వెడ్డింగ్‌ సీజన్‌లో థర్డ్‌ వేవ్‌ తప్పదా..!

దేశంలో కోవిడ్ తగ్గుముఖం పట్టింది.కొన్ని నెలలుగా కేసుల సంఖ్య స్థిరంగా తగ్గుతోంది. పండుగ సీజన్‌లో కూడా కేసుల పెరగకపోవటం సంతోషాన్నిస్తోంది. అక్టోబరు,నవంబర్‌ నాటికి థర్డ్ వేవ్ పీక్‌కి చేరుకుంటుందని అంటువ్యాధుల నిపుణులు మొదట అంచనా వేశారు. ఈ ఏడాది మేలో రోజుకు నాలుగు లక్షల పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు అది పది వేలకు పడిపోవటం కరోనా సెకండ్‌ వేవ్‌ క్షీణతను సూచిస్తోంది.

చాలా రాష్ట్రాల్లో కొత్త కేసులు తక్కువగా నమోదవుతున్నప్పటికీ థర్డ్‌ వేవ్‌ ముప్పు తొలగలేదనే చెప్పాలి. తగిన జాగ్రత్తలు, మార్గదర్శకాలు అనుసరించకపోతే ఈ వివాహ సీజన్ థర్డ్ వేవ్‌ను ప్రేరేపిస్తుందనటంలో సందేహం లేదు. ప్రస్తుత పరిస్థితి సరిగ్గా సెకండ్‌ వేవ్‌ ముందు రోజులను తలపిస్తున్నాయి. అందుకే ప్రతి ఒక్కరూ తమ పరిసరాల పట్ల జాగురుకతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గడచిన ఏడాదిన్నర కాలం మనకు ఎంతో నేర్పింది. కొత్త వేవ్‌ ని తక్కువగా అంచనా వేయవద్దన్నది అది నేర్పిన పాఠాలలో ఒకటి. కరోనా కొత్త వేరియంట్‌ ఏ మూల నుంచైనా మనపై దాడి చేయవచ్చు. కాబట్టి అందరూ రక్షణలను కొనసాగించడం చాలా ముఖ్యం.

కొన్ని యూరప్‌ దేశాలలో కోవిడ్‌-19 తిరిగి విజృంభించటానికి కారణం అజాగ్రత్తే అని చెప్పాలి. కరోనా మరలా విజృంభించటం అసంభవం అనుకున్నారు. కానీ ఏమైంది? పరిస్థితి మరోసారి లాక్‌డౌన్‌ వరకు వెళ్లింది. మన దేశంలో సెకండ్‌ వేవ్‌కు కారణం ప్రజలు, ప్రభుత్వాల అలసత్వమే అని మరవకూడదు. కరోనా వెళ్లిపోయిందని బావించి జాగ్రత్తలకు నీళ్లొదిలేశారు. ఫలితంగా ఊహించని కల్లోలం భారినపడ్డాము. తీవ్ర ప్రాణ నష్టం జరిగింది. అది పునరావృతం కాకూడదు అనుకుంటే పండుగలు, పెళ్లిళ్ల సందర్భంలో కోవిడ్ మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలి. కాబట్టి, థర్డ్‌ వేవ్‌ని నివారించాలంటే ప్రస్తుత సీజన్‌లో జరిగే వివాహ వేడుకల్లో కూడా భౌతిక దూరం పాటించాలి. తప్పనిసరిగా మాస్క్‌లు పెట్టుకోవాలి. శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకోవాలి. ఈ జాగ్రత్తలన్నిటిని తప్పనిసరిగా పాటించాలి. పండుగ సమయంలో కన్నా వివాహ సమయంలో థర్డ్ వేవ్‌కు అవకాశం ఎక్కువ. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన బంధు మిత్రులు పెద్ద సంఖ్యలో ఒక చోట కలుస్తారు. ఇతర నగరాలు, పట్టణాల నుంచేగాక విదేశాల నుంచి కూడా పెళ్లికి హాజరవుతారు. కనుక పెళ్లిళ్ల సీజన్లో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

మరోవైపు, మనకు థర్డ్‌ వేవ్‌ ముప్పుకు అవకాశం తక్కువని నివేది అంటున్నాయి. కరోనా ప్రబలినప్పటి నుంచి దేశ వ్యాప్తంగా “సీరోసర్వేలు”జరుగుతున్నాయి. రక్త నమూనాలు సేకరించి శరీరంలో కోవిడ్ యాంటీబాడీలు ఉన్నాయో లేదో తెలుసుకుంటారు. ఈ సర్వేల ప్రకారం దేశ వ్యాప్తంగా 67.6 శాతం మందిలో కోవిడ్ యాంటీబాడీలు వృద్ధి అయ్యాయని తెలిసింది. గత జూలైలో జరిగిన నాల్గవ జాతీయ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఈ యాంటీబాడీలు వైరస్‌కు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని అందిస్తాయి. ఈ సర్వే నాటికి 24.8 శాతం మంది ప్రజలు మొదటి డోస్ వ్యాక్సిన్‌ తీసుకున్నారు. పదమూడు శాతం మంది రెండు డోసుల టీకాలు తీసుకున్నారు. యాంటీబాడీస్ కలిగి ఉన్నవారిలో ఎక్కువ మంది కోవిడ్‌ బారిన పడ్డారని దీనిని బట్టి తెలుస్తోంది.

అక్టోబర్‌ నాటికి 97 శాతం మంది ఢిల్లీ వాసులు యాంటీబాడీలు కలిగి ఉన్నారు. 80 శాతం మంది పిల్లల్లకు కూడా కోవిడ్‌ నిరోధక శక్తి ఉంది. కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో 95.3 శాతం మందిలో యాంటీబాడీలు అభివృద్ధి అయ్యాయి. అలాగే కోవాక్సిన్ తీసుకున్న వారిలో 93 శాతం మందిలో కోవిడ్‌ నిరోధక శక్తి అభివృద్ధి అయింది. హర్యానాలో 76.3 శాతం మంది పెద్దలు ప్రతిరోధకాలను కలిగి ఉన్నారు. అక్కడి పిల్లలలో ఇది 70 శాతంగా ఉంది. గ్రామీణ, పట్టణ జనాభా మధ్య వ్యత్యాసం చాలా స్వల్పంగా ఉండటం విశేషం.

కేరళ వాసుల్లో అతి తక్కువగా అంటే కేవలం 44.4 శాతం మందిలో మాత్రమే సెరో-ప్రాబల్యం ఉందని జూలైలో జరిగిన నాల్గవ జాతీయ సెరోసర్వేలో తేలింది. ఐతే, అక్టోబర్‌ నాటికి ఇది 82.6 శాతానికి చేరటం విశేషం. అలాగే పట్టణ మురికివాడల నివాసితులలో ఇంకా ఎక్కువగా 85.3 శాతానికి పెరగటాన్ని గమనించాలి.
ఇలా పెద్ద మొత్తం జనాభాలో యాంటీబాడీలు అభివృద్ధి కావటం..అలాగే వ్యాక్సినేషన్‌ స్థాయి పెరుగుదలతో భారతదేశంలో థర్డ్ వేవ్‌ దాదాపు అసంభవం అనిపిస్తుంది.

టీకా తీసుకుని యాంటీబాడీలు పొందిన వారికంటే వ్యాక్సినేషన్‌కు ముందు కోవిడ్‌ బారిన పడి కోలుకున్న వారిలో మెరుగైన రోగనిరోధక శక్తి వృద్ధి అవుతుంది. దీనిని “హైబ్రిడ్ ఇమ్యూనిటీ”అంటున్నారు. రెండు డోసుల టీకా తీసుకున్న వారిలో, అలాగే ఒకసారి కరోనా సోకిన వారికి కనీసం ఆరు నెలల వరకు తిరిగి కరోనా సోకే ప్రమాదం చాలా తక్కువ అంటున్నారు అమెరికా అంటువ్యాధుల నిపుణులు.

మరోవైపు, అందరూ అనుమానించినట్టు పండుగల సీజన్‌లో కరోనా ఉప్పెన కనిపించలేదు. ఎక్కువ మందిలో యాంటీబాడీలు వృద్ధి కావటం వల్ల పరిస్థితి సురక్షితంగా ఉంది. ఈ సెరోసర్వేలు దీనిని నిర్ధారిస్తున్నాయి. అయితే అధిక వ్యాక్సినేషన్‌ కవరేజీ ఉన్న ప్రాంతాల్లో ఉన్న తక్కువ వ్యాక్సినేషన్‌ పాకెట్ల నుంచి ప్రమాదం పొంచి ఉంది. వీటి ద్వారా కరోనా ప్రబలే అవకాశం ఉందని నిపుణులు అనుమానిస్తున్నారు. ఐతే, ఒక వేళ కరోనా కొత్త కేసులు నమోదైనా అవి అంతగా ఆందోళన చెందే స్థాయిలో ఉండవనటం ఊరట కలిగిస్తోంది. ఇక, ప్రస్తుతం వయోజనులలో సెరోపాజిటివిటీ రేటు ఎక్కువగా ఉంది. ఐతే విద్యాసంస్థలు ప్రారంభంతో పిల్లల ద్వారా కొత్త కేసులు నమోదయ్యే అవకాశం ఉందని బావించారు. ఐతే, తొంబై శాతం మంది ఉపాధ్యాయులు కరోనా నిరోధక శక్తిని కలిగి ఉన్నారు. కాబట్టి విద్యాసంస్థల ద్వారా కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌కు అవకాశం ఉండకపోవచ్చు.

దేశంలోని 140 కోట్ల మందిలో టీకాకు అర్హులైన వారిలో 26.9 శాతం మందికి రెండు డోసులు పూర్తయ్యాయి. 55 శాతం మంది కనీసం ఒక డోస్‌ అయినా తీసుకున్నారు. కానీ పురుషులతో పోలిస్తే మూడున్నర కోట్ల మంది మహిళలకు తక్కువ టీకాలు వేశారు.గ్రామీణ జిల్లాలు, గిరిజన ప్రాంతాల్లో టీకాలో వెనకబడి ఉన్నాయి.

ప్రస్తుతం ప్రభుత్వం ముందు రెండు లక్ష్యాలున్నాయి. ఒకటి ఈ నెల చివరి నాటికి 90 శాతం మందికి కనీసం ఒక్క డోసు టీకా అయినా ఇప్పించాలి. రెండవది నిర్నీత గడువు ప్రకారం సెకండ్‌ డోస్‌ పూర్తి చేయటం. మొదటి లక్ష్యాన్ని ఛేదించటంతో దాదాపు విజయం సాధించింది. కానీ సెకండ్‌ డోస్‌ సంతృప్తికరంగా లేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని షెడ్యూల్‌ ప్రకారం రెండో డోస్‌ పూర్తయ్యేలా అధికారులు అవగాహన కార్యక్రమం చేపట్టారు.

మరోవైపు, ఇప్పటికీ చాలా వెనుకబడిన ప్రాంతాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఆశాజనకంగా సాగుట లేదు. ఇటు వంటి ప్రాంతాల్లో ప్రజలకు నమ్మకం కలిగించే చర్యలు చేపట్టటం అధికారుల కర్తవ్యం!
-Dr. Ramesh Babu Bhonagiri

Related Articles

Latest Articles