‘పుష్ప’ సువాసనల సుకుమార్!

దర్శకుడు సుకుమార్ ప్రస్తుతం ‘పుష్ప’ గుబాళింపులతో ఆనందతీరాల్లో విహరిస్తున్నారు. జనం కోరేది మనం ఇవ్వాలి… మనం చేసేది జనం మెచ్చేలా ఉండాలి… ఈ సూత్రాన్ని తు.చ. తప్పక పాటిస్తారు సుకుమార్. ఆ సూత్రంతో పాటు, జనానికి ఎప్పుడు ఏ కథ చూపించాలి, ఏ సన్నివేశాన్ని ఎలా పండిస్తే రక్తి కడుతుంది అన్న సూత్రాలనూ అధ్యయనం చేసి సరైన లెక్కలు వేసుకొని, మరీ పక్కాగా సినిమాలు తెరకెక్కిస్తారాయన. అదే సుకుమార్ బాణీగా మారింది. దానికి జై కొట్టే జనం సినిమా సినిమాకూ పెరిగిపోతున్నారు.

సుకుమార్ 1970 జనవరి 11న తూర్పుగోదావరి జిల్లా రాజోలు సమీపంలోని మట్టపర్రు అనే గ్రామంలో జన్మించారు. ఆయన కన్నవారికి ఆరుమంది సంతానం. అందులో అందరికన్నా చిన్నవాడు సుకుమార్. ఆయనకు ముగ్గురు అన్నలు. వారిలో పెద్దాయన బాలకృష్ణ ఫ్యాన్, చిన్నన్నలు చిరంజీవి ఫ్యాన్స్ ఇలా సినిమా వాతావరణం గురించి ఎప్పుడూ వారింటిలో చర్చలు జరుగుతూ ఉండేవి. చిన్నతమ్ముణ్ణి సినిమాలకు తీసుకువెళ్తూ ఉండేవారు అన్నలు. అలా చదువుకొనే రోజుల నుంచీ సినిమా ఆసక్తి ఉన్నా, ఏ నాడూ చదువును నిర్లక్ష్యం చేయలేదు. పైగా, తాను లెక్కల్లో పట్టు సాధించడమే కాదు, ఇతరులకు సైతం లెక్కలు బోధించే స్థాయిలో ఉండేవారు సుకుమార్. పట్టా పుచ్చుకోగానే కొద్ది రోజులు టీచర్ గా పనిచేశారు. తరువాత చిత్రసీమ పిలిచింది. ఎడిటర్ మోహన్ సినిమాలకు, మరికొందరి చిత్రాలకు రైటర్ గా పనిచేసిన సుకుమార్, దిల్ రాజుకు ‘ఆర్య’ కథ వినిపించారు. ఆయనకు నచ్చింది, ఓ ఫంక్షన్ లో అల్లు అర్జున్ ను చూసి, అతని బిహేవియర్ చూశాక అతడే తన ‘ఆర్య’ అని ఫిక్సయ్యాడు సుకుమార్. అలా ‘ఆర్య’ పట్టాలెక్కింది. తొలి చిత్రంతోనే భళా అనిపించారు సుకుమార్.

‘ఆర్య’ తరువాత మూడేళ్ళ గ్యాప్ తీసుకొని ‘జగడం’ చేశాడు సుకుమార్. ఎందుకనో ఈ లెక్కల మాస్టర్ లెక్క తప్పింది. ‘జగడం’ జనాన్ని ఆకట్టుకోలేక పోయింది. ఈ సారి రెండేళ్ళ తరువాత తన తొలి హీరో అల్లు అర్జున్ తోనే ‘ఆర్య-2’ తెరకెక్కించాడు. అంతగా అలరించలేకపోయాడు. ప్రతీ లెక్కకూ సరైన సమాధానం వస్తుందని చెప్పలేం. అయితే లెక్కను మనకు తెలిసిన సూత్రాల ప్రకారం చేశామా లేదా అన్నదే ముఖ్యం. సుకుమార్ చిత్రరూపకల్పనలో తాను అభ్యసించిన సూత్రాలను తు.చ. తప్పక పాటించారు. అయినా, పరాజయం పలకరించింది. ఈ సారి ఏ సూత్రంతో ముందుకు సాగితే, సరైన సమాధానం రాబట్టువచ్చునని శ్రమించారు సుక్కు. నూటికి నూరు శాతం విశ్వాసంతో ‘100 పర్సెంట్ లవ్’ తెరకెక్కించి, అనుకున్నట్టుగానే హిట్టు పట్టారు. ‘హండ్రెడ్ పర్సెంట్’ సాధించిన ఎవరినైనా ‘నంబర్ వన్’ అనే అంటారు. సుకుమార్ కూడా ‘వన్’ అనుకున్నారు. అదీ ‘నేనొక్కడినే’అనీ అన్నారు. ఆ లెక్క ఎందుకనో జనానికి రుచించలేదు. ‘ఐ యామ్ దట్ ఛేంజ్’ అనే లఘుచిత్రం తెరకెక్కించారాయన. దానికి తొలి చిత్ర కథానాయకుడు అల్లు అర్జున్ నిర్మాత కావడం విశేషం. ఆ పై రెండేళ్ళ కు ‘నాన్నకు ప్రేమతో’ రూపొందించారు. బంధాలు, అనుబంధాలను నవతరం ప్రేక్షకులు మెచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఎన్ని చేసినా సుకుమార్ సూత్రాలేవీ తెలుగు బాక్సాఫీస్ ను పెద్దగా మార్చలేకపోయాయి. ఆ నిరాశ, నిస్పృహ నడుమ ‘రంగస్థలం’ తీర్చిదిద్దారు. ఈ సారి లెక్క తప్పలేదు. అనుకున్నది సాధించారు. కోరుకున్న బ్లాక్ బస్టర్ సుకుమార్ సొంతమయింది. పనిలో పనిగా తన చిత్రాలలో అవసరమైన చోట ‘ఐటమ్ సాంగ్’ను చొప్పించడం ఈ లెక్కల మాస్టర్ కు అలవాటు. అలా ‘ఐటమ్ స్పెషలిస్ట్’ అని కూడా అనిపించుకున్నారు సుకుమార్.

తన తొలి హీరో అల్లు అర్జున్ తో సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప’ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళ, మళయాళ, కన్నడ భాషల్లోనూ విడుదలై విజయపథంలో పయనించింది. అసలే ‘అల…వైకుంఠపురములో’ చిత్రంతో అదరహో అనే హిట్ పట్టేసిన అల్లు అర్జున్ తో సినిమా తీశారాయె. దాంతో జనం ఈ సినిమాను భలేగా ఆదరించారు. ఈ సినిమాతో అల్లు అర్జున్ ను ఉత్తరాది ప్రేక్షకులకు కూడా దగ్గర చేశారు సుకుమార్. చిత్రమేమంటే, అల్లు అర్జున్ తో సినిమా తీస్తే రెండు భాగాలతో సినిమాలు తీయాలని నిర్ణయించుకున్నారేమో! అప్పట్లో ‘ఆర్య, ఆర్య-2’ తెరకెక్కించారు. అవేమీ ఒకే కథతో రూపొందినవి కావు. కానీ, ఇప్పుడు ‘పుష్ప – ద రైజ్’కు సీక్వెల్ ‘పుష్ప – ద రూల్’ తెరకెక్కిస్తున్నారు. మరి ఈ సినిమాతో సుకుమార్ ఏ తరహా గుబాళింపులు తెలుగు జనానికి అందిస్తారో చూడాలి.

Related Articles

Latest Articles