ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ ఈ రోజే..

ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధం అవుతోంది… ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, గోవా, మణిపూర్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది.. మధ్యాహ్నం 3.30 గంటలకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదలకు సంబంధించిన ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేసినట్టు మీడియాకు సమాచారం ఇచ్చింది సీఈసీ.. ప్రస్తుత ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ పదవీకాలం మే నెలలో ముగియనుండగా.. మిగతా నాలుగు అసెంబ్లీల గడువు మార్చిలోనే వేర్వేరు తేదీల్లో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్‌ సిద్ధం చేసింది ఎన్నికల సంఘం.

Read Also: బీజేపీతో పొత్తును వీడి జనసేన బయటకు రావాలి..!

ఇక, దేశంలో పెరిగిపోతున్న కరోనా కేసులు, ప్రస్తుత పరిస్థితులపై గురువారం కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్‌తో సమీక్ష సమావేశం నిర్వహించిన కేంద్ర ఎన్నికల సంఘం.. ఆ తర్వాత ఎన్నికల షెడ్యూల్‌ సిద్ధం చేసింది.. మరోవైపు, కరోనా మహమ్మారి కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యం, ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో.. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలను రద్దు చేయాలన్న డిమాండ్‌ కూడా విపక్షాల నుంచి వినిపిస్తోంది. అయితే, ఎన్నికలను ఎదుర్కోవటానికి అన్ని రాజకీయ పార్టీలు అనుకూలంగా ఉన్నాయని ఈసీ ముందుగానే ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా కేసులు పెరుగుతున్నా.. ప్రచారం, ర్యాలీపై ఆంక్షలు విధిస్తూ.. ఈసీ ఎన్నికలకు వెళ్లడానికే సిద్ధం అవుతోంది.. మరి ఎన్నికల ప్రచారంపై ఈసీ ఎలాంటి ఆంక్షలు విధిస్తుంది అనేది వేచిచూడాల్సి ఉంది.

Related Articles

Latest Articles