డాక్టర్లు దృష్టి అంతా రాజకీయాల పై పెడుతున్నారు…!

దేవుళ్ల కంటే సమాజంలో వైద్యులకే ఎక్కువ విలువ. అందులోనూ ప్రభుత్వ డాక్టర్లు అంటే.. ఆ హోదాకు ఉండే గౌరవం ఇంకా ఎక్కువ. కానీ.. వైద్య వృత్తిని వదిలేసి.. సంఘాల పేరుతో చక్కర్లు కొడుతున్నారు తెలంగాణలోని గవర్నమెంట్‌ డాక్టర్లు. ఎవరికి నచ్చిన రాజకీయం వాళ్లు చేస్తూ మరింత రక్తి కట్టిస్తున్నారు.

విభాగ అధిపతులకు కొరకరాని కొయ్యగా ప్రభుత్వ వైద్యులు..?

తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగ సంఘాలు కీలకపాత్ర పోషించాయి. తెలంగాణ ప్రభుత్వ డాక్టర్ల సంఘం సైతం కీలకంగా వ్యవహరించింది. అయితే ప్రత్యేక రాష్ట్రం సిద్ధించాక ప్రభుత్వ వైద్యుల తీరు మారిపోయిందని టాక్‌. డాక్టర్లు తమ దృష్టంతా రాజకీయాలపై పెడుతున్నారు. ఉద్యమ సమయంలో ఏర్పాటైన సంఘం పేరును రెండు గ్రూపులు వాడేసుకుంటున్నాయి. ఈ విషయంలో ఒకరిపై ఒకరు కోర్టుకెళ్లారు. పోలీస్‌ కేసులు పెట్టుకున్నారు. ఒకరిపై మరొకరు పదేపదే ఫిర్యాదులు చేసుకుంటూ HODలకు కొరకరాని కొయ్యగా మారినట్టు చెబుతున్నారు.

వైరి సంఘాలపై డాక్టర్ల తీవ్రస్థాయిలో విమర్శలు..!

వాస్తవానికి ఉద్యోగ సంఘం అంటే ఎన్నికలు.. సభ్యులు ఇలా చాలా తతంగం ఉంటుంది. ఇక్కడ ఒకే సంఘం పేరుతో సాగుతున్న రెండు, మూడు వర్గాల వ్యవహారం గమ్మత్తుగా సాగుతుంది. కిందిస్థాయి నుంచి ఎన్నికలు నిర్వహిస్తున్నాం అని చెబుతున్నా.. ఓ పది మంది కలిసి.. ఒప్పందాలు కుదుర్చుకుని.. పోస్టులు పంచేసుకుంటున్నారు. తమ సంఘమే లీగల్‌గా చెల్లుబాటు అవుతుందని.. ప్రత్యర్థుల యూనియన్‌ ఫేక్‌గా ప్రచారం చేస్తూ.. ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు డాక్టర్లు.

సొంత ప్రయోజనాల కోసం నేతల చుట్టూ ప్రదక్షిణలు..!

యూనియన్ల పేరుతో ఎవరి అవసరాలు వాళ్లు తీర్చుకుంటున్నారట. ఇదేదో లాభసాటిగా ఉందని భావించిన మరికొందరు ప్రభుత్వ డాక్టర్లు కూడా వృత్తిని వదిలేసి.. సంఘాల పేరుతో రోడ్డెక్కుతున్నారు. నలుగురు ప్రభుత్వ డాక్టర్లు కలిస్తే.. ఒక యూనియన్‌ ఏర్పాటు చేసేస్తున్నారు. నీకు ఇది… నాకు అది అని వాటాలు వేసేసుకుని రాజకీయ నేతలను కలవడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. వారానికో.. నెలకో ప్రభుత్వ వైద్యుల సంఘం పుట్టుకు రావడం కామనైపోయింది. ఇవాళ ఓ యూనియన్‌లో ఉన్నవారు.. రేపు సొంతంగా సంఘం పెడతారో.. మరో వర్గంతో కలిసి కనిపిస్తారో ఊహించడం కష్టం. పేరుకు డాక్టర్లే అయినా.. డ్యూటీకంటే సొంత అజెండాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు వైద్యులు.

కొత్త మంత్రి దగ్గరకు ప్రభుత్వ వైద్యుల క్యూ..!

వైద్య ఆరోగ్య శాఖకు ఇప్పుడు కొత్త మంత్రి వచ్చారు. ఆయన బాధ్యతలు చేపట్టారో లేదో.. ప్రభుత్వ వైద్యులంతా మంత్రి ఛాంబర్‌ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. సార్‌.. మేము ఫలానా సంఘం.. మాదే అసలైన యూనియన్‌.. ఇవీ మా డిమాండ్లు అని రోజూ మంత్రి చెవిలోఊదరగొడుతున్నారు. అక్కడే ఉన్న టీఆర్ఎస్‌ నేతలు.. ప్రభుత్వ డాక్టర్ల హడావిడి చూసి.. వీళ్లు మనకంటే ఎక్కువ సందడిగా ఉన్నారే అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారట.

Related Articles

Latest Articles