‘బంగార్రాజు’పై ఎగ్జిబిటర్స్ అలక

నాగార్జున, నాగచైతన్య కలసి నటించిన ‘బంగార్రాజు’ సినిమా సంక్రాంతి విడుదలకు ముస్తాబవుతోంది. జనవరి 14న రాబోతున్న ఈ సినిమాపై ఆంధ్రప్రదేశ్ లోని ఎగ్జిబిటర్స్ అలకపూనినట్లు వినవస్తోంది. దీనికి కారణం ఇటీవల ప్రెస్ మీట్ లో థియేటర్లలో టికెట్ రేట్ల విషయంలో నాగార్జున స్పందన అని అంటున్నారు. ‘సోగ్గాడే చిన్ని నాయన’కు సీక్వెల్ గా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో జీస్టూడియోస్ తో కలసి అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన ‘బంగార్రాజు’ను సంక్రాంతికే విడుదల చేస్తున్నామని తెలియచేయటానికి ఇటీవల విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆ మీట్లో ఏపీ ప్రభుత్వం టిక్కెట్ రేట్లు తగ్గించింది కదా? మరి మీకెలాంటి ఇబ్బంది లేదా? అన్న ప్రశ్నకు నాగ్ తన సినిమాకు ఎలాంటి ఇబ్బంది ఉండదని బదులిచ్చారు. అంతే కాదు సినిమా వేదికపై రాజకీయాలు మాట్లాడనని సెలవిచ్చాడు. అంతే కాదు టిక్కెట్ రేట్ల వల్ల తన సినిమాకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పటంపై ఇటు పరిశ్రమలోనూ అటు ఎగ్జిబిషన్ రంగంలోనూ తీవ్రస్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. బాయ్ కాట్ బంగార్రాజు అంటూ సోషల్ మీడియాలో హల్ చల్ నడుస్తోంది.

‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ వంటి సినిమాలు బరిలో లేకపోడవంతో ప్రస్తుతం ‘బంగార్రాజు’పైనే అందరి కళ్ళూ ఉన్నాయి. పాటలు, ట్రైలర్స్ కి పాజిటీవ్ స్పందన లభించటంతో ముందునుంచి చెబుతున్నట్లు ఎలాగైనా సంక్రాంతికే రావాలనే తపనతో యూనిట్ మొత్తం రేయింబవళ్ళు కష్టపడుతోంది. ఈ నేపథ్యంలో నాగ్ వ్యాఖ్యలకు ఎపిలోని ఎగ్జిబిటర్స్ అలకబూనినట్లు సమాచారం. ఇదిలా ఉంటే జగన్ ఫ్యామిలీతో నాగార్జునకు సన్నిహిత సంబంధాలు ఉన్నందు వల్లనే నాగ్ అలా స్పందించారని, టిక్కెట్ రేట్లు ఇండస్ర్టీ కి ఇబ్బంది కలిగించే అంశమైనా తనకు ఇబ్బంది లేదని చెప్పటం సబబుగా లేదనే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఇక ‘సోగ్గాడే చినినాయనా’ తర్వాత హిట్ లేని నాగార్జున ఆశలన్నీ ‘బంగార్రాజు’ పైనే ఉన్నాయి. మరి నాగ్ ఆశలను ‘బంగార్రాజు’ తీరుస్తాడా? అలక వహించిన ఎగ్జిబిటర్స్ నుంచి నాగ్ కి ఎలాంటి కోఆపరేషన్ లభిస్తుందన్నది మరి కొద్ది రోజులు ఆగితే కానీ తెలియదు. లెట్స్ వెయిట్ అండ్ సీ

Related Articles

Latest Articles