55 ఏళ్ళ ‘డాక్టర్ ఆనంద్’

(అక్టోబర్ 14న డాక్టర్ ఆనంద్ కు 55 ఏళ్ళు)
నటరత్న యన్.టి.రామారావు, దర్శకులు వి.మధుసూదనరావు కాంబినేషన్ లో పలు జనరంజకమైన చిత్రాలు తెరకెక్కాయి. యన్టీఆర్ ను అన్నగా జనం మదిలో నిలిపిన ‘రక్తసంబంధం’, రామారావు శ్రీకృష్ణునిగా నటవిశ్వరూపం చూపిన ‘వీరాభిమన్యు’, సైకలాజికల్ డ్రామా ‘గుడిగంటలు’, సస్పెన్స్ థ్రిల్లర్ ‘లక్షాధికారి’ వంటి పలు వైవిధ్యమైన చిత్రాలు యన్టీఆర్, మధుసూదనరావు కాంబోలో అలరించాయి. యన్టీఆర్ ను ఓ విభిన్నకోణంలో చూపిస్తూ మధుసూదనరావు తెరకెక్కించిన చిత్రం ‘డాక్టర్ ఆనంద్’. 1966 అక్టోబర్ 14న ‘డాక్టర్ ఆనంద్’ విడుదలయింది.

‘డాక్టర్ ఆనంద్’ కథ ఏమిటంటే- తన భార్యాబిడ్డలతో డాక్టర్ ఆనంద్ ఆనందంగా ఉంటాడు. ఆయన భార్య మాధవి క్యాన్సర్ తో బాధపడుతూ ఉంటుంది. ఆమెను, పిల్లలను ఆనంద్ ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. భర్తను మరో పెళ్ళి చేసుకోమని మాధవి కోరుతుంది. అందుకు ఆనంద్ అంగీకరించడు. విజయ అనే నర్తకి డాన్స్ చూస్తాడు ఆనంద్. ప్రదర్శనలో ఆమె కిందపడుతుంది. కాలుకు ఫ్యాక్చర్ అవుతుంది. ఆమెను ఆసుపత్రిలో చేర్పిస్తాడు ఆనంద్. అతను ఉన్నంత సేపూ విజయ ఎంతో ఆనందంగా ఉంటుంది. అందుకే మరికాసేపు తనతో ఉండమని కోరుతుంది. ఆమె అభిలాష మేరకు అలాగే చేస్తాడు. ఆనంద్ కూడా విజయకు ఆకర్షితుడవుతాడు. వారిద్దరి మధ్య ఏదో ఉందని ఆసుపత్రిలో పనిచేసేవారు అనుకుంటారు. దాంతో విజయను దూరంగా పంపించివేస్తాడు ఆనంద్. వస్తూఉండగా అచ్చు అతనిలాగే ఉన్న ఓ వ్యక్తికి లిఫ్ట్ ఇస్తాడు. అతను చనిపోగా, అతనికి తన దుస్తులు తొడిగి డాక్టర్ ఆనంద్ చనిపోయాడని నమ్మిస్తాడు. తాను విజయ వద్దకు వెళ్ళి కొన్నాళ్ళు హాయిగా ఉంటాడు. తరువాత విజయకు నిజం తెలుస్తుంది. ఓ ప్రమాదానికి గురైన ఆనంద్ ను ఎవరూ గుర్తు పట్టలేరు. తన ఆసుపత్రిలో తన విగ్రహం పెట్టి ఉండడం, భార్య అనారోగ్యంతో ఉండటం చూస్తాడు. అదే సమయంలో ఆనంద్ ను చంపింది ఇతేనని పోలీసులు పట్టుకుంటారు. అయితే మాధవికి శస్త్రచికిత్స చేస్తాడు. దాంతో ఇతడే అసలైన ఆనంద్ అని జనం గుర్తిస్తారు. అలా చేయడానికి విజయ ఎంతో కృషి చేస్తుంది. భార్యాభర్తలను కలిపి, విజయ వెళ్ళిపోవడంతో కథ ముగుస్తుంది.

యన్టీఆర్ డాక్టర్ ఆనంద్ గా నటించిన ఈ చిత్రంలో మాధవిగా అంజలీదేవి, విజయగా కాంచన నటించారు. మిగిలిన పాత్రల్లో చిత్తూరు వి.నాగయ్య, రమణారెడ్డి, పద్మనాభం, రాజబాబు, చదలవాడ, రమాప్రభ, బేబీ పద్మిని, మాస్టర్ ఆదినారాయణరావు కనిపించారు. ఈ చిత్రానికి కే.వి.మహదేవన్ సంగీతం సమకూర్చారు. ఇందులోని పాటలను దేవులపల్లి, సి.నారాయణ రెడ్డి, కొసరాజు, ఆత్రేయ రాశారు. “నీల మోహనా రారా…”, “పెరుగుతున్నది హృదయం…”, “మదిలోని నా స్వామి…”, “నీలాల కనులతో…”, “చక్కని చల్లని ఇల్లు… వంటి పాటలు అలరించాయి.

యన్టీఆర్ హీరోగా వి.మధుసూదనరావు దర్శకత్వంలో ‘లక్షాధికారి’ చిత్రాన్ని రవీంద్ర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై తమ్మారెడ్డి కృష్ణమూర్తితో కలసి డి.వెంకటాచలపతి రెడ్డి నిర్మించారు. ఆయనే డి.వి.రెడ్డి పేరుతో అదే బ్యానర్ పై ‘డాక్టర్ ఆనంద్’ నిర్మించడం విశేషం. ఈ చిత్రానికి ఐదు షెడ్యూల్స్ కు కాల్ షీట్స్ ఇచ్చారు యన్టీఆర్. ఇందులో ఎంతో నవ్యత ఉందని ఆయన విశ్వసించారు. ఈ కథను వి.మధుసూదనరావు, ఆత్రేయ కలసి రాశారు. సినిమా పరాజయం పాలయింది. నిజానికి ఇందులో యన్టీఆర్ తన ఇమేజ్ కు వ్యతిరేకమైన పాత్రలో నటించారు. అదే చిత్రం జనాన్ని ఆకట్టుకోక పోవడానికి కారణం అనిపిస్తుంది. అయితే రిపీట్ రన్స్ లో ఈ సినిమా ఆదరణ పొందడం గమనార్హం!

-Advertisement-55 ఏళ్ళ 'డాక్టర్ ఆనంద్'

Related Articles

Latest Articles