జానారెడ్డి తనయులు దూకుడు పెంచారా?

ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని ఆ నాయకుడు గతంలోనే ప్రకటించినా.. ఉపఎన్నికలో పోటీ చేయక తప్పలేదు. వచ్చే ఎన్నికల్లో బరిలో ఉంటారో లేదో తెలియదు. కానీ.. ఆయన ఇద్దరు తనయులు మాత్రం చెరో నియోజకవర్గాన్ని ఎంచుకుని.. కాలికి బలపం కట్టుకున్నట్టుగా తిరిగేస్తున్నారు. దీంతో పెద్దాయన దారెటు అని కేడర్‌లోనూ.. పార్టీలోనూ చర్చ మొదలైంది.

వారసులను రంగంలోకి దించేశారా?

కుందూరు జానారెడ్డి. చాలాసార్లు రాజకీయాలకు దూరంగా ఉంటానని చెబుతూ వచ్చారు ఈ మాజీ మంత్రి. 2018లో నాగార్జునసాగర్‌లో ఓడిన తర్వాత కామైపోయారు. ఇంతలో ఉపఎన్నిక రావడంతో బలవంతంగా బరిలో దిగారు. మళ్లీ ఓడిన తర్వాత ప్రస్తుత రాజకీయాలపట్ల ఆయన ఒకింత ఆవేదనతో ఉన్నట్టు కనిపించింది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారో లేదో తెలియదు. వారసులను మాత్రం ఇప్పటి నుంచే రంగంలోకి దించేస్తున్నారట.

ఉపఎన్నికలో తండ్రి తరఫున తనయులే ప్రచారం..!

మాజీ మంత్రి జానారెడ్డికి ఇద్దరు తనయులు. ఒకరు రఘువీర్‌.. రెండో కుమారుడు జైవీర్‌. ఇద్దరూ పొలిటికల్‌గా యాక్టివ్‌గానే ఉంటున్నారు. గతంలో తండ్రి ఎమ్మెల్యేగా గెలిచిన నాగార్జునసాగర్‌లో జైవీర్‌రెడ్డి విస్తృతంగా పర్యటనలు సాగిస్తున్నారు. కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలతో ఒక్కటే మంతనాలు. రేపోమాపో ఎన్నికలన్నట్టు హడావిడి చేస్తున్నారు జానా రెండో తనయుడు. గతంలో ఇదే నియోజకవర్గలో జానా పెద్ద కుమారుడు రఘువీర్‌రెడ్డి తండ్రి తరఫున బాధ్యతలు చూస్తూ ఉండేవారు. ఇటీవల జరిగిన ఉపఎన్నికలో మాత్రం ఇద్దరు అన్నదమ్ములు కలిసి ప్రచారాన్ని పర్యవేక్షించారు.

నాగార్జునసాగర్‌లో జైవీర్‌ చురుకుగా పర్యటనలు..!
మిర్యాలగూడపై రఘువీర్‌ ఫోకస్‌..!

రఘువీర్‌ ప్రస్తుతం నాగార్జునసాగర్‌పై పెద్దగా ఫోకస్‌ పెట్టడం లేదట. అంతా జైవీర్‌ హవా నడుస్తోందట. తండ్రిలా కూల్‌గా కాకుండా.. కొంత దూకుడుగా కార్యకర్తల దగ్గరకు వెళ్తున్నారట. దీంతో వచ్చే ఎన్నికల్లో నాగార్జునసాగర్‌లో జానారెడ్డి పోటీ చేస్తారా లేక జైవీర్‌ బరిలో ఉంటారా అనే చర్చ మొదలైంది. అయితే రఘువీర్‌ పరిస్థితి ఏంటి? దీనిపైనా చర్చ స్టార్ట్‌. నాగార్జునసాగర్‌కు ఆనుకుని ఉండే మిర్యాలగూడపై పెద్దబ్బాయి ఫోకస్‌ పెట్టారట. 2018 ఎన్నికల్లోనే మిర్యాలగూడ నుంచి పోటీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు రఘువీర్‌రెడ్డి. పాదయాత్రలు చేశారు. కానీ.. ఒకే ఇంట్లో రెండు టికెట్ల పీటముడి కారణంగా జానా తనయుడికి పార్టీ టికెట్‌ నిరాకరించింది.

పరిస్థితులకు అనుగుణంగా జానా పావులు కదుపుతారా?

ఇప్పుడు కూడా ఒకే ఇంట్లో రెండు టికెట్ల ఇవ్వబోమనే రూల్‌ ఉంటుందో లేదో కానీ.. మళ్లీ మిర్యాలగూడలో పని మొదలుపెట్టేశారు రఘువీర్‌రెడ్డి. వచ్చే ఎన్నికల్లో అక్కడ నుంచి పోటీ చేసేందుకు అంతా సిద్ధం చేసుకుంటున్నారట. జానారెడ్డికి మిర్యాలగూడ ప్రాంతంలో పరిచయాలు ఉన్నాయి. అది కూడా పెద్దబ్బాయికి కలిసి వస్తుందని పార్టీ వర్గాల అంచనా. ఇంత వరకు బాగానే ఉన్నా.. జానారెడ్డి భవిష్యత్‌ కార్యాచరణ ఏంటన్నదే ఇప్పుడు ప్రశ్న. క్రమంగా ఆయన ప్రత్యక్ష ఎన్నికల నుంచి తప్పుకొని.. పరిస్థితులకు అనుగుణంగా పావులు కదుపుతారనే చర్చ ఉంది.

గెలిస్తే చాలని.. జానా తనయులకు టికెట్లు ఇస్తారా..?

తెలంగాణలో బలం పుంజుకోవాలి.. శక్తి చాటాలా అన్నది కాంగ్రెస్‌ ఆలోచన. ఈ పరిస్థితుల్లో జానారెడ్డి కుటుంబానికి రెండు సీట్లు ఇస్తారా? గెలిస్తే చాలు.. ఒకే ఇంట్లో రెండు సీట్లు పెద్ద సమస్య కాదని పార్టీ భావించొచ్చు అన్నది కొందరి వాదన. పైగా జానారెడ్డికి పెద్దకుమారుడినని చెప్పుకొన్న పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చక్రం తిప్పి రఘువీర్‌, జైవీర్‌లకు టికెట్లు ఇప్పిస్తారో లేదో చూడాలి.

Related Articles

Latest Articles