ఏపీ టీడీపీ లో ప్రకంపనలు పుట్టిస్తున్న డ్రోన్ కెమెరాలు!

డ్రోన్‌ కెమెరాలు.. డ్రోన్‌ షాట్స్‌..! ఏపీ టీడీపీలో ప్రస్తుతం ఇదే పెద్ద చర్చ. రాజకీయాలపై సీరియస్‌గా మాట్లాడుకోవాల్సిన సమయంలో ఈ అంశాలపై తమ్ముళ్ల లబలబలేంటి? మథన పడుతున్నారా.. తమకా ఆలోచన రాలేదని బాధపడుతున్నారా? ఇంతకీ ఏంటా సంగతి? లెట్స్‌ వాచ్‌!

ఏపీ టీడీపీలో డ్రోన్‌ కెమెరా విజువల్స్‌పై చర్చ..!

ప్రత్యర్థి పార్టీలు ఏం చేస్తున్నాయి? ప్రభుత్వ పనితీరేంటి? క్షేత్రస్థాయిలోని పరిస్థితులపై సహజంగానే అన్ని పార్టీల్లోనూ చర్చ కామన్‌. విపక్షంలో ఉంటే ఎలాంటి ఆందోళనలు చేపట్టాలి? నిరసన కార్యక్రమాలేంటో ప్రణాళికలు వేసుకుంటారు. కానీ.. టీడీపీలో విచిత్రమైన చర్చ జరుగుతోందట. ఆ చర్చ కూడా డ్రోన్‌ కెమెరాలు.. డ్రోన్‌ విజువల్స్‌ గురించే. ఇటీవల వైసీపీ సర్కార్‌ చెత్త సేకరణ వాహనాలను ఒకేసారి జిల్లాకు పంపింది. అలా పంపుతున్న క్రమంలో విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ దగ్గర 4 వేల వాహనాలను చేర్చి.. ఒకేసారి లాంఛ్‌ చేశారు. ఈ సందర్భంగా డ్రోన్‌ కెమెరాతో షూట్‌ చేసి మీడియాకు రిలీజ్‌ చేశారు. ఆ డ్రోన్‌ విజువల్స్‌ జనాల అటెన్షన్‌ తీసుకొచ్చాయి. ఆ విజువల్‌ ఇంపాక్ట్‌ పైనే టీడీపీలో చర్చ జరుగుతోందట.

డ్రోన్‌ కెమెరా దృశ్యాలను చూసి టీడీపీ కళ్లు కుట్టుకునే పరిస్థితి?

చెత్త వాహనాలకు ముందు.. అదే బెంజ్‌ సర్కిల్‌ నుంచి 108, 104 అంబులెన్స్‌లను, రేషన్‌షాప్‌ సరుకులు తీసుకెళ్లే వాహనాలను ఇదే విధంగా జిల్లాకు పంపారు. అప్పుడు కూడా డ్రోన్‌ విజువల్స్‌ను రికార్డ్‌ చేసి మీడియాకు రిలీజ్‌ చేసింది వైసీపీ సర్కార్‌. ఇదే కాదు.. గతంలో సీఎం జగన్‌ పాదయాత్ర, బహిరంగ సభల దృశ్యాలను కూడా డ్రోన్‌ ద్వారానే రికార్డ్‌ చేసి రిలీజ్‌ చేసేవారు. ఆ విజువల్స్‌ జనాలకు కనువిందు చేసేవి. ఇప్పుడు అవే దృశ్యాలను చూసి టీడీపీ కళ్లు కుట్టుకునే పరిస్థితి ఉందట.

అప్పట్లో ఈ ఐడియా తమకెందుకు రాలేదని టీడీపీ ఆవేదన..!

తాము అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ఐడియాలు ఎందుకు రాలేదు? అని టీడీపీ సమావేశాల్లో మాజీ మంత్రులు ప్రస్తావిస్తున్నారట. టీడీపీ పవర్‌లో ఉండగా.. రైతురథం పేరుతో 13 జిల్లాలకు సుమారు 20 వేల ట్రాక్టర్లు ఇచ్చి ఉంటామని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి గుర్తు చేస్తున్నారట. అప్పుడు ఇదే విధంగా ట్రాక్టర్లను ఒకచోట పెట్టి లాంఛ్‌ చేసి ఉంటే బాగుండేదని తమ్ముళ్లు బాధపడుతున్నట్టు సమాచారం. ఈ విషయం తెలిసినప్పటి నుంచి పార్టీ శ్రేణుల్లో మరో చర్చ జరుగుతోంది. టెక్నాలజీని ప్రవేశపెట్టడం తమతోనే సాధ్యమని జబ్బలు చర్చుకునే తమ నేతలకు డ్రోన్‌ కెమెరాలే గుర్తుకు రాలేదా అని సెటైర్లు వేస్తున్నారట. టెక్నాలజీని ప్రవేశపెట్టడమే కాదు… వాడుకోవడమూ తెలియాలని సన్నాయి నొక్కులు నొక్కేవారూ ఉన్నారట. మొత్తానికి డ్రోన్‌ కెమెరా విజువల్స్‌ ప్రభావం ఎలా ఉన్నా.. ఆ దృశ్యాలు మాత్రం టీడీపీని బాగానే కలవర పెడుతున్నాయని చెవులు కొరుక్కుంటున్నారు.

-Advertisement-ఏపీ టీడీపీ లో ప్రకంపనలు పుట్టిస్తున్న డ్రోన్ కెమెరాలు!

Related Articles

Latest Articles