70 ఏళ్ళ నవ్వులు … రేలంగి నరసింహారావు

(సెప్టెంబర్ 30న దర్శకులు రేలంగి నరసింహారావు బర్త్ డే)

ఇతరులను బాగా నవ్వించాలంటే ముందుగా మనకు ‘సెన్సాఫ్ హ్యూమర్’ చాలా ఉండాలి. దర్శకుడు రేలంగి నరసింహారావును చూస్తే ఆయన చాలా రిజర్వుడ్ అనిపిస్తుంది. అసలు ఆయనకు నవ్వులంటే చాలా దూరమనీ అనుకుంటాం. కానీ, తాను నవ్వకుండానే ఇతరులను నవ్వించడం మరింత పెద్ద కళ. ఆ కళ బాగా తెలిసిన వారు రేలంగి నరసింహారావు. గురువు దాసరి నారాయణ వద్ద అనేక చిత్రాలకు అసోసియేట్ గా పనిచేసిన తరువాత రేలంగి నరసింహారావు మెగాఫోన్ పట్టారు. తెలుగు, కన్నడ భాషల్లో అనేక చిత్రాలలో నవ్వులే పూయించారు. 70కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు.

రేలంగి నరసింహారావు పైకి కనిపించరు కానీ, ఆయనలో చాలా సెన్సాఫ్ హ్యూమర్ ఉందని ఆయన మిత్రులు కోడి రామకృష్ణ, రవిరాజా పినిశెట్టి చెప్పేవారు. 1951 సెప్టెంబర్ 30న రేలంగి నరసింహారావు పాలకొల్లులో జన్మించారు. పాలకొల్లు ఎందరో కళాకారులకు పుట్టినిల్లు. అల్లు రామలింగయ్య, పినిశెట్టి శ్రీరామ్మూర్తి, దాసరి నారాయణరావు వంటివారందరూ ఆ ఊరివారే. దాసరి దర్శకుడు కాగానే తన ఊరికి చెందిన ఎందరో ప్రతిభావంతులకు చిత్రసీమలో స్థానం కల్పించారు. వారిలో రేలంగి నరసింహారావు కూడా ఉన్నారు. తొలుత బి.వి.ప్రసాద్, కె.ఎస్.ఆర్.దాస్ వంటి వారి వద్ద అసిస్టెంట్ గా పనిచేసిన రేలంగి నరసింహారావు, దాసరి దర్శకుడు కాగానే ఆయన చెంత చేరారు. ఈ గురుశిష్యులిద్దరికీ మంచి అనుబంధం కుదిరింది. గురువు సన్నివేశం వివరిస్తే చాలు, శిష్యుడు అల్లుకుపోయేవారు. దానిని అందంగా తెరకెక్కించడంలో పాలుపంచుకొనేవారు. రేలంగి నరసింహారావు ప్రతిభ చూసి మిత్రులు కోడి రామకృష్ణ, రవిరాజా ప్రోత్సహించారు. రేలంగి నరసింహారావు దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం ‘చందమామ’. అది ముందుగా వెలుగు చూడలేదు. దాంతో నిరాశకు గురైన రేలంగిని మిత్రులు ఊరడించారు. రేలంగి నరసింహారావులోని సెన్సాఫ్ హ్యూమర్ ను గుర్తు చేసి కామెడీ ట్రై చేయమన్నారు. అలా రూపొందిన చిత్రమే ‘నేను మా ఆవిడ’. ఈ హాస్యభరిత చిత్రం జనాన్ని ఆకట్టుకుంది. ఆ తరువాత రేలంగి దర్శకత్వంలో రూపొందిన “ఏవండోయ్ శ్రీమతిగారు, ఇళ్ళంతా సందడి” కూడా నవ్వులు పూయించాయి. అప్పుడు మొదటి సినిమా ‘చందమామ’కూడా వెలుగు చూసింది.

చంద్రమోహన్, రాజేంద్రప్రసాద్ అప్పట్లో కామెడీ హీరోలుగా కదం తొక్కతున్నారు. దాంతో వారిద్దరితోనూ రేలంగి నరసింహారావు ఎడాపెడా సినిమాలు తీసేశారు. అన్నిట్లోనూ నవ్వులే పూశాయి. “ఎదిరింటి మొగుడు- పక్కింటి పెళ్ళాం, ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్, ముచ్చటగా ముగ్గురు, మన్మథలీల కామరాజు గోల, తోడల్లుళ్ళు, చలాకీ మొగుడు – చాదస్తపు పెళ్ళాం, రంభ రాంబాబు, అత్తింట్లో అద్దెఅల్లుడు, పెళ్ళానికి ప్రేమలేఖ-ప్రియురాలికి శుభలేఖ, పరుగో పరుగు” వంటి నవ్వుల సినిమాలు అందించారు. సదా నవ్వులతోనే సాగకుండా “సంసారం, జీవనజ్యోతి, దాగుడుమూతల దాంపత్యం” వంటి ఫ్యామిలీ డ్రామాలూ తీశారు. ‘ఇద్దరు కిలాడీలు’ వంటి యాక్షన్ మూవీనీ తెరకెక్కించారు. వాస్తవానికి సుమన్ తొలి చిత్రం ఇదే. అయితే ‘తరంగిణి’ ముందు విడుదలయింది. కృష్ణంరాజుతో ‘యమధర్మరాజు’ అనే యాక్షన్ డ్రామానూ తెరకెక్కించారు రేలంగి నరసింహారావు. అయితే ఆయన కామెడీ మూవీస్ బాగా ఆడాయి. తెలుగులో తాను తీసిన చిత్రాలనే కన్నడలో రీమేక్ చేశారు. అలా కన్నడ సీమలోనూ రేలంగి నరసింహారావు మంచి పేరు సంపాదించారు. 2016లో ‘ఎలుకా మజాకా’ అనే చిత్రం తెరకెక్కించారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నారు. ఇప్పటికీ తాను దర్శకత్వం వహించడానికి రెడీ అంటున్నారు రేలంగి నరసింహారావు.

-Advertisement-70 ఏళ్ళ నవ్వులు … రేలంగి నరసింహారావు

Related Articles

Latest Articles