ధర్మ సంకటంలో ధర్మాన

సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేసిన ఆ నాయకుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా నియోజకవర్గానికే పరిమితం అయ్యారు. మరోసారి కేబినెట్‌లో చోటుదక్కలేదన్న ఆవేదనో ఏమో.. సైలెంట్‌. ఇప్పుడు గేర్‌మార్చి మాటల తూటాలు పేలుస్తున్నారు. ఎందుకలా?

ధర్మాన ప్రసాదరావు కామెంట్స్‌తో అలజడి..!
ధర్మాన ప్రసాదరావు. ఆయన మాట్లాడితే ఒక పదం ఎక్కువ తక్కువ ఉండదు. సూటిగా సుత్తిలేకుండా చెప్పేస్తారు. సిక్కోలు జిల్లాలో కీలకనేతగా గుర్తింపు పొందిన ప్రసాదరావు.. చాన్నాళ్లు మంత్రిగా ఉన్నారు. వైసీపీలో చేరి ఎమ్మెల్యే అయ్యాక మరోసారి కేబినెట్‌లో చోటు దక్కుతుందని ఆశించినా.. ఆ అవకాశం రాలేదు. ఎమ్మెల్యేగానే మిగిలిపోయారు. ఆయన అన్నయ్య ధర్మాన కృష్ణదాస్‌ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. దీంతో ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచీ మౌనంగా ఉండిపోయిన ఆయన.. సడెన్‌గా అధికారపార్టీలో అలజడి రేపుతున్నారు. ప్రభుత్వం ఏం చేస్తుంది.. ఏం చేయగలదు అనేది తన మార్కు ప్రసంగాలలో చెప్పేస్తున్నారు ప్రసాదరావు. రాజకీయంగా ఏది ప్లస్సూ.. ఏదీ మైనస్సో వివరించేస్తున్నారు. ఆ మాటల్లో ఎవరికి కావాల్సిన యాంగిల్‌ను వారు వెతుక్కుంటున్నారు. ప్రతిపక్ష టీడీపీ తనకు అనుకూలంగా కొన్ని.. ప్రసాదరావుకు మంత్రి పదవి దక్కకూడదని భావిస్తున్న వైసీపీ వర్గాలు మరికొన్ని తీసుకుని చేయాల్సిన రచ్చ చేసేస్తున్నాయి.

రూ. వంద ఇవ్వకపోతే ఇళ్ల దగ్గరే చెత్త వేయాలని సంచలన కామెంట్‌
ధాన్యం సేకరణ, ఉపాధి హామీ, రోడ్లు, మౌలిక వసతులపై ధర్మాన ప్రసాదరావు చేసిన కామెంట్స్‌తో అధికారపార్టీ నాయకులే కంగుతిన్నారు. చెత్త పన్ను విషయంలో కాస్త ఘాటుగానే స్పందించారు. వంద రూపాయలు ఇవ్వకపోతే చెత్తను వాళ్ల ఇంటి దగ్గరే ఉంచేయాలని ఆయన చెప్పారు. ఉపాధి హామీ వంటి పథకాలు దేశ ప్రయోజనాలకు విఘాతమని తెలిపారు. పండిన ప్రతి ధాన్యం గింజనూ కొంటామని అధికారులు, మంత్రులు హామీ ఇస్తుంటే.. వరి సాగు దండగని.. ధాన్యం కొనే నాధులే లేరని విమర్శలు చేశారు ప్రసాదరావు. సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టడంతో రోడ్లు, మౌలిక వసతుల కల్పన ఆలస్యం అవుతోందని.. ఇకపై అభివృద్ధి కార్యక్రమాలపై ఫోకస్‌ పెడతానని ఆయన తెలిపారు. దీంతో సమస్యలు ఉన్నాయని మాజీ మంత్రి వ్యంగ్యాస్త్రాలు సంధించినట్టు అధికారపార్టీ వర్గాలు అనుమానిస్తున్నాయి.

ధర్మాన ధర్మసంకటంలో పడ్డారా?
కేబినెట్‌ ప్రక్షాళనపై అధికార పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. చాలా మంది మంత్రి అయ్యేందుకు చూస్తున్నారు. ధర్మాన ప్రసాదరావు సైతం మరోసారి మంత్రి అనిపించేందుకు ఎదురు చూస్తున్నట్టు టాక్‌. ఆ విషయంలో ఎలాంటి సంకేతాలు వచ్చాయో ఏమో.. కర్ర విరగకుండా.. పాము చావకుండా ఆయన చేస్తున్న విమర్శలు చర్చగా మారుతున్నాయి. ధర్మాన ధర్మ సంకటంలో పడ్డారేమో అన్నది మరికొందరి అనుమానం. మరి.. తాజా కామెంట్స్‌ ఈ మాజీ మంత్రికి అనుకూలంగా మారతాయో.. ప్రతికూలంగా ఉంటాయో చూడాలి.

Related Articles

Latest Articles