కార్వీ కేసులో ఈడీ దూకుడు.. రూ.700 కోట్ల షేర్లు ఫ్రీజ్‌..

కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ కేసు వ్యవహారం దర్యాప్తులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మరింత దూకుడు పెంచింది.. 3,000 కోట్ల రూపాయల ఫ్రాడ్ కేస్‌లో సీసీఎస్ఎఫ్ఐఆర్ ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ.. దర్యాప్తు ముమ్మరం చేసింది.. ఇటీవల హైదరాబాద్, గుంటూరులో కార్వీ సంస్థ ఛైర్మన్ పార్థసారథి ఇళ్లు, కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు నిర్వహించింది.. హైదరాబాద్ కార్వీ హెడ్ ఆఫీస్‌లో 10 గంటల పాటు సోదాలు నిర్వహించిన ఈడీ.. కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది.. ఇక, ఈ నేపథ్యంలోనే కార్వీ సంస్థ షేర్లను ఫ్రీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. కార్వీ ఛైర్మన్ పార్థసారధి, ఆయన కుమారులు రజట్ పార్థసారథి, అధిరజ్ పార్థసారథిలకు సంబంధించిన షేర్లను ఫ్రీజ్‌ చేయనున్నారు అధికారులు.. కార్వీ సంస్థకు సంబంధించిన సుమారు 700 కోట్ల రూపాయల షేర్లను ఫ్రీజ్ చేసింది ఈడీ. కాగా, నిబంధనలకు విరుద్ధంగా పెట్టుబడిదారుల షేర్లను 9 డొల్ల కంపెనీలకు మళ్లించినట్లు సీసీఎస్ పోలీసుల దర్యాప్తులో తేలింది. సెబీకి సమాచారం ఇవ్వకుండా షేర్లను బ్యాంకుల్లో తనఖా పెట్టి దాదాపు రూ.1,500 కోట్లను కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ రుణంగా తీసుకుంది. బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలను వైస్ ప్రెసిడెంట్ శ్రీకృష్ణ 9 డొల్ల కంపెనీలకు మళ్లించారనే అభియోగాలున్నాయి.. పెట్టుబడిదారులకు నష్టం చేకూర్చే విధంగా వ్యవహరించడంతో పాటు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను నిబంధనలకు విరుద్ధంగా దారి మళ్లించినట్లు గుర్తించారు.

Related Articles

Latest Articles