టీఆర్ఎస్‌లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులపై ఉత్కంఠ..!

తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు తేలడంతో.. ఇప్పుడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు ఎవరనేది ఉత్కంఠ రేపుతోంది. ఎమ్మెల్యే కోటాలో ఓసీ సామాజికవర్గానికి ఎక్కువ ఎమ్మెల్సీలు దక్కడంతో.. స్థానిక కోటాలో బీసీ లెక్కలు తెరపైకి వస్తున్నాయి. 12 మంది సిట్టింగ్‌లలో సగానికి సగం మంది అభ్యర్థులను మార్చే ఛాన్స్ కనిపిస్తోంది.

రెండేళ్లే పదవిలో ఉన్నవారిలో ముగ్గురికి రెన్యువల్‌..?

తెలంగాణలో పదవీకాలం ముగిసే 12 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడంతో టీఆర్‌ఎస్‌లో రాజకీయ వేడి మొదలైంది. డిసెంబర్‌ పదిన పోలింగ్. ఆదిలాబాద్ జిల్లాలో పురాణం సతీష్‌, వరంగల్ జిల్లాలో పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, నల్లగొండ జిల్లాలో తేర చిన్నపరెడ్డి, మెదక్ జిల్లాలో భూపాల్‌ రెడ్డి, నిజామాబాద్ జిల్లాలో కల్వకుంట్ల కవిత, ఖమ్మం జిల్లాలో బాలసాని లక్ష్మీనారాయణ, కరీంనగర్ జిల్లాలో నారదాసు లక్ష్మణ్, భానుప్రసాద్ రావు, మహబూబ్‌నగర్ జిల్లాలో కసిరెడ్డి నారాయణరెడ్డి, దామోదర్‌ రెడ్డి, రంగారెడ్డి జిల్లాలో పట్నం నరేందర్ రెడ్డి, శంభీపూర్ రాజుల పదవీకాలం ముగియనుంది. ఈ 12 మందిలో నలుగురు ఉపఎన్నికల్లో గెలిచారు. కల్వకుంట్ల కవిత, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తేర చిన్నపరెడ్డి, పట్నం మహేందర్ రెడ్డిలు రెండేళ్లే ఆ పదవుల్లో ఉన్నారు. తేరా చిన్నపరెడ్డి మినహా మిగిలిన ముగ్గురికి రెన్యువల్ ఖాయమైనట్టేనని ప్రచారం జరుగుతోంది.

రెండుసార్లు ఎమ్మెల్సీలుగా చేసినవారికి సీటు డౌటే..?

పదవీకాలం ముగుస్తున్న 12 మందిలో రెండుసార్లు ఎమ్మెల్సీలుగా చేసినవాళ్లు నలుగురు ఉన్నారు. బాలసాని లక్ష్మీనారాయణ, భానుప్రసాద్ రావు, భూపాల్ రెడ్డి, నారదాసు లక్ష్మణ్ రావు అదే స్థానాల నుంచి రెండుసార్లు ప్రాతినిథ్యం వహించారు. ఇద్దరు కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకసారి గెలిచినా.. మిగిలిన ఇద్దరు మాత్రం టిఆర్‌ఎస్ నుంచే రెండుసార్లు ఎమ్మెల్సీలు అయ్యారు. రెండుసార్లు ఎమ్మెల్సీలుగా ఉన్నవారికి ఇప్పుడు మళ్లీ సీటు డౌటే. పూర్తిస్థాయి మెజార్టీ అధికార టిఆర్ఎస్‌కే ఉండటంతో ఈ దఫా కొత్త వారికి ఛాన్స్‌ ఇవ్వాలని ఆలోచిస్తున్నారట.

కరీంనగర్‌లో బీసీ నేతల పేర్లు పరిశీలన..?
మెదక్‌ నుంచి ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు ఛాన్స్‌?

పదవీకాలం ముగిసేవారిలో మరికొందరికి సీటు నిరాకరించే ఛాన్స్ ఉంది. ఆదిలాబాద్‌లో పురాణ సతీష్ స్థానంలో వేణుగోపాలాచారి, శ్రీహరిరావు పేర్లను పరిశీలిస్తున్నారు. ఖమ్మంలో బాలసాని స్థానంలో తుమ్మల నాగేశ్వరరావు, తాతా మధు పేర్లు చర్చల్లో ఉన్నాయి. కరీంనగర్‌లో రెండు సీట్లు ఖాళీ అవడంతో బీసీలకు ప్రాధాన్యం ఇస్తారని టాక్‌. ఆకుల లలిత, మాజీ మేయర్ రవీందర్ సింగ్ పేర్లను అధిష్ఠానం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. మహబూబ్‌ నగర్ జిల్లా నుంచి దామోదర్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి స్థానంలోనూ వెనకబడిన వర్గాలకు ఛాన్స్ ఇస్తారట. నల్లగొండ జిల్లాలో తేరా చిన్నపరెడ్డి స్థానంలో ఓసీకి ఇవ్వాలనుకుంటే కోటిరెడ్డి, వేమిరెడ్డి పేర్లు, బీసీలకు ఇవ్వాలనుకుంటే కర్నాటి విద్యాసాగర్‌, కర్నె ప్రభాకర్ పేర్లను ఆలోచిస్తున్నారట. మెదక్ జిల్లా భూపాల్ రెడ్డి స్థానంలో ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు దక్కే ఛాన్స్ ఉంది. ఎమ్మెల్యే కోటాలో ఎక్కువ మంది ఓసీలు కావడంతో స్థానిక సంస్థల కోటాలో అభ్యర్థులను మార్చి బీసీలకు పెద్ద పీట వేసే అవకాశాలున్నాయి.

Related Articles

Latest Articles