12 నిమిషాల్లో 11 కి.మీ ప్రయాణించిన గుండె

వైద్య పరంగా హైదరాబాద్‌లో ఓ అరుదైన సంఘటన జరిగింది. గుండెను మలక్‌పేట నుంచి పంజాగుట్టకు పన్నెండు నిమిషాల్లో తరలించారు. రెండు ప్రాంతాల మధ్య దూరం పదకొండు కిలో మీటర్లు. ఈ గుండె కోసం అక్కడో ప్రాణం ఎదురుచూస్తోంది. అదృష్టం కొద్దీ అనుకున్న సమయానికి చేరి ప్రాణాలు నిలబెట్టింది.

గుండె మార్పిడి ఆపరేషన్‌ కోసం గ్రీన్‌ ఛానల్‌ ద్వారా మలక్‌ పేటలోని ఓ ఆస్పత్రి నుంచి పంజాగుట్టలోని 12 నిమిషాల్లో గుండెను తీసుకెళ్లారు. గుండెను తరలించే క్రమంలో ఎక్కడా ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా అధికారులు ముందే ఏర్పాట్లు చేశారు. నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తికి వైద్యులు ఈ గుండెను అమర్చనున్నారు. జీవన్‌దాన్‌లో నమోదు చేయించుకున్న 24 గంటల్లోనే అతనికి గుండె దొరకడం విశేషం. ఇది చాలా అరుదు అని వైద్యులు చెబుతున్నారు.

ఖమ్మం జిల్లా కూసుమంచికి చెందిన వీరబాబు.. కొండాపూర్‌ స్పెషల్‌ బ్రాంచ్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 12న విధులకు వెళ్తుండగా గొల్లగూడెం వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బ్రెయిన్ డెడ్‌ అయినట్టు వైద్యులు మంగళవారం తెలిపారు. అయితే మృతుడి హృదయాన్ని దానం చేసేందుకు కుటుంబసభ్యులు ముందుకు రావడంతో పంజాగుట్టలోని నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఓ రోగికి మృతుడి గుండెను మార్పిడి చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం అధికారులు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. మలక్ పేటలోని యశోద ఆస్పత్రి నుంచి మధ్యాహ్నం 1.44 గంటలకు ప్రత్యేక అంబులెన్స్ లో గుండెను తీసుకుని పంజాగుట్టలోని నిమ్స్ కు బయలుదేరారు. మధ్యాహ్నం 1:56గంటలకు గుండె పంజాగుట్ట నిమ్స్‌కి చేరింది. గ్రీన్ ఛానల్‌ ఏర్పాటు చేయటం వల్ల ఎలాంటి ట్రాఫిక్ లేకపోవడంతో కేవలం 12 నిమిషాల్లో గుండెను అక్కడికి చేర్చారు.

ఇలా ఎన్నో కేసులు ఆస్పత్రులకు వస్తుంటాయి. కానీ అనుకున్న సమయానికి అవయవాలు అందరికీ అందవు. అవసరం ఎక్కువ..లభ్యత తక్కువ. అందుకే జీవన్‌దాన్ నెట్‌వర్క్‌తో లింక్‌ చేసిన ఆసుపత్రులకు రొటేషన్ విధానంలో అవసరమైన వారికి అవయవాలు అందేలా ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఆసుపత్రులు 30 ఉన్నాయి. వీటిలో అన్ని వివరాలు ఉంటాయి. దాంతో ఇక్కడ ఏ ఫైరవీ పనిచేయదు. ఈ 30 ఆసుపత్రులకే ఒక రోగిని బ్రెయిన్‌డెడ్‌గా నిర్ణయించే అర్హత, అవయవమార్పిడి చేసే అర్హత ఉన్నాయి. ఇది సంక్లిష్టమైన ప్రక్రియ. అందుకే ఇప్పటివరకూ 30 ఆస్పత్రులకు మాత్రమే అనుమతినిచ్చారు.

పుట్టిన మనిషి గిట్టక తప్పదు. చనిపోయినా సజీవంగా ఉండాలంటే అవయవ దానం చేయండి.

Related Articles

Latest Articles

-Advertisement-