35 ఏళ్ళ ‘దొంగమొగుడు’

ఆ రోజుల్లో సుప్రీమ్ హీరో చిరంజీవి, ఎ.కోదండరామిరెడ్డి కాంబో అంటే జనానికి ఎంతో క్రేజ్. అప్పటికే వీరిద్దరి కలయికలో రూపొందిన అనేక చిత్రాలు బాక్సాఫీస్ ను భమ్ చిక భమ్ ఆడించాయి. అలా చిరంజీవి, కోదండరామిరెడ్డి కాంబోలో రూపొందిన ‘దొంగమొగుడు’ చిత్రం 1987 జనవరి 9న విడుదలై విజయపథంలో పయనించింది. చిరంజీవి, కోదండరామిరెడ్డి కాంబోలో అప్పటికే పలు నవలా చిత్రాలు సక్సెస్ సాధించాయి. ఈ నేపథ్యంలోనే యండమూరి వీరేంద్రనాథ్ రాసిన ‘నల్లంచు తెల్లచీర’ నవలకు మరింత కథ జోడించి ఈ ‘దొంగమొగుడు’ను రూపొందించారు.

కథ విషయానికి వస్తే- తమ యజమానినే ఓ కేసులో ఇరికించి, ఆయన ఆస్తిని తమపేరున రాయించుకొని చెంచు రామయ్య, అతని మిత్రులు రాజ్యమేలుతుంటారు. అయితే వీరి టెక్ట్స్ టైల్ బిజినెస్ కు రవితేజ అనే యువకుని కంపెనీ దెబ్బ తీస్తుంది. రవితేజ సక్సెస్ ఫుల్ బిజినెస్ మేన్ గా రోజు రోజుకూ పేరు సంపాదించుకుంటూ ఉంటాడు. అతణ్ణి ఎలాగైనా దెబ్బ తీయాలని చెంచు రామయ్య అండ్ కో పథకం వేస్తుంది. ఇక పైకి ఎంతో సక్సెస్ ఫుల్ గా సాగుతున్న రవితేజకు ఇంట్లో భార్య, అత్త, బామ్మర్ది కారణంగా మనశ్శాంతి ఉండదు. అతని వద్ద ప్రియంవద అనే అందమైన అమ్మాయి పి.ఏ.గా చేరుతుంది. ఆమె ఆకర్షణకు గురవుతాడు రవితేజ. ఇక మరోవైపు అచ్చు రవితేజలాగే ఉండే నాగరాజు బ్లాక్ టిక్కెట్స్ అమ్ముకుంటూ, రౌడీయిజం చేస్తుంటాడు. అతని అక్క ఎవరంటే, ఒకప్పుడు చెంచురామయ్య యజమాని భార్య. నాగరాజుకు సీత అనే అమ్మాయితో దోస్తీ. ఇద్దరూ పోట్లాడుకుంటూ ఉంటారు. ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం. అలాంటి నాగరాజు, రవితేజకు ఓ సాయం చేస్తాడు. దాంతో రవితేజ తాను ఊరికి వెళ్తున్నానని, తన స్థానంలో ఇంట్లో ఉండమని కోరతాడు.

రవితేజలాగా వెళ్ళిన నాగరాజుకు అతని ఇంట్లో పరిస్థితి అర్థమవుతుంది. ఒకప్పుడు తమ యజమానిని కేసులో ఇరికించినట్టుగానే, ఓ పథకం ప్రకారం ప్రియంవదను రవితేజ హత్య చేసినట్టు వలపన్నుతారు చెంచు రామయ్య అండ్ కో. కానీ, ప్రియంవద బ్రతికే ఉందని తెలుసుకున్న తరువాత నాగరాజు, అతని మిత్రబృందం మారువేషాల్లో చెంచురామయ్య అండ్ కో భరతం పడతారు. చివరకు రవితేజను ఆయన భార్య అర్థం చేసుకుంటుంది. నాగరాజు అక్క భర్త బ్రతికే ఉన్నాడని తెలుస్తుంది. వారి కూతురే ప్రియంవద అన్న వాస్తవమూ బయట పడుతుంది. నిజానికి ప్రియంవద తన తండ్రి ప్రాణాలకు ముప్పు ఉందని, అందువల్లే చెంచురామయ్య అండ్ కో చెప్పినట్టు నటించి ఉంటుంది. అన్ని తెరలూ తొలగిపోయాక, నాగరాజు ప్రియంవదపై మనసు పడ్డట్టు నటిస్తాడు. అందుకు అతని అక్క, “ఒరేయ్ నేను తలచుకుంటే… నీ కంటే గొప్ప అందగాణ్ణి. హీరోని తీసుకు వస్తాను…” అంటుంది. ఏదీ తీసుకురా చూద్దాం అంటాడు నాగరాజు. అదుగో అనగానే చివరలో గుర్రంపై మరో చిరంజీవి వస్తూ కనిపించడంతో కథ ముగుస్తుంది.

ఇందులో నాయికలుగా రాధిక, మాధవి, బానుప్రియ నటించారు. జయంతి, రాజసులోచన, రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య, రంగనాథ్, గొల్లపూడి మారుతీరావు, గిరిబాబు, చరణ్ రాజ్, సుత్తివేలు నటించారు. టైటిల్ కార్డ్స్ లో తొలుత చిరంజీవి పేరు ముందు ‘సుప్రీమ్ హీరో’ అని, తరువాత అందరి పేర్లు కనిపించాక, మరియు ‘డైనమిక్ హీరో’ చిరంజీవి అని రెండు సార్లు టైటిల్ కార్డ్స్ లో ఆయన పేరు దర్శనమిస్తుంది.

మహేశ్వరీ మూవీస్ పతాకంపై ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ఎస్.పి.వెంకటన్నబాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. చక్రవర్తి స్వరకల్పనలో రూపొందిన పాటలు అలరించాయి. ఇందులోని “నల్లంచు తెల్లచీర…”, “ఈ చెంపకు సెలవీయకు…”, “కోకమ్మా చెప్పమ్మా చెలి సోకులేపాటివో…”, “నీ కోకకింత…” పాటలను సీతారామశాస్త్రి కలం పలికించగా, “అద్దమ రేయి మద్దెల దరువండి…” పాటను కొసరాజు రాశారు. “ఇడ్లీ పాపా ఇడ్లీ పాపా…” సాంగ్ ను రాజశ్రీ అందించారు. సత్యానంద్ మాటలు రాశారు.

యండమూరి వీరేంద్రనాథ్ రాసిన ‘నల్లంచు తెల్లచీర…’ నవలలోని కొంతభాగాన్ని ఈ చిత్రకథలో చొప్పించడం వల్ల కాబోలు, సీతారామశాస్త్రి “నల్లంచు తెల్లచీర… తల్లోన మల్లెమాల…” పాట పలికించారు. ఈ పాటను చాలామంది వేటూరి రాశారని భావిస్తూంటారు. అందుకు కారణం లేకపోలేదు, ఎందుకంటే ఓ సందర్భంలో ఆయన “మేం పలికించే పాటలకు తగ్గట్టుగా చిత్రీకరణ సాగుతుందని చెప్పలేం. ఎందుకంటే పాటలో ‘నల్లంచు తెల్లచీర…’ అంటూ రాశామనుకోండి.. పాట తీసే సమయానికి ఖచ్చితంగా అలాంటి చీర కావాలి కదా. అందువల్ల ఏదో లాగించేస్తుంటారు. కొన్నిసార్లు పాటలో చీర వినిపించినా, మొత్తానికి ఎక్కడా అది కనిపించదు” అని చమత్కరించారు. దానిని పట్టుకొని ఈ పాటను వేటూరి రాశారని అనుకుంటారు. నిజానికి వేటూరి ఈ వ్యాఖ్యానం చేసినప్పటికి సీతారామశాస్త్రి అసలు చిత్రసీమలో ప్రవేశించారో లేదో! అదలా ఉంచితే, వేటూరి చెప్పినట్టుగానే ఈ సినిమాలోని “నల్లంచు తెల్లచీర…” పాటలో ఎక్కడా చీరకట్టుకొని హీరోయిన్ కనిపించక పోవడం విశేషం! అన్నట్టు అంతకు ముందు ఎన్నో చిరంజీవి, కోదండరామిరెడ్డి కాంబోలో వచ్చిన చిత్రాలలో సూపర్ హిట్ సాంగ్స్ రాసిన వేటూరి ఇందులో ఒక్క పాట కూడా రాయకపోవడం గమనార్హం!

Related Articles

Latest Articles