క్రియేటివిటీకి కమర్షియల్ అంశాలు జోడించిన కె.ఎస్. రామారావు

(ప్రముఖ నిర్మాత కె.ఎస్. రామారావు బర్త్ డే సందర్భంగా)

‘కుదరవల్లి శ్రీ రామారావు తెలుసా?’ అంటే ‘ఆయనెవరు?’ అనే ఎదురుప్రశ్న వస్తుంది. అదే ‘కె.యస్. రామారావు తెలుసా?’ అనగానే ‘క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కదా!’ అనే సమాధానం వస్తుంది. జూలై 7న విజయవాడలో హరి పురుషోత్తం, రంగనాయకమ్మ దంపతులకు జన్మించిన కె. ఎస్. రామారావు అసలు పేరు కుదరవల్లి శ్రీ రామారావు. అయితే చిత్రజగత్తులో మాత్రం ఆయన కె.యస్. రామారావుగా ప్రసిద్ధులయ్యారు. ఇవాళ ఆయన జన్మదినం. తెలుగు చిత్రసీమతో ఐదున్నర దశాబ్దాల అనుబంధం ఆయనది. రెండు తరాలకు చెందిన అగ్రకథానాయకులతో సినిమాలు నిర్మించిన అనుభవం ఆయనది.

1967లోనే మిత్రుల సహకారంతో చెన్నయ్ చేరి సీనియర్ దర్శకులు కె. యస్. ప్రకాశరావు దగ్గర ‘బందిపోటు దొంగలు, విచిత్ర కుటుంబం, నా తమ్ముడు’ చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేశారు కె.యస్. రామారావు. ఆ తర్వాత తండ్రి అనారోగ్య కారణంగా బెజవాడకు తిరిగి వచ్చేసి, క్రియేటివ్ కమర్షియల్స్ ను స్థాపించారు. రేడియో పబ్లిసిటీ వ్యాపారంతో మొదలైన ఆయన ప్రస్థానం తదనంతరం అగ్ర చిత్రాల నిర్మాణంతో అప్రతిహతంగా సాగింది. నిర్మాతగా కె.యస్. రామారావు జర్నీ డబ్బింగ్ సినిమాలతో మొదలైంది. ‘నన్ను ప్రేమించు, ఎర్ర గులాబీలు, టిక్ టిక్ టిక్’ వంటి సినిమాలను తెలుగులో విడుదల చేసిన ఆయన, ఆ తర్వాత 1982లో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ మీద ‘అభిలాష’ చిత్రం నిర్మించారు. యండమూరి వీరేంద్రనాథ్ రాసిన ‘అభిలాష’ నవలను, ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో అదే పేరుతో వెండితెరకెక్కించారు. ఆ సినిమా విజయం సాధించడంతో అదే ఊపుతో ‘ఛాలెంజ్, రాక్షసుడు, మరణమృదంగం, స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్’ చిత్రాలను చిరంజీవి హీరోగా నిర్మించారు.

వెంకటేశ్ తో ‘చంటి’, బ్రహ్మానందంతో ‘బాబాయ్‌ హోటల్‌’, నరేశ్ తో ‘కొంగుచాటు కృష్ణుడు’, మాధవితో ‘మాతృదేవో భవ’, రాజశేఖర్ తో ‘అంగరక్షకుడు’, ప్రశాంత్ తో ‘బాయ్ ఫ్రెండ్‌’, నాగార్జునతో ‘క్రిమినల్’, శ్రీకాంత్ తో ‘హలో ఐ లవ్ యూ’ చిత్రాలు ప్రొడ్యూస్ చేశారు. అలానే మిత్రులతో కలిసి వెంకటేశ్ తో ‘వాసు’, రవితేజతో ‘వీడే’, తన కుమారుడు వల్లభ్ ను హీరోగా పరిచయం చేస్తూ ‘ఎవరే అతగాడు’, అక్కినేని, సిద్ధార్థ్ లతో ‘చుక్కల్లో చంద్రుడు’ వంటి చిత్రాలను ప్రొడ్యూస్ చేశారు. మిత్రుడు చనుమోలు అప్పారావు నిర్మాతగా కె. ఎస్. రామారావు సమర్పకునిగా తెరకెక్కిన ‘స్వర్ణ కమలం’ అవార్డుల పంట పండించింది. అలానే రాజశేఖర్ తో ‘రౌడీయిజం నశించాలి’ అనే సినిమాను నిర్మించారు. ఇక సోదరుడు బెనర్జీ నిర్మాతగా కె. యస్. రామారావు నిర్మించిన ‘పుణ్యస్త్రీ, ముత్యమంత ముద్దు, ఆర్తనాదం, అగ్ని ప్రవేశం’ చిత్రాలు పేరు తెచ్చిపెట్టాయి. ‘మరణమృదంగం’ మూవీతో చిరంజీవికి మెగాస్టార్ అనే బిరుదును ఇచ్చింది కె.యస్. రామారావే.

ప్రభాస్ తో ‘బుజ్జిగాడు’, ఎన్టీయార్ తో ‘దమ్ము’ చిత్రాలను నిర్మించిన కె.ఎస్. రామారావు ఓ పక్క భారీ బడ్జెట్ చిత్రాలు తీస్తూనే ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’, ‘కౌసల్య కృష్ణమూర్తి’ వంటి సందేశాత్మక చిత్రాలు తీశారు. ఆమధ్య సాయిధరమ్ తేజ్ తో ‘తేజ్’ చిత్రాన్ని నిర్మించిన ఆయన… ఇటీవల విజయ్ దేవరకొండ హీరోగా ‘వరల్డ్ ఫేమస్ లవర్’ మూవీని ప్రొడ్యూస్ చేశారు. ఇందులో కొన్ని సినిమాలకు ఆయన సమర్పకుడు కాగా, కుమారుడు అలెగ్జాండర్ వల్లభ నిర్మాతగా వ్యవహరించారు. 55 సంవత్సరాల సినీ ప్రయాణంలో నిర్మాతగా ఉండటమే కాకుండా, ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతల మండలి, చలన చిత్ర అభివృద్ధి సంస్థ, ఎఫ్.ఎన్.సి.సి.లలో కీలక బాధ్యతలను నిర్వర్తించి, తన వంతు సేవలను కె.యస్. రామారావు అందించారు. దర్శకుల క్రియేటివిటీకి తనవంతుగా కమర్షియల్ అంశాలను జోడించడం వల్లే క్రియేటివ్ కమర్షియల్స్ సంస్థను ఇంతకాలంగా అగ్రస్థానంలో ఉంచగలిగారు కె.యస్. రామారావు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-