రివ్యూ : ఏక్ మినీ కథ!

ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో వచ్చిన సినిమాలు, అది మరో బ్యానర్ తో కలిసి నిర్మించిన చిత్రాలు మంచి విజయాలను సాధించాయి. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్ తీయడంలోనూ యూవీ క్రియేషన్స్ కు మంచి పేరే ఉంది. అలాంటి ఆ సంస్థ నుండి యూవీ కాన్సెప్ట్ పేరుతో మరో కొత్త బ్యానర్ పెట్టినప్పుడే జనాలకు ఇదేదో సమ్ థింగ్ స్పెషల్ అనే భావన కలిగింది. ఆ బ్యానర్ లో వచ్చిన తొలి చిత్రమే ‘ఏక్ మినీ కథ’. ఈ అడల్ట్ కామెడీ మూవీ ఏప్రిల్ నెలాఖరులో థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా శుక్రవారం నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు.

కథగా చెప్పుకోవాలంటే పేరులో ఉన్నట్టుగానే ఇదో మినీ స్టోరీ! సంతోష్ (సంతోష్ శోభన్) చిన్నప్పటి నుండి స్మాల్ పెనిస్ సిండ్రోమ్ తో బాధపడుతూ ఉంటాడు. తన సమస్యను తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేక సతమతమౌతుంటాడు. అతని ముందు ఎవరైనా ‘బిగ్’ అనే పదాన్ని వాడితే చాలు… చాలా ఇరిటేట్ అయిపోతాడు. పురుషాంగాన్ని పెంచుకోవడం ఎలా? అనే ప్రశ్నకు సమాధానాలను సోషల్ మీడియాలో చూసి ఆచరణలో పెట్టినా ఫలితం లేకపోతుంది.

దాంతో పెళ్ళే చేసుకోకూడదని డిసైడ్ అయిపోతాడు. అయితే అమృత (కావ్యాథాపర్)ను చూసిన తర్వాత ప్రేమలో పడతాడు. ఆపరేషన్ తో తన సమస్యకు పరిష్కారం దొరకుతుందని భావిస్తాడు. అది జరగకపోవడంతో విషయం ఆమెకు చెప్పి పెళ్ళికి దూరం కావాలనుకుంటాడు. కానీ అనుకోని పరిస్థితుల్లో వాళ్ళ పెళ్ళి జరిగిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? స్మాల్ పెనిస్ సిండ్రోమ్ నుండి సంతోష్‌ ఎలా బయట పడ్డాడు? అనేది మిగతా సినిమా.

యువ దర్శకుడు మేర్లపాక గాంధీ ఇప్పటికే మూడు సినిమాలు తీశాడు. ఇప్పుడు హిందీ రీమేక్ ‘అంథాదూన్’ను ‘మాస్ట్రో’ పేరుతో తెరకెక్కించే పనిలో ఉన్నాడు. ఇంతవరకూ తన సొంత కథలనే సినిమాలుగా తీసిన మేర్లపాక గాంధీ…. మొదటి సారి వేరే వాళ్ళకు కథను అందించాడు. ఈ ‘ఏక్ మినీ కథ’ చిత్రానికి కథ, మాటలు అతను రాసినవే. ఈ మూవీతో కార్తీక్ రాపోలు దర్శకుడిగా పరిచయమయ్యాడు. నిజానికి ఇలాంటి సున్నితమైన పాయింట్ ను తీసుకుని సినిమా తీయడం కాస్తంత ఇబ్బందే. కథను చెప్పడంలో ఏ మాత్రం తడబడినా… చెత్త కథ అనే విమర్శ వచ్చేస్తుంది.

దానికి ఆస్కారం ఇవ్వకూడదనే మేర్లపాక గాంధీ… దీనిని ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రాసుకున్నాడు. కానీ అదే పెద్ద దెబ్బైయిపోయింది. దీనిని పూర్తి స్థాయిలో అడాల్ట్ కామెడీగా తీసి ఉంటే… అది వేరే కథ. ఓ వర్గం వారైనా దీనిని ఓన్ చేసుకుని ఎంజాయ్ చేసే వాళ్ళు. కానీ అటూ కాకుండా ఇటూ కాకుండా ఉంది. ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాను చూడలేం… పోనీ ఓ సింగిల్ పాయింట్ మీదే సినిమా సాగుతుందా అంటే అదీ లేదు. రకరకాల అంశాలను ఇందులో మిళితం చేసే కిచిడీ చేసేశారు.

ప్రతి కుర్రాడు జీవితంలో ఏదో సందర్భంలో ఈ స్మాల్ పెనిస్ సిండ్రోమ్ బారిన పడుతూనే ఉంటారు. పత్రికల్లో సెక్స్ స్పెషలిస్టుల ప్రశ్నలు సమాధానాలు చూస్తే… అందులో సగం వీటికి సంబంధించినవే ఉంటాయి. అయితే పరిణామం అనేది ప్రధానం కాదని వాళ్ళంతా చెబుతూనే ఉంటారు. చిత్రం ఏమంటే ఇందులో హీరో బాగా చదువుకున్న కుర్రాడు. అతను కూడా అదే సందేహంతో భయానికి గురి కావడం అనేది కామెడీగా ఉంది. నిజానికి అతనికంటే… ఆ విషయంలో తల్లిదండ్రులు ఆందోళనకు గురైనట్టు చూపించి ఉంటే బెటర్ గా ఉండేది.

పైగా… హీరో ప్రతి చర్యనూ తండ్రి తప్పుగా అర్థం చేసుకుని, ఎదుటి వాళ్ళకు రాంగ్ గా ప్రెజెంట్ చేయడం సైతం పెద్దంత ఆకట్టుకోలేదు. శ్రద్ధాదాస్ పోషించిన పాత్ర కూడా ఎఫెక్టివ్ గా లేదు. హీరో పట్ల సానుభూతి ఉన్నా… ఆమె అతని ఇంట్లో గంజాయి తాగుతూ, అదోలా మెసలడం బాలేదు. ఇక హీరో తల్లి తరఫున బంధువులంతా చివరిలో ఒకరితో ఒకరు కలబడటం, హీరోయిన్ తరఫున వాళ్ళు ఆమెను పుట్టింటికి తీసుకెళ్ళిపోవడం ఇవన్నీ చాలా చాలా నాటకీయంగా ఉన్నాయి. అంతేకాదు… ఏదో హడావుడిగా చుట్టేసిన భావన కలిగించాయి.

నటీనటుల విషయానికి వస్తే దర్శకుడు శోభన్ కొడుకు సంతోష్ కు ఇప్పటికే రెండు మూడు సినిమాల్లో హీరోగా నటించిన అనుభవం ఉంది. దాంతో ఈ పాత్రనూ తేలికగానే చేసేశాడు. ఇక హీరోయిన్ కావ్యాథాపర్ గతంలో ‘ఈ మాయ పేరేమిటో’లో హీరోయిన్ గా నటించింది. అందం చందం ఉన్న అమ్మాయి కావడంతో తెర మీద బాగానే ఉంది. శ్రద్ధాదాస్ క్యారెక్టరైజేషన్ లో క్లారిటీ లేకుండా పోయింది. హీరో తల్లిదండ్రులుగా రూపలక్ష్మీ, బ్రహ్మాజీ నటించారు. బ్రహ్మాజీకి ఇలాంటి పాత్రలు కొట్టిన పిండే. బాగా చేశాడు. ఇక సుదర్శన్, హర్షవర్థన్, పోసాని, సప్తగిరి వినోదాన్ని అందించడానికి తమ వంతు ప్రయత్నం చేశారు. కొన్ని చోట్ల కామెడీ పేలింది, మరికొన్ని చోట్ల పేలలేదు.

ఏ పాత్ర ఎప్పుడు ఎలా తెర మీదకు వస్తుందో, ఎలా వెళ్ళిపోతుందో కూడా అర్థం కాదు. కానీ చాలామంది ఆర్టిస్టులే ఇందులో ఉన్నారు. మేర్లపాక గాంధీ రాసిన పంచ్ డైలాగ్స్ బాగున్నాయి. నిర్మాణ విలువల విషయంలో నిర్మాతలు రాజీ పడలేదని తెలుస్తూనే ఉంది. భాస్కరభట్ల, శ్రీజో రాసిన పాటలు సందర్భానుసారంగా ఉన్నాయి. ప్రవీణ్‌ లక్కరాజు నేపథ్యం సంగీతం ఓకే. గోకుల్ భారతి సినిమాటోగ్రఫీ కూడా చక్కగా ఉంది. కరోనా కారణంగా ఓటీటీలో ప్రసారం అవుతున్న ఈ సినిమాను కుటుంబ సమేతంగా చూడలేరు. సెన్సార్ వాళ్లు కూడా పెద్దలకు మాత్రమే అన్నారు కాబట్టి…. వీలున్నప్పుడు, వీలైనప్పుడు టైమ్ పాస్ కోసం సరదాగా ఈ మూవీని చూడొచ్చు.

రేటింగ్ : 2.25 / 5

ప్లస్ పాయింట్స్
నటీనటుల నటన
ఆకట్టుకునే సంభాషణలు, సంగీతం
నిర్మాణ విలువలు

మైనెస్ పాయింట్
బలహీనమైన కథ, కథనం
హడావుడిగా ముగిసే క్లయిమాక్స్

ట్యాగ్ లైన్: ఏక్ సింపుల్ స్టోరీ!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-