సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ పై ఈటెలకు టెన్షన్?

తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై రాజకీయ విమర్శలు ఎలా ఉన్నా.. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ శిబిరాన్ని మాత్రం టెన్షన్‌ పెడుతోందా? హజురాబాద్‌ ఉపఎన్నికపై పడే ప్రతికూల ప్రభావంపై లెక్కలు వేస్తున్నారా? బీజేపీలో చేరేముందే ఏ అంశంపై అయితే ఈటల స్పష్టత కోరారో.. ఇప్పుడు అదే మళ్లీ చర్చకు వస్తోందా?

సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్‌ చూపించే ప్రభావంపై ఈటల వర్గం ఆరా?

అదిగో.. ఇదిగో తేదీ ప్రకటించేస్తారని అనుకుంటున్న వేళ హుజురాబాద్‌ ఉపఎన్నికపై కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇవ్వలేదు. ఇప్పటికే రెండు నెలలుగా ప్రచారం ఓ రేంజ్‌లో సాగుతోంది. ఇంకో 2 నెలలు వేచిచూడక తప్పేలా లేదు. ఇదే సమయంలో సీఎం కేసీఆర్‌ ఢిల్లీ పర్యటనపైనా హుజురాబాద్‌లో చర్చ మొదలైంది. ముఖ్యంగా మాజీ మంత్రి ఈటల రాజేందర్‌, ఆయన అనుచరులు పైకి చెప్పకపోయినా.. అంతర్గతంగా చాలా ఆరా తీస్తున్నారట. సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన హుజురాబాద్‌ ఉపఎన్నికపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? బీజేపీపై ఎఫెక్ట్‌ పడుతుందా లేక ఈటల శిబిరంపై ఆ ప్రభావం కనిపిస్తుందా? ఈ ప్రశ్నలకే సమాధానాలను వెతికే పనిలో పడిందట మాజీ మంత్రి బృందం.

ఈటలకు ఆ అనుమానాలు అలాగే ఉన్నాయా?

టీఆర్‌ఎస్‌ను వీడి.. బీజేపీలో చేరే సమయంలో చాలా తర్జనభర్జన పడ్డారు ఈటల. చివరకు కాషాయ కండువా కప్పుకోవాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ఢిల్లీ బీజేపీ పెద్దల ముందు కొన్ని ప్రశ్నలు ఉంచారు మాజీ మంత్రి. టీఆర్ఎస్‌తో బీజేపీకి ఉన్న సంబంధాలపై స్పష్టత కోరారు. టీఆర్ఎస్‌ వేరు.. బీజేపీ వేరు అని కమలనాథులు చెప్పిన తర్వాతే ఈటల కాషాయ శిబిరంలో చేరినట్టు ప్రచారం జరిగింది. ప్రస్తుతం అదే ఊపుతో హుజురాబాద్‌లో ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు ఈటల. కానీ.. ఆనాడు ఏదైతే అనుమానాలు వ్యక్తం చేశారో.. ఆ అనుమానాలు ఇంకా అలాగే ఉన్నాయని సందేహిస్తున్నారట మాజీ మంత్రి అనుచరులు.

ఈటల శిబిరంలో మళ్లీ ప్రశ్నలు?

హుజురాబాద్‌ బైఎలక్షన్‌ ఆలస్యం కావడం.. ఢిల్లీ టూర్లో ప్రధాని మోడీ.. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలతో భేటీలపై ఈటల శిబిరంలో కొత్త ప్రశ్నలు ఉదయిస్తున్నాయట. ఇప్పటికే బీజేపీ, టీఆర్ఎస్‌ రెండూ ఒక్కటే అని కాంగ్రెస్‌ విమర్శల వేడి పెంచింది. ఆ ఫ్రేమ్‌ నుంచి బయటపడేందుకు తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ కౌంటర్లు ఇచ్చినా.. ఈటల శిబిరంలో మాత్రం ప్రశ్నలు అలాగే ఉండిపోయినట్టు సమాచారం. తాజా పరిణామాలు హుజురాబాద్‌లో ఈటలకు ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉందన్న విశ్లేషణలు మొదలయ్యాయి. నియోజకవర్గంలో క్షణం తీరిక లేకుండా ప్రచారం చేస్తున్న ఈటల కూడా ఈ అంశంపై ఫోకస్‌ పెట్టి.. అనుచరుల ద్వారా ఆరా తీస్తున్నట్టు సమాచారం.

అంతా మౌనంగా వీక్షిస్తున్న ఈటల!

సీఎం కేసీఆర్‌ ఢిల్లీ టూర్‌పై బండి సంజయ్‌ స్పందించారు కానీ.. ఈటల మధ్య ఎలాంటి కామెంట్స్‌ చేయలేదు. పరిణామాలను మౌనంగా వీక్షిస్తున్నారు. అందుకే రానున్న రోజుల్లో మాజీ మంత్రి రియాక్షన్‌పై అనుచరులతోపాటు.. బీజేపీ వర్గాల్లోనూ చర్చ మొదలైంది. మరి.. ఈటల ఏం చేస్తారో చూడాలి.

Related Articles

Latest Articles

-Advertisement-