హుజురాబాద్ లో ప్రచారానికి ఈసీ ఆంక్షలు అడ్డంకిగా మారాయా..?

హుజురాబాద్‌లో అట్టహాస ప్రచారానికి EC ఆంక్షలు అడ్డంకిగా మారాయి. దీంతో పార్టీలు కొత్త ఎత్తుగడలు వేస్తున్నాయి. హుజురాబాద్‌లో కాలు పెట్టకుండానే ఆ ప్రభావం ఉపఎన్నికపై పడేలా వ్యూహ రచనలో పడ్డాయట. వరస మీటింగ్‌లతో బైఎలక్షన్‌లో ఊపు తీసుకొచ్చే పనిలో ఉన్నాయట. ఈ విషయంలో అధికారపార్టీ ఆలోచన ఏంటి?

హుజురాబాద్‌లో ప్రచార ఊపు తీసుకొచ్చేలా టీఆర్ఎస్‌ ప్లీనరీ?

తెలంగాణలో గతంలో జరిగిన ఉపఎన్నికల ప్రచారానికి భిన్నంగా సాగుతోంది హుజురాబాద్‌ బైఎలక్షన్‌. ప్రధాన పార్టీలు క్షేత్రస్థాయిలో తిరుగుతున్నాయి కానీ.. భారీ సభలు.. రోడ్‌ షోలు లేవు. కరోనా కారణంగా వీటికి చెక్‌ పెట్టింది ఎన్నికల సంఘం. దీంతో ప్రచారానికి ఊపు తీసుకొచ్చే పనిలో పడ్డాయి ప్రధాన పార్టీలు. ఈ విషయంలో అధికార టీఆర్ఎస్‌ ఆలోచన కాస్త భిన్నంగా ఉంది. పార్టీ ప్లీనరీ రూపంలో గులాబీ దళానికి ఒక అవకాశం అంది వచ్చింది. హుజురాబాద్‌లో కాలు పెట్టకుండానే.. అక్కడ టీఆర్ఎస్‌ ప్రచారంపై ప్రభావం పడేలా పార్టీ ప్లీనరీ కార్యక్రమాలను వేదికగా చేసుకోబోతున్నట్టు చర్చ జరుగుతోంది.

17 నుంచీ టీఆర్ఎస్‌ వరస కార్యక్రమాలు..!
25న గ్రాండ్‌గా టీఆర్ఎస్‌ ప్లీనరీ..!

హుజురాబాద్‌లో ఈ నెల 30 పోలింగ్‌. గులాబీ దళపతి కేసీఆర్‌ బహిరంగ సభ లేదు. దీంతో రాష్ట్రంలో నిర్వహించే టీఆర్ఎస్‌ ద్విశాబ్దీ ఉత్సవాలను ఉపఎన్నికకు అనుకూలంగా మలుచుకోబోతున్నట్టు ఒక వాదన. ఈ నెల 17 నుంచీ వరస సమావేశాలతో టీఆర్‌ఎస్‌ బిజీగా ఉండబోతోంది. ఆ రోజున కేసీఆర్‌ అధ్యక్షతన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో తెలంగాణ భవన్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. అదే రోజు టీఆర్ఎస్‌ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. 25న జనరల్‌ బాడీ మీటింగ్‌ ఏర్పాటు చేసి..పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకుని.. గ్రాండ్‌గా పార్టీ ప్లీనరీ నిర్వహించబోతున్నట్టు సమాచారం. పైగా టీఆర్ఎస్‌ ఏర్పాటు చేసి 20 ఏళ్లు అవుతున్న సందర్భంగా ద్విదశాబ్దీ ఉత్సవాలను అట్టహాసంగా నిర్వహించేందుకు పార్టీ రెడీ అయ్యింది.

వరస పార్టీ సమావేశాల్లో కేసీఆర్‌ ప్రసంగాలు?

ఉపఎన్నిక షెడ్యూల్‌ రాకముందే హుజురాబాద్‌ వెళ్లి దళితబంధు పథకాన్ని ప్రారంభించి పార్టీకి ఒక ఊపు తీసుకొచ్చారు కేసీఆర్‌. ఇప్పుడు ఆ టెంపోను మెయింటైన్‌ చేసే పనిలో మంత్రులు, ఇతర పార్టీ ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఒకవేళ ఈసీ ఆంక్షలు పెట్టకపోతే.. కేసీఆర్‌ అక్కడికి వెళ్లేవారో లేదో కానీ.. ప్రచార పర్వంలో టీఆర్ఎస్‌ ప్లాన్‌ బీ అమలు చేయబోతున్నట్టు టాక్‌. 17న నుంచి 25 జరిగే వరస పార్టీ కార్యక్రమాల్లో గులాబీ దళపతి కేసీఆర్ ప్రసంగాలు ఉంటాయి. ఆ స్పీచ్‌లలోనే బీజేపీ, కాంగ్రెస్‌లపై ఆయన విరుచుకుపడే వీలుంది. విపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలకు తనదైన శైలిలో కౌంటర్లు ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఈ ప్రసంగాల ద్వారా హుజురాబాద్‌లో అడుగు పెట్టకుండానే.. అక్కడి ఓటర్లలో అటెన్షన్‌ తీసుకొస్తారని పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. మరి.. ఈ ప్రణాళిక అధికార పార్టీకి ఏ మేరకు వర్కవుట్‌ అవుతుందో చూడాలి.

-Advertisement-హుజురాబాద్ లో ప్రచారానికి ఈసీ ఆంక్షలు అడ్డంకిగా మారాయా..?

Related Articles

Latest Articles