మూడుముక్కలాట..క్యాడర్‌లో కన్ఫ్యూజన్

అసలే ఆ నియోజకవర్గం వైసీపీకి కంచుకోట. అలాంటి చోట కలిసి పోరాడాల్సిన టీడీపీలో మూడు ముక్కలాట సాగుతోంది. సమీక్షలు పెట్టి క్లాస్‌లు తీసుకున్నా.. నేతల తీరు మారడం లేదట. గందరగోళంలో పడిన కేడర్‌ దిక్కులు చూస్తోందట.

ఫ్లెక్సీలు చించేయడంతో టీడీపీలో కలకలం
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో గడిచిన రెండు ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు బూదాల అజితారావు. మొదటిసారి ఓడినప్పుడు ఏ విధంగా అయితే కేడర్‌కు కనిపించకుండా పోయారో.. రెండోసారీ నియోజకవర్గంలో అజితారావు అదే చేశారని కేడర్‌ ఆరోపణ. దీంతో టీడీపీ నేత ఎరిక్షన్‌ బాబును ఎర్రగొండపాలెం ఇంఛార్జ్‌గా నియమించారు. ఏడాదిన్నరగా ఆయన పర్యవేక్షణలోనే ఇక్కడ పార్టీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంతలో న్యూ ఇయర్‌ వేడుకల్లో టీడీపీలోని ఓ వర్గం చేర్పాటు చేసిన ఫ్లెక్సీలలో అజితారావు ఫొటో కనిపించింది. ఆ ఫ్లెక్సీలను మరో వర్గం చించేయడంతో పార్టీలో కలకలం రేపింది.

అజితారావు మళ్లీ ల్యాండ్‌ అవుతారా?
రెండుసార్లు ఓడినా.. ముచ్చటగా మూడోసారి బరిలో నిలిచేందుకు అజితారావు సిద్ధంగా ఉన్నారని.. ఆ సంకేతాలు ఇచ్చేందుకే ఆమె అభిమానులు ఫ్లెక్సీలు పెట్టారనే చర్చ జరుగుతోంది. అజితారావు భర్త ఇన్‌కం ట్యాక్స్‌ కమిషనర్‌. ఎన్నికల సమయంలో ఆమె ఎర్రగొండపాలెంలో మళ్లీ ల్యాండ్‌ అవుతారని పార్టీ వర్గాల టాక్‌. మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు సైతం టీడీపీ వైపు చూస్తున్నారు. ఆయన 2014లో వైసీపీ నుంచి ఎమ్మెల్యే గెలిచి టీడీపీలో చేరారు. ఆ తర్వాత టీడీపీకి గుడ్‌బై చెప్పి వైసీపీలోకి వెళ్లిపోయారు. అక్కడ కుదురుకోలేక.. అధికారపార్టీకి టాటా చెప్పారు. ప్రస్తుతం ఏ పార్టీలోనూ లేరు. తిరిగి టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చే ప్రయత్నాల్లో ఉన్నారట డేవిడ్‌రాజు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ టికెట్‌ హామీ లభిస్తే సైకిల్‌ ఎక్కాలని చూస్తున్నారు.

చంద్రబాబు దగ్గర తేలని ఎర్రగొండపాలెం పంచాయితీ..!
ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సహా పార్టీ పెద్దలను కలిసి ఏదో ఒకటి తేల్చాని డేవిడ్‌రాజు కోరినట్టు ప్రచారం జరుగుతోంది. ఎర్రగొండపాలెం టీడీపీలో కీలకంగా ఉండే మన్నె రవీంద్ర ఏం చెబితే అది చేద్దామని కొందరు అనుకుంటున్నారట. అయితే మారిన పరిణామాలతో టీడీపీ ఇంఛార్జ్‌ ఎరిక్షన్‌ బాబుకు కూడా కేడర్ చుక్కలు చూపిస్తున్నట్టు సమాచారం.

కొందరు అజితారావు వైపు.. మరికొందరు డేవిడ్‌రాజు వైపు ఆశగా ఎదురు చూస్తున్నారట. ఈ సమయంలో ఫ్లెక్సీల రగడ తెరపైకి రావడంతో ఇక్కడి పరిణామాలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారట కొందరు నాయకులు. తాము అభ్యర్దిని ప్రకటించే వరకూ అందరూ కలిసికట్టుగా ఉంటే అందరి ఆమోదంతో ఒకరికి సీటు కేటాయిద్దామని చెప్పారట. చంద్రబాబు ఏదో ఒకటి తేల్చేస్తారని నాయకుడు ఆశించారట. కానీ సమస్య మళ్లీ మొదటికి రావడంతో కేడర్‌ డల్‌ అయింది. అందుకే ఎర్రగొండపాలెం టీడీపీలో మూడుముక్కలాటకు ఎప్పుడు చెక్‌ పడుతుందో అని తమ్ముళ్లు ఎదురు చూసే పరిస్థితి ఉంది.

Related Articles

Latest Articles