ఈటల నోటి వెంటరాని జై శ్రీరాం నినాదం!

జై శ్రీరాం నినాదం లేకుండా బీజేపీ నేతల ప్రసంగాలను ఊహించలేం. కాషాయ కండువా కప్పుకొనేవాళ్లు ఎవరైనా.. కొత్తలో కొంత ఇబ్బంది పడినా తర్వాత ఇలాంటి స్లోగన్స్‌కు అలవాటు పడతారు. కానీ.. ఆ మాజీ మంత్రికి ఇంకా బీజేపీ బాడీ లాంగ్వేజ్‌ వంటబట్టలేదట. కమ్యూనిస్ట్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ వల్లో ఏమో.. ఆయన తీరు వినూత్నంగా ఉందట. అదే ఇప్పుడు కాషాయ శిబిరంలో చర్చగా మారింది. ఇంతకీ ఎవరా నాయకుడు?

ఈటల నోటివెంటరాని జైశ్రీరాం నినాదం!

ఈటెల రాజేందర్. మాజీ మంత్రి. టీఆర్‌ఎస్‌ను వీడి అనుచరులతో కలిసి బీజేపీలో చేరారు. హుజురాబాద్‌ నియోజకవర్గంలో ప్రస్తుతం విస్తృతంగా పర్యటిస్తున్నారు. వచ్చే ఉపఎన్నిక కోసం గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేసుకుంటున్నారు ఈటల. టీఆర్‌ఎస్‌పైనా.. సీఎంపైనా ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలు ఆయన అనుచరులకు.. హుజురాబాద్‌లోని బీజేపీ శ్రేణులకు ఉత్సాహాన్నిస్తున్నాయి. ఈటల రాకతో హుజురాబాద్‌లో బీజేపీ బలం పెరిగిందనే సంతోషంలో ఉన్నారు కమలనాథులు. అయితే ఇదే సమయంలో కాషాయ శిబిరాన్ని మరో అంశం కలవర పెడుతోందట. అది మాజీ మంత్రి ఈటల బాడీ లాంగ్వేజ్‌. ముఖ్యమంత్రిని.. టీఆర్‌ఎస్‌ను టార్గెట్‌ చేస్తున్న ఈటల.. తన ప్రసంగాలలో ఎక్కడా బీజేపీ సంప్రదాయబద్ధ నినాదాలు చేయడం లేదట. మోడీ విధానాలు.. పనితీరు గురించి చెప్పడం లేదట. ఈటల ఇంతవరకు జై శ్రీరాం అనడాన్నే వినలేదని బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతోందట.

read also : రేవంత్… పీసీసీ గా సక్సెస్ కావాలి : భట్టి

ఈటల ప్రసంగాల్లో మోడీ, కేంద్ర పథకాల ప్రస్తావన లేదా?

తనకు అన్యాయం జరిగిందని.. కుట్ర చేశారని చెప్పడానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారట ఈటల. ప్రజల్లో సానుభూతి కోసమే వ్యూహాత్మకంగా ఆ అంశాలను పదే పదే ప్రస్తావిస్తున్నట్టు చెబుతున్నారు. ముఖ్యంగా ఆత్మగౌరవ నినాదం హుజురాబాద్‌లో మార్మోగుతోంది. ఈటల కాషాయ కండువా కప్పుకొన్నప్పటి నుంచి హుజురాబాద్‌ రాజకీయాలు వీటి చుట్టూనే తిరుగుతున్నాయి తప్ప.. మరో మాట లేదట. సాధారణంగా బీజేపీ నేతలు తమ ప్రసంగాలలో మోడీ గురించి.. కేంద్రప్రభుత్వ పథకాల గురించి ఎక్కువగా చెబుతుంటారు. భారత్‌ మాతాకీ జై.. జైశ్రీరాం నినాదాలు కామన్‌. ఈ స్లోగన్స్‌ లేకపోతే కిక్కే ఉండదని భావిస్తాయి పార్టీ శ్రేణలు. ఈటల ప్రసంగాలలో ఈ మాటలు.. నినాదాలు లేవట.

చదువుకునే రోజుల్లో ఈటల కమ్యూనిస్ట్‌!

ఈటల విద్యార్థి దశ నుంచి కమ్యూనిస్ట్‌ భావజాలంతో పైకి వచ్చారు. తర్వాత సుదీర్ఘ కాలం టీఆర్‌ఎస్‌లో కొనసాగారు. ఆ ప్రభావమో ఏమో.. ఈటల బీజేపీని ఇంకా పూర్తిగా వంట బట్టించుకోలేదని కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. ఆయన వెంట తిరుగుతున్నవారు సైతం ఈటలకు జై కొడుతున్నారు తప్ప మోడీ, బీజేపీ మాటే ఎత్తడం లేదని సమాచారం. దీంతో వ్యక్తిగత ఇమేజ్‌ కోసం మాజీ మంత్రి ప్రయత్నిస్తున్నారనే అనుమానాలు పార్టీ వర్గాల్లో ఉన్నాయట. స్వలాభం కోసం పార్టీ మారారా అని కామెంట్స్‌ చేసేవారు బీజేపీలో లేకపోలేదు.

ఈటల బ్రాండ్‌ ఇమేజ్‌ తగ్గకూడదనే బీజేపీ నినాదాలు పలకడం లేదా?

హుజురాబాద్‌లో ఈటల బీజేపీకి జైకొట్టకపోవడానికి బలమైన కారణం ఉందనే చర్చ కూడా నడుస్తోంది. ఈటల బ్రాండ్‌ ఇమేజ్‌ తగ్గి.. బీజేపీ ఇమేజ్‌ పెరిగితే ఉపఎన్నికలో గెలుపు కష్టమనే ఆలోచన ఉందట. అందుకే వ్యూహాత్మకంగా మాజీ మంత్రి ఆ వైఖరిని ఎంచుకున్నారనేవారు లేకపోలేదు. మరి.. రానున్న రోజుల్లో హుజురాబాద్‌లో బీజేపీ సైద్ధాంతిక నినాదాలు వినపడతాయో లేదో కానీ.. ఈటలకు మాత్రం ఇంకా బీజేపీ నీళ్లు వంటబట్టలేదన్న అభిప్రాయమైతే రాజకీయవర్గాల్లో ఉందట.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-