నవ్వుల ‘శివ’ నాగేశ్వరరావు

(అక్టోబర్ 7న దర్శకులు శివ నాగేశ్వరరావు పుట్టినరోజు)

‘నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు’ అంటారు. ‘నవ్విస్తూ తానవ్వక ఒప్పిస్తూ తిరుగువాడు శివనాగేశ్వరరావు’ అంటారు తెలుగు సినిమా జనం. దర్శకుడు శివనాగేశ్వరరావును చూస్తే ‘ఈయనేనా… ‘మనీ’లాంటి నవ్వుల నావను నడిపించింది…’ అన్న అనుమానం కలుగుతుంది. ఆయనలో అంత ‘హ్యూమర్’ ఉందని నమ్మబుద్ధి కాదు. కానీ, ఒక్కసారి శివనాగేశ్వరరావుతో మాట్లాడితే తాను నవ్వకుండానే మన పొట్టలు చెక్కలు చేసేస్తూ ఉంటారు. ఆయన తీరిక సమయంలో, మనకు ఓపిక ఉండాలే కానీ, నవ్వుల పువ్వులు రాలుతూనే ఉంటాయి. వాటి సువాసనలు గుర్తు చేసుకున్న ప్రతీసారి కితకితలు మనసొంతమవుతాయి.

గుంటూరు జిల్లా ఉప్పలపాడులో శివనాగేశ్వరరావు బాల్యం గడిచింది. సినిమా ‘రా రమ్మంటూ’ పిలిచే సరికి పరుగు తీసి క్లాప్ బోర్డ్ పట్టేసుకున్నారు. టేకులు కేకుల్లా తిన్నవారికీ, ఫస్ట్ సీన్ లోనే కేక్ వాక్ చేసిన వారికీ క్లాప్ తో ‘టక్ టక్…’ఆడించిన దగ్గర నుంచీ కథలో చేయిచేసుకోవడం, పాటల్లో చేయితిరిగిన గీతరచయితలకే పదాలు అందించడం దాకా చకచకా తన విద్యలు ప్రదర్శిస్తూ పోయారు. ఆయన చురుకుదనం చూసిన వారు నాగేశ్వరరావుతో మళ్ళీ మళ్ళీ పనిచేయించుకొనేవారు. ఆ సమయంలోనే రామ్ గోపాల్ వర్మ చెంత చేరి ‘శివ’ చిత్రానికి పనిచేశారు. ‘శివ’ ఘనవిజయం తరువాత శివ నాగేశ్వరరావును దర్శకునిగా పరిచయం చేస్తూ ‘మనీ’ నిర్మించారు రామ్ గోపాల్ వర్మ. ‘మనీ’ హనీలా ఆకర్షించింది. నిర్మాత మనీ పర్సును నింపింది. అప్పటి దాకా బిట్ రోల్స్ లో, నెగటివ్ రోల్స్ లో కనిపించిన జే.డి. చక్రవర్తి, చిన్నా ‘మనీ’తో హీరోలయిపోయారు. శివనాగేశ్వరరావు తొలి సినిమాతోనే డైరెక్టర్ గా మార్కులు సంపాదించేశారు.

శివ నాగేశ్వరరావు దర్శకత్వంలో “వన్ బై టూ, లక్కీ ఛాన్స్, మనీ మనీ, సిసింద్రీ, పట్టుకోండి చూద్దాం, వామ్మో వాత్తో ఓ పెళ్ళామా, ఓపనై పోతుంది బాబూ…, హ్యాండ్సప్” వంటి చిత్రాలు టైటిల్స్ లాగే వైవిధ్యంతో జనాన్ని అలరించాయి. తరువాత ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన “మిస్టర్ అండ్ మిసెస్ శైలజా కృష్ణమూర్తి, ఫోటో, భూకైలాస్” వంటి చిత్రాలూ వినోదం పంచాయి. శివ నాగేశ్వరరావు చిత్రాల ద్వారా సినిమా రంగానికి పరిచయమైనవారూ ఉన్నారు. నేటి యంగ్ హీరో అఖిల్ అక్కినేని యేడాది ప్రాయంలోనే శివనాగేశ్వరరావు ‘సిసింద్రీ’లో నటించాడు. అలాగే ఈ తరం మరో హీరో వరుణ్ తేజ్ కూడా శివ నాగేశ్వరరావు ‘హ్యాండ్సప్’లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించాడు. నటి అంజలి తొలుత శివనాగేశ్వరరావు ‘ఫోటో’లోనే తెరపై కనిపించింది. హీరోయిన్ రేణుకా సహానీ, సంగీత దర్శకుడు వీణాపాణి, రచయిత జనార్దన్ మహర్షి, రచయిత రవి కొలికపూడి వంటివారు శివనాగేశ్వరరావు చిత్రాల ద్వారానే పరిచయమయ్యారు. తన దర్శకత్వంలో రూపొందిన ‘నిన్ను కలిశాక’లో తెరపై కూడా కనిపించారు శివనాగేశ్వరరావు. ఆయన నుండి మళ్ళీ ఓ నవ్వుల తేరు బయలు తేరుతుందని ఆశిస్తున్నారు జనం. మరి అది ఎప్పుడో చూడాలి.

-Advertisement-నవ్వుల 'శివ' నాగేశ్వరరావు

Related Articles

Latest Articles