమిడిపోగల నికార్సైన నటి. ఇప్పుడు ఆమె కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు.

అయితే ‘జాను’ వంటి డిజాస్టర్ తర్వాత, విడాకులు వంటి సెన్సేషన్ న్యూస్ తర్వాత మళ్ళీ ఓ సక్సెస్ తో కెరీర్ లో సెలబ్రేషన్ చేసుకోవలసిన అవసరం మాత్రం ఉంది. దానికి గుణశేఖర్ ‘శాకుంతలం’ తప్పక ఉపయోగపడుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఆ సినిమా రావటానికి టైమ్ పడుతుంది కనుక సమంత ‘పుష్ప’లో ఐటమ్ సాంగ్ ని ఛాలెంజ్ గా తీసుకుని ఒప్పుకుని ఉండవచ్చు. దానిని తనని తప్పు పట్టవలసిన అవసరం లేదు. అక్కినేని కుంటుంబ మాజీ కోడలు కాబట్టి ఐటమ్ సాంగ్ చేయటం అనే ఓ చిన్న సందేహం ప్రేక్షకులలో ఉండవచ్చు. అయితే సుకుమార్ దర్శకుడు కావటం, మరోస్టార్ ఫ్యామిలీకి చెందిన బన్నీ హీరో కావటం, దేవిశ్రీ ప్రసాద్ వంటి ఐటమ్ సాంగ్ స్పెషలిస్ట్ సంగీత దర్శకుడు కావటంతో దీనికి ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది.

ప్రస్తుతం చెన్నైలో ఉన్న సమంత రెండు రోజుల ముందుగా హైదరాబాద్ వచ్చి ఈ పాట ప్రాక్టీస్ సెషన్స్ లో పాల్గొనబోతోందట. సమంత నిజంగా ఈ ఐటమ్ సాంగ్ చేస్తే బన్నీ అభిమానులకు మాత్రం పండగే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన నాలుగు పాటలు యూ ట్యూబ్ ని షేక్ చేస్తున్నాయి. డిసెంబర్ 17న ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. మరి ఈ ‘పుష్ప’లో సమంత చేయబోయే డాన్స్ నెంబర్ ఆ సినిమాకు ఏ మేరకు ప్లస్ అవుతుందన్నది చూడాల్సిందే.

Related Articles

Latest Articles