సింగీతం హృదయం నుండి పుట్టుకొచ్చిన పాట!

సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావులో సంగీత దర్శకుడు కూడా ఉన్నాడు. కొన్ని కన్నడ చిత్రాలతో పాటు యానిమేషన్ మూవీ ‘ఘటోత్కచ’కు, తెలుగు సినిమా ‘వెల్ కమ్ ఒబామా’కు ఆయన స్వరాలు సమకూర్చారు. తొంభై వసంతాలు దరిచేరినా ఇప్పటికీ ఎంతో ఎనర్జిటిక్ గా ఉంటారు సింగీతం శ్రీనివాసరావు. ఇటీవల కరోనా బారిన పడి తిరిగి కోలుకున్నారు. దర్శకత్వంతో పాటు రచన, సంగీతం ఈ రెండింటినీ సింగీతం ఇష్టపడతారాయన. ఇప్పటికీ సంగీత సాధన చేస్తూ, ఎంతో మందిలో స్ఫూర్తిని నింపుతుంటారు. కరోనా సమయంలో లాక్ డౌన్ కారణంగా ఇంటికి పరిమితమైనప్పుడు కూడా జూమ్‌ మీటింగ్స్ ద్వారా మిత్రులతో మాటామంతీ జరిపి వారిని ఉత్తేజ భరితులను చేసిన వ్యక్తి సింగీతం. తాజాగా ఆయన ఓ ఆంగ్ల గీతాన్ని స్వర పరిచి, గానం చేశారు.

సింగీతం శ్రీనివాసరావు కాలేజ్ డేస్ లో చదువుకున్న ఆ గీతాన్ని హెన్రీ వర్డ్స్ వర్త్ లాంగ్ ఫెలో రాశారు. ‘లైఫ్ ఈజ్ రియల్, లైఫ్ ఈజ్ ఎర్నెస్ట్ అండ్ ది గ్రేవ్ ఈజ్ నాట్ ఇట్స్ గోల్’ అంటూ సాగే ఈ కవిత కరోనా సమయంలో ప్రజలలో ధైర్యాన్ని నింపుతుందని సింగీతం భావించారు. మాస్క్ ధరించడం, చేతులను శుభ్రం చేసుకోవడం, సోషల్ డిస్టెన్స్ పాటించడంతో పాటు మనిషి పేనిక్ కాకుండా ధైర్యంగా ఉండాలని, ధైర్యాన్ని కోల్పోతే ఇమ్యూనిటీ లెవల్స్ తగ్గిపోయే ఆస్కారం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. వర్డ్స్ వర్త్ గీతంలోని కొన్ని వాక్యాలను సింగీతం పాడగా, పవన్ చరణ్ బోనిల వయోలిన్ సహకారం అందించారు. గౌతమ్ రాజు దీనిని ఎడిటింగ్ చేశారు. ఈ గీతాన్ని తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా సింగీతం సమాజానికి అందించారు. ఈ పాట కొద్ది మందిలో ధైర్యాన్ని నింపినా తన ప్రయత్నం సఫలీకృతం అయినట్టేనని సింగీతం తెలిపారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-