సంక్రాంతికి రిటర్న్‌ గిఫ్ట్‌.. కరోనా పాజిటివ్‌..?

సంక్రాంతి పండుగ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగువారింట సంక్రాంతి పండుగకు ప్రత్యేక స్థానం ఉంది. గత రెండు సంవత్సరాలుగా కరోనా మహమ్మారి నేపథ్యంలో సంక్రాంతి పండుగను తెలుగువారు నామమాత్రంగానే జరుపుకున్నారు. అయితే మొన్నటి వరకు కరోనా రక్కసి తగ్గుముఖం పడుతుండడంతో ప్రజలు ఈ ఏడాది సంక్రాంతి సంబరాలపై ఆసక్తిగా ఉన్నారు.

ఇదే సమయంలో కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వ్యాప్తి చెందుతోంది. దీంతో మళ్లీ కరోనా కేసులు దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. అయితే ఏపీలో సంక్రాంతి వేడుకలు అంబరాన్నంటే విధంగా జరుపుకుంటారు. కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో ఏపీ ప్రభుత్వం నైట్‌ కర్ఫ్యూ విధించేందుకు సిద్ధమై ప్రకటన చేసింది. ప్రత్యేకమైన సంక్రాంతి గురించి ప్రజలందరూ ఎదురుచూస్తున్న వేళ.. నైట్‌ కర్ఫ్యూ ప్రకటించడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. పునరాలోచన చేసిన ప్రభుత్వం ఈ నెల 18 నుంచి రాష్ట్రంలో నైట్‌ కర్ఫ్యూ విధించనున్నట్లు తెలిపింది.

అయితే సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఏపీలోని దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఏదేమైనా సంక్రాంతి పండుగకు సంబరాలు ఘనంగా నిర్వహించుకుందాంమని ప్రజలు ఫిక్స్‌ అయ్యారు. దీంతో కరోనా కూడా నేనూ ఎవ్వరినీ విడిచిపెట్టనని ఫిక్స్‌ అయినట్లు కనిపిస్తోంది. వైద్యారోగ్య శాఖ అధికారులు ఇప్పటికే పండుగల తరువాత కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.

దీనికి తోడు కోడి పందాలు లాంటి ప్రదేశాల్లో కరోనా నిబంధనలు గాలికి వదిలేస్తున్నారు. ఇవన్నీ చూస్తూంటే… ఎక్కడెక్కడో ఉద్యోగ, వ్యాపార నిమిత్తం పోయినవారు సంక్రాంతికి ఇంటికి వచ్చి తిరిగివెళ్లేటప్పుడు రిటర్న్‌ గిఫ్ట్‌గా కరోనాను తీసుకెళ్తారా..? అనిపిస్తోంది. చూడాలి మరి… సంక్రాంతి కరోనాకు అతిథ్యమిస్తుందా..? అని..

Related Articles

Latest Articles