హుజురాబాద్ లో ప్రలోభాలు షూరు.. ఆ మార్గంపై ఈసీ స్పెషల్ ఫోకస్?

హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో రాజకీయ వేడి రాజుకుంటోంది. ఈ ఎన్నికను బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పోరు రసవత్తరంగా మారింది. కురుక్షేత్రాన్ని తలపించేలా బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు పోటీ పడుతున్నాయి. అయితే కాంగ్రెస్ ఈ రేసులో బాగా వెనుకబడినట్లు కన్పిస్తోంది. దీంతో త్రిముఖ పోటీ కాస్తా ద్విముఖ పోటీగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే కాంగ్రెస్ ఏ క్షణానైనా పుంజుకునే అవకాశం ఉందని ఆపార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఈనెల తొలివారం నుంచి హుజూరాబాద్లో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఇప్పటికే పలు పార్టీలకు చెందిన నాయకులు నామినేషన్లు దాఖలు చేశారు. టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీజేపీ నుంచి ఈటల రాజేందర్ లు నామినేషన్లు దాఖలు చేశారు. ఇప్పటికే ఈ రెండు పార్టీలు ప్రచారంలో దూసుకెళుతున్నాయి. ఇక కాంగ్రెస్ నుంచి బల్మూరి వెంకట్ పేరు ఖరారైంది. మరోవైపు పోలింగ్ తేది సమీపిస్తుండటంతో హుజూరాబాద్లో ప్రలోభాలపర్వం మొదలైంది.

తెలంగాణలో అత్యంత కాస్లీ ఎన్నికగా హుజూరాబాద్ ఉప ఎన్నిక నిలువనుందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈసీ హుజూరాబాద్ ఉప ఎన్నికపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. రోడ్డు మార్గంలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పోలీసులు తనిఖీ చేస్తున్నారు. ఇటీవల ఓ కారులో 15లక్షల నగదు పట్టుబడింది. అయితే హుజూరాబాద్ కు రైలు మార్గంలో పెద్ద మొత్తంలో డబ్బులు చేరుతున్నట్లు ఈసీ దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో సికింద్రాబాద్ టూ జమ్మికుంట రైల్వే మార్గంలో తనిఖీలు చేపట్టాలని ఈసీ భావిస్తోంది.

వాస్తవానికి రైల్వేలో సామాగ్రిని, డబ్బులను తరలించడం చాలా సులువు. రైల్వే స్టేషన్లలో టిక్కెట్లను తనిఖీ చేసే అధికారులు ప్రయాణీకుల బ్యాగుల్లో ఏం ఉందనే వాటిని పెద్దగా పట్టించుకోరు. దీనిని రాజకీయ నాయకులు ఆసరాగా తీసుకొని రైల్వే మార్గంలో హుజూరాబాద్ కు డబ్బులను చేరవేస్తున్నారని టాక్ విన్పిస్తుంది. ఇటీవలీ కాలంలో జమ్మికుంట, ఉప్పల్ రైల్వే స్టేషన్లలో నాయకుల అందుకే ఎక్కువైందట. ప్రలోభాలకు రైల్వే మార్గం రాచమార్గంగా మారిందని ఈసీ భావిస్తోంది.

ఈమేరకు ఈసీ రైల్వే అధికారులకు పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్ టూ జమ్మికుంట వరకు రైల్వే పోలీసులు ప్రత్యేకంగా తనిఖీ చేయాలని ఈసీ రిపోర్ట్ ఇచ్చినట్లు అధికారులు సైతం వెల్లడిస్తున్నారు. మొత్తానికి హుజూరాబాద్ పై ఈసీ ప్రత్యేక నజర్ వేసినట్లే కన్పిస్తుంది. రోడ్డు, రైల్వే మార్గాలపై ఈసీ ఫోకస్ పెట్టడంతో నేతలు సైతం ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ ఉప ఎన్నిక సందర్భంగా ఈసీ ఎంత డబ్బును స్వాధీనం చేసుకుంటుందనే చర్చ సైతం ప్రజల్లో జోరుగా సాగుతోంది.

-Advertisement-హుజురాబాద్ లో ప్రలోభాలు షూరు.. ఆ మార్గంపై ఈసీ స్పెషల్ ఫోకస్?

Related Articles

Latest Articles