“మా” సాక్షిగా టాలీవుడ్‌ ఆధిపత్య పోరు..!

అంతా అనుకున్నట్టే జరిగింది. ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌లో గెలిచిన వారంతా “మా” పదవులకు రాజీనామా చేశారు. దీంతో మంచు విష్ణుకు రూట్‌ క్లియర్‌ అయినట్టుంది. రెండేళ్ల పాటు “మా”లో ఏ నిర్ణయం తీసుకున్నా ప్రశ్నించే వారు ఎవరూ ఉండరు. “మా” సభ్యుల మంచికోసమే ఈ రాజీనామాలని ప్రకాష్‌ రాజ్‌ ప్యానల్‌ ప్రకటించింది. ఈ రెండేళ్లలో విష్ణు చేసే పనులుకు అడ్డుగా ఉండకూడదనే ఈ రాజీనామాలన్నారు. మీడియాను పిలిచి ఈ విషయం స్వయంగా చెప్పారు ప్రకాష్‌ రాజ్‌.

మూకుమ్మడి రాజీనామాల అనంతరం పలువురు మాట్లాడారు. వారి ద్వారా అనేక కొత్త కొత్త విషయాలు బయటపడ్డాయి. క్రాస్‌ ఓటింగ్‌ నుంచి పాటు పోస్టల్‌ బ్యాలెట్‌ వరకు అన్ని అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఎక్కడెక్కడి నుంచో మనుషులను తీసుకొచ్చారని, రాత్రికి రాత్రే ఫలితాలు తారు మారయ్యాయని ఆరోపించారు.
ఇక తాను “మా” సభ్యత్వానికి రాజీనామా చేయటాన్ని కూడా ప్రకాష్‌ రాజ్ ప్రస్తావించారు. ‘మా’ బైలాస్‌ మార్చి, ‘తెలుగువాడు కాని వ్యక్తి మా ఎన్నికల్లో పోటీ చేయకూడదని మార్చకపోతే.. రాజీనామాను వెనక్కి తీసుకుంటానని చెప్పారు.

పదవులు లేకపోయినా విష్ణుకు అండగా ఉంటామని ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన శ్రీకాంత్‌ అన్నారు. నరేశ్‌ అద్భుతంగా ఎన్నికలను నడిపించారు. తన అనుభవంతో కృష్ణుడిలా చక్రం తిప్పి విష్ణుకు విజయం చేకూర్చారని సెటైర్‌ వేశారు. ఉపాధ్యక్షుడిగా గెలుపొందిన బెనర్జీ సంచలన విషయాలు బయటపెట్టాడు. మోహన్‌ బాబు తనను అమ్మ నా బూతులు తిట్టాడని, తనీష్‌ను కొట్టబోయాడని చెప్పాడు.వాళ్లకి భయపడుతూ ఉండటం కంటే రాజీనామా చేయటం ఉత్తమమని బెనర్జీ ఏడుస్తూ చెప్పాడు. ఇలా ఎన్నో విషయాలు చెప్పుకొచ్చారు.

అయితే ఈ మూకుమ్మడి రాజీనామా వెనక ఏదైనా వ్యూహం ఉందా? నిజంగా “మా” సభ్యుల మంచికేనా ఇదంతా? లేదంటే ఆదిపత్యపోరులో భాగమా? అంటే ఏదైనా కావచ్చు అంటున్నారు పరిశీలకులు. నిజానికి గెలిచిన వెంటనే విష్ణు చేసిన వ్యాఖ్యలు “మా” కథ ఇక్కడితో అయిపోలేదని అనిపించింది. ఆయన తన తొలి ప్రెస్‌ మీట్‌ లోనే సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రకాష్ రాజ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు చిరంజీవి తనను తప్పుకోమన్నారని, అలాగే స్నేహితుడైన రామ్‌ చరణ్‌ తనకు ఓటు వేయలేదని చెప్పారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌లో దుమారం రేపుతున్నాయి.

చిరంజీవి, మోహన్‌ బాబు కుటుంబాల మధ్య పాత స్పర్థలు ఇంకా సమసి పోలేదు. ఇప్పుడు విష్ణు చేసిన వ్యాఖ్యలు వాటిని తిరగతోడేవిగా ఉన్నాయని టాలీవుడ్‌లో టాక్‌. నటుడు,నిర్మాత బండ్ల గణేష్‌ ఇప్పటికే విష్ణు వ్యాఖ్యలు తప్పు అన్నారు. మరోవైపు, ఈ తాజా వివాదంతో ఇండస్ట్రీలో కమ్మ, కాపు వార్‌ తీవ్రమవుతుందని అంటున్నారు. ప్రస్తుతం టాలివుడ్‌లో రెండు కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు జరుగుతోందని, ప్రకాష్‌ రాజ్‌ ని బరిలో దించటానికి కారణం కూడా అదే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

టాలీవుడ్‌ ఆధిపత్య పోరుకు “మా” వేదికగా మారింది. ప్రస్తుతం మంచు, మెగా ఫ్యామిలీల మధ్య వార్‌ జరుగుతున్నట్టు తాజా పరిణామాలను బట్టి అర్థమవుతోంది. మా ఎన్నికల సందర్భంలో చిరంజీవి బహిరంగంగా మాట్లాడకపోయినా.. ఆయన తమ్ముడు నాగబాబు మాత్రం బాహాటంగానే తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఎన్నికలు ముగిసే వరకు మోహన్‌ బాబు సైలెంట్‌గా ఉన్నారు. అయితే దానిని చేతకాని తనంగా బావించ వద్దనటం మెగా ఫ్యామిలీపై ఆయన వేసిన పంచ్‌ అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అంతకు ముందు రోజు చిరంజీవి ఓ ఫిలిం ఫంక్షనలో మాట్లాడుతూ మా లో రేగిన గందరగోళాని ఎవరు బాధ్యలంటూ విష్ణు-మోహన్‌ బాబును ఉద్దేశించి అన్నట్టే ఉంది. విష్ణు పోటీ నుంచి తప్పుకోకపోవటం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందన్నట్టుగా ఉన్నాయి చిరు వ్యాఖ్యలు. దానికి కౌంటరూ మోహన్‌ బాబు వ్యాఖ్యలు అనే వాదన వినిపిస్తోంది.

దాసరి తరువాత ఇండస్ట్రీకి పెద్ద దిక్కు కరువైంది. నిజానికి దాసరి బతికి ఉన్న రోజుల్లోనే మంచు, మెగా మధ్య పోరు మొదలైంది. వారే కాదు ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో మూడు నాలుగు కుటుంబాలు ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నాయి. సందర్భం వచ్చినప్పుడల్లా వద్దనుకున్నా అది బయటపడుతూనే ఉంది. మా ఎన్నికల సందర్భంలో మంచు, మెగా కుటుంబాల మధ్య జరుగుతున్నది అదే అనిపిస్తోంది.

ఆధిపత్య ప్రదర్శనకు ఇండస్ట్రీలో మంచు,మెగాకుటుంబాలు కలిసి పనిచేస్తాయి. అవసరమైతే అందుకోసం ఒకరికొకరు వ్యతిరేకంగానూ పనిచేస్తారు. ఈ ఆధిపత్య పోరులో కొందరు చురుగ్గా పాల్గొంటే..కొందరు తెర వెనుక పాత్ర పోషిస్తారు. మా ఎన్నికల్లో గెలిచిన తరువాత మోహన్‌ బాబు తన కుమారుడు విష్ణుకు ఓ సలహా ఇచ్చాడు. అదేమంటే ..డిస్ట్రబ్‌ చేసేవారు ఉంటారు జాగ్రత్త..అని. ఆయన ఎవరిని ఉద్దేశించి ఈ మాట అన్నాడో చెప్పటానికి పెద్ద తెలివి అవసరం లేదు. ఈ మధ్య పరిశ్రమను పాడుచేస్తున్న వ్యక్తిని గుర్తించి చర్యలు తీసుకోండి అని చిరంజీవి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

మంచు, మెగా వార్‌కు వెనక కథ చాలా వుంది. అది తెలియాలంటే పద్నాలుగేళ్లు వెనక్కి వెళ్లాలి. 2007, జనవరి 28న జరిగిన తెలుగు చిత్ర పరిశ్రమ ప్లాటినం జూబ్లీ వేడుకలు దానికి వేదిక. ఆ వేడుకల్లో కార్యక్రమ నిర్వాహకులు మోహన్‌ బాబును సెలబ్రిటీ అవార్డుతో గౌరవించారు. చిరంజీవిని లెజెండ్‌ అవార్డుతో సత్కరించారు. దాంతో మోహన్ బాబు నిర్వాహకులపై కోపంతో నిప్పులు చెరిగారు. చిరంజీవి పైనా వాక్బాణాలు సందించారు. ఏది తనను సెలబ్రిటీని చేసింది. అలాగే ఏది ఆయనను లెజెండ్‌ని చేసింది సభ సాక్షిగా ప్రశ్నించాడు. పంచాయితీ అక్కడిక్కడ తేలలేదు. భవిష్యత్తులో నిజమైన లెజెండ్ ఎవరు అని తేలే వరకు ఇద్దరి పేర్లను టైమ్ క్యాప్సూల్ లో పెట్టారు.

చిరంజీవిని మోహన్ బాబు టార్గెట్ చేస్తే ఆయన ఇద్దరు తమ్ముళ్లు పవన్ కళ్యాణ్ , నాగబాబు అండగా ఉంటారు. మోహన్ బాబుతో కయ్యానికి దిగే ఏ అవకాశాన్ని ఈ కుటుంబం వదులుకోదు. అలాగే మోహన్ బాబు కూడా. ఆయన బలం ఆయన సపోర్టర్లే కాదు ఆయన ఇద్దరు కుమారులు విష్ణు, మనోజ్ కూడా.

మంచు, మెగా కుటుంబాలే కాదు అక్కినేని, నందమూరి ఫ్యామిలీ కూడా ఈ ఆధిపత్య పోరులతో తమదైన పాత్ర పోషిస్తూనే ఉన్నాయన్నది ఇండస్ట్రీ మాట. ఈ రెండు ఫ్యామిలీలు ప్రస్తుతం “మా” రాజకీయాలకు దూరంగా ఉన్నాయి. అయితే , వచ్చారు..ఓటేశారు..వెళ్లారు..అంత వరకే అనుకుంటే పొరపాటు. అవసరమైనప్పుడు వారు ఈ వార్‌లో తమ వంతు పాత్ర పోషిస్తూనే ఉంటారు. నందమూరి బాలకృష్ణ సందర్బంగా వచ్చిన ప్రతిసారి మెగాస్గార్‌ అండ్‌ బ్రదర్స్‌ పట్ల తన అయిష్టతను ప్రదర్శిస్తూనే ఉంటారనేది ఓపెన్‌ సీక్రెట్‌.

మోహన్ బాబు, చిరంజీవి కనీసం కొన్ని సందర్భాల్లో అయినా తమ మధ్య ఏమీ జరగనట్టు ప్రవర్తిస్తారు. ఆప్యాయం పలకరించుకుంటారు. కానీ బాలకృష్ణ..చిరంజీవి మధ్య అలాంటి సన్నివేశాలను ఊహించలేము. ఓసారి రామ్ చరణ్ తేజ్‌కి మోహన్ బాబు చెక్క బైక్ ని బహుమతిగా ఇచ్చారు. కానీ బాలకృష్ణ విషయంలో ఇలాంటి వాటికి చోటులేదు.

మా ఎన్నికలలో బాలకృష్ణ మంచు విష్ణుకు పూర్తి మద్దతుగా నిలిచారు. కనుక ఇది ప్రధానంగా చిరంజీవి వర్సెస్ మోహన్ బాబు, బాలకృష్ణ అని చెప్పొచ్చు. చిరంజీవి ఫ్యామిలీ మద్దతు ఉన్న ప్రకాష్ రాజ్ గెలవలేకపోయారు. కానీ మోహన్ బాబు కుమారుడు విష్ణు విజయం సాధించారు. వీరంతా కలిసి మా ఒక కుటుంబం అని చెప్పినప్పటికీ చీలిక స్పష్టంగా కనిపిస్తూనే వుంది కదా. తాజా పరిణామాలు “మా”ని ఎక్కడికి తీసుకుపోతాయో కాలమే చెప్పాల్సివుంది.

-Advertisement-"మా" సాక్షిగా టాలీవుడ్‌ ఆధిపత్య పోరు..!

Related Articles

Latest Articles