యువతను ఆకట్టుకోవడమే మారుతి లక్ష్యం!

(అక్టోబర్ 8న దర్శకుడు మారుతి పుట్టినరోజు)
నవతరం మెచ్చే చిత్రాలను తీస్తూ, తనదైన బాణీ పలికించారు దర్శకుడు మారుతి. కేవలం దర్శకునిగానే కాకుండా రచయితగా, నిర్మాతగానూ మారుతి సక్సెస్ రూటులో సాగారు. యువతను ఆకట్టుకొనే అంశాలను చొప్పించి, జనాన్ని మెప్పించడంలో మేటిగా నిలిచారు మారుతి.

మచిలీ పట్నంలో 1973 అక్టోబర్ 8న దాసరి మారుతి జన్మించారు. బందరులోనే విద్యాభ్యాసం సాగింది. హైదరాబాద్ కు వచ్చి యానిమేషన్ లో ట్రైనింగ్ తీసుకున్నారు. తరువాత వెహికల్స్ కు సైన్ బోర్డ్స్, నంబర్ ప్లేట్స్ చేస్తూ జీవనం సాగించారు. చదువుకొనే రోజుల నుంచీ సినిమాలపై ఆసక్తి ఉంది. దాంతో చిత్రసీమవైపు కూడా పయనం సాగించాలని తపించారు. తమిళంలో విజయం సాధించిన ‘కాదల్’ చిత్రాన్ని తెలుగులో ‘ప్రేమిస్తే’ పేరుతో మిత్రులతో కలసి అనువదించారు మారుతి. ఆ సినిమా మంచి విజయం సాధించింది. రామ్ గోపాల్ వర్మ 5డి కెమెరాతో లో బడ్జెట్ మూవీగా ‘దొంగలముఠా’ చిత్రాన్ని తెరకెక్కించారు. దానిని చూసిన తరువాత తక్కువ పెట్టుబడితో చిత్రాలు నిర్మించవచ్చు అనే నమ్మకం మారుతికి కూడా కలిగింది. బడ్జెట్ కు తగ్గ కథను తయారు చేసుకున్నారు. దానినే ‘ఈ రోజుల్లో’ అనే చిత్రంగా తెరకెక్కించారు మారుతి. యాభై లక్షల్లో రూపొందిన ‘ఈ రోజుల్లో’ సక్సెస్ సాధించింది. తరువాత కుర్రకారుకు కిర్రెక్కిస్తూ ‘బస్టాప్’ తెరకెక్కించారు మారుతి. అది కూడా ఆకట్టుకుంది.

‘ప్రేమకథా చిత్రం’ కథను రాసి, ప్రభాకర్ రెడ్డి దర్శకత్వంలో నిర్మించారు మారుతి. అది అనూహ్య విజయం సాధించింది. తరువాత యువతనే లక్ష్యంగా చేసుకొని “రొమాన్స్, లవ్ యూ బంగారం, గ్రీన్ సిగ్నల్, లవర్స్” వంటి చిత్రాలను నిర్మించారు. అల్లు శిరీష్ హీరోగా ‘కొత్త జంట’ చిత్రానికి దర్శకత్వం వహించారు. మారుతి లోని టాలెంట్ చూసిన అల్లు అరవింద్ మరో అవకాశం కల్పించారు. తత్ఫలితంగా ‘భలే భలే మగాడివోయ్’ చిత్రం రూపొందింది. ఈ సినిమా దర్శకునిగా మారుతికి మరింత పేరు తెచ్చింది. వెంకటేశ్ హీరోగా ‘బాబు బంగారం’ రూపొందించారు మారుతి. శర్వానంద్ తో ‘మహానుభావుడు’, నాగచైతన్యతో ‘శైలజారెడ్డి అల్లుడు’, సాయిధరమ్ తేజ్ తో ‘ప్రతిరోజూ పండగే’ వంటి చిత్రాలను తెరకెక్కించారు మారుతి.

మారుతి దర్శకత్వంలో ‘మంచిరోజులు వచ్చాయి’ అనే సినిమా రూపొందింది. విడుదల కోసం ఎదురు చూస్తోందీ చిత్రం. గోపీచంద్ , రాశీ ఖన్నా జంటగా ‘పక్కా కమర్షియల్’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ రెండు సినిమాలతో మారుతి ఎలాంటి విజయాన్ని సాధిస్తారో చూడాలి.

-Advertisement-యువతను ఆకట్టుకోవడమే మారుతి లక్ష్యం!

Related Articles

Latest Articles