కేసుల్లో ‘బైపోల్’ రికార్డు.. కఠిన చర్యలు తీసుకుంటున్న ఈసీ?

హుజూరాబాద్ ఉప ఎన్నికపైనే అందరి దృష్టినెలకొంది. ఈటల వర్సెస్ కేసీఆర్ అన్నట్లుగా ఈ ఉపఎన్నిక మారిపోవడంతో ఫలితం ఎలా ఉంటుందా? అనే ఆసక్తి నెలకొంది. ప్రధాన పార్టీల నేతలంతా నువ్వా.. నేనా? అన్నట్లుగా ప్రచారంలో దూసుకెళుతున్నారు. ఇదే అదనుగా ఎన్నికల అధికారులు సైతం దూకుడుగా వెళుతున్న నాయకులపై కేసులు నమోదు చేస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన 13రోజుల్లోనే ప్రధాన పార్టీల నేతలతోపాటు స్వంతంత్ర అభ్యర్థులపై 40కిపైగా కేసులు నమోదు చేశారు. దీంతో హుజూరాబాద్ బైపోల్ కేసుల విషయంలో సరికొత్త రికార్డు నెలకొల్పే అవకాశం కన్పిస్తోంది.

కరోనా నేపథ్యంలో ఎన్నికల అధికారులు ఎన్నికల నియామవళిని ఖచ్చితంగా అమలు చేస్తున్నారు. అనుమతికి మించి జనాన్ని సమీకరించడం, అనుమతి లేకుండా ప్రచారం నిర్వహించడం, కోవిడ్ నిబంధనలు పాటించకపోవడం వంటి విషయాల్లో ఎన్నికల అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న ఈటల రాజేందర్ పై టీఆర్ఎస్ నేతలు ఎన్నికల అధికారులకు వరుసగా ఫిర్యాదు చేస్తున్నారు. ఎన్నికల నియామళికి విరుద్ధంగా రోడ్డు షోలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారని.. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారని, తమ పార్టీ ప్రతిష్టకు భంగం కలిగే వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఇటీవల టీఆర్ఎస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు.

ఆ ఫిర్యాదులను పరిశీలించిన ఈసీ ఆయనపై పలు సెక్షన్ల కింద ఆయనపై కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఇటీవల ఆర్డీఓ కార్యాయలం ఎదుట ధర్నా చేసిన ఫీల్డ్ అసిస్టెంట్లపై సైతం పోలీసులు కేసు నమోదు చేశారు.కరోనా నిబంధనలను పాటించకపోయినా, ఎన్నికల నియామవళికి వ్యతిరేకంగా నేతలు ఎవరూ ప్రవర్తించినా వారిపై ఎన్నికల అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు. అయితే ప్రజల సంక్షేమ కోసం పాటుపడుతున్నామని గొప్పలు చెప్పుకునే నేతలు కరోనా నిబంధనలు పాటించకపోవడం ఏంటనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలింగ్ తేది నాటికి ఈ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండటంతో నేతల్లో టెన్షన్ నెలకొంది.

ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఖర్చులపై ఈసీ నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో ప్రచారం చేసిన, సరిహద్దు నియోజకవర్గాల్లో ప్రచారం చేసినా అభ్యర్థి ఖర్చును వారి ఖాతాలోనే లెక్కించనున్నట్లు ఎన్నికల అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గం పరిధిలోని బ్యాంకుల్లో లక్షకు పైగా లావాదేవీలు జరిపితే వాటిపై నిఘా పెడుతున్నారు. ఓటర్లను ప్రభావితం చేసేలా ఒకే అకౌంట్ నుంచి వివిధ అకౌంట్లకు గూగుల్ పే, ఫోన్ పే వంటి యాప్ లతో డబ్బులు పంపినట్లయితే వారిపై నిఘా ఉంటుందని ఈసీ స్పష్టం చేస్తోంది. దీంతో రాజకీయ నేతలు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిసారిస్తున్నారని టాక్ విన్పిస్తోంది.

-Advertisement-కేసుల్లో ‘బైపోల్’ రికార్డు.. కఠిన చర్యలు తీసుకుంటున్న ఈసీ?

Related Articles

Latest Articles