ఆన్ లైన్ టిక్కెట్ బుకింగ్ పై ఓపెన్ అయిన దేవ కట్టా!

రైల్వే ఆన్ లైన్ టిక్కెట్స్ ను ఇష్యూ చేస్తున్న ఐ.ఆర్.సి.టి.సి. తరహాలో ఏపీ ప్రభుత్వం కూడా సినిమా టిక్కెట్ల ఆన్ లైన్ విక్రయాలను జరపాలనే నిర్ణయం తీసుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సెప్టెంబర్ 8న దీనికి సంబంధించిన జీవోను కూడా జగన్ ప్రభుత్వం విడుదల చేసింది. దాంతో థియేటర్లలో టిక్కెట్ ద్వారా వచ్చే మొత్తమంతా ప్రభుత్వ ఖజానాకు వెళ్ళిపోతుందేమోననే సందేహాన్ని కొందరు వ్యక్తం చేశారు. నిజానికి ఆన్ లైన్ ద్వారా టిక్కెట్ అమ్మకాలను మాత్రమే ప్రభుత్వం తన కంట్రోల్ లోకి తీసుకోవాలని చూస్తున్నట్టుగా ఆ జీవోను బట్టి అర్థమౌతోంది. థియేటర్ కౌంటర్ల దగ్గర అమ్మే టిక్కెట్ సొమ్మును ప్రభుత్వం తీసుకోదనే భావించాల్సి ఉంటుంది. లేదంటే… ఆ జీవోలో ఐ.ఆర్.సి.టి.సి.ని ప్రభుత్వం ఉదహరించేదే కాదు. రైల్వే స్టేషన్స్ లో విక్రయించే టిక్కెట్లకు, ఐ.ఆర్.సి.టి.సి. ద్వారా ఆన్ లైన్ లో జరిగే విక్రయాలకు సంబంధమే ఉండదు. అయితే ప్రభుత్వం ఆ విషయాన్ని స్పష్టం చేసి ఉంటే, కొందరు నిర్మాతలు, మరికొందరు ఎగ్జిబిటర్స్ మనసులో నెలకొన్న సందేహాలకు సమాధానం ఇచ్చినట్టు అయ్యేది. కానీ ఆ ప్రయత్నమేదీ ప్రభుత్వం చేయలేదు. పైగా ఇచ్చిన జీవో కూడా ఓ రకంగా ఆన్ లైన్ టిక్కెట్ బుకింగ్ ప్రక్రియకు సంబంధించిన సాధ్యాసాధ్యాలను బేరీజు వేయడానికే అన్నట్టుగా ఉంది. అయితే, ప్రభుత్వం టిక్కెట్ రేట్ల ద్వారా వచ్చే మొత్తాన్ని తాకట్టు పెట్టి అప్పుటు చేస్తుందంటూ కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాహం చూపించడం విడ్డూరంగా ఉందని సినిమా రంగానికే చెందిన కొందరు విమర్శిస్తున్నారు.

ఇక్కడ మరో విషయం కూడా గమనించాలి. గతంలో తెలంగాణ ప్రభుత్వం సైతం ఆన్ లైన్ మూవీ టిక్కెటింగ్ వ్యవస్థను టి.ఎస్.ఎఫ్.డి.సి. ద్వారా నిర్వహిస్తామని ప్రకటించింది. స్వయంగా రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఈ విషయాన్ని చెప్పారు. దానికోసం కొంత కసరత్తు కూడా చేసినట్టు స్పష్టం చేశారు. కానీ అప్పుడు విమర్శనాస్త్రాలు సంధించని వారు ఇప్పుడు ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై సన్నాయి నొక్కులు నొక్కడం చిత్రంగా ఉందని ఓ వర్గం ఆరోపిస్తోంది.

ఇదే సమయంలో మరికొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలను కొందరు చేస్తున్నారు. సినిమా రంగానికి సంబంధించి దర్శకుడు దేవ కట్టా తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. ప్రభుత్వం చేతిలో రైల్వేస్ ఉన్నాయి కాబట్టి… వాటి టిక్కెట్లు ఆన్ లైన్ లో విక్రయించడం సబబే. కానీ ప్రైవేట్ వ్యక్తులకు చెందిన సినిమాల టిక్కెట్లను ప్రభుత్వం అమ్మాలనుకోవడం కరెక్ట్ కాదనే అభిప్రాయం వెలిబుచ్చారు. ఇక మీదట సినిమాలు తీసిన నిర్మాతలు ప్రైవేట్ కాంట్రాక్టర్ల మాదిరి ప్రభుత్వం ముందు డబ్బుల కోసం క్యూలో నిలుచోవాలేమో అనీ విమర్శించారు. లేదంటే ప్రభుత్వమే సినిమాల నిర్మాణం కోసం బడ్జెట్ కేటాయిస్తుందా! అనే అనుమానాన్ని కూడా వ్యక్తం చేశారు. దేవ కట్టా అభిప్రాయంతో పలువురు ఏకీభవిస్తే, మరికొందరు ఖండించారు.

Read Also : సినిమా థియేటర్ల ఆన్ లైన్ టికెట్ బుకింగ్ లోకి ఏపీ ప్రభుత్వం!

మరో విషయం ఏమంటే… సినిమా రంగాన్ని ఆదుకోవాలన్నా… అణదొక్కాలన్నా ప్రభుత్వ పెద్దల చేతుల్లోనే ఉంటుంది. సినిమా రంగంలోని వివిధ శాఖలకు ఏదో ఒక రూపేణ ప్రభుత్వాలు రాయితీలు ఇస్తుంటాయి, అదే సమయంలో వినోదపు పన్ను రూపంలో వెనక్కి సొమ్ముల్ని తీసుకుంటాయి. ఇక పేరుకు చిత్ర ‘పరిశ్రమ’ అని చెబుతుంటుంది కానీ ఇండస్ట్రీగా ట్రీట్ చేయకుండా కమర్షియల్ కేటగిరిలోనే ప్రభుత్వం వివిధ సేవలపై పన్నులను వసూలు చేస్తుంటుంది. అయితే ఇక్కడో మౌలికమైన ప్రశ్న ఉంది. ప్రభుత్వం ఆన్ లైన్ టిక్కెటింగ్ ద్వారా వచ్చే మొత్తాన్ని ఎన్ని రోజుల్లో ఎగ్జిబిటర్స్ కు తిరిగి ఇస్తుంది? అనేది. ఎందుకంటే… ప్రస్తుతం ఈ తరహాలో ఆన్ లైన్ టిక్కెట్లను విక్రయిస్తున్న సంస్థలు ఇరవై నాలుగు గంటల్లో ఆ మొత్తాన్ని జమ చేస్తున్నాయని, ప్రభుత్వాలు అలా చేయడం జరగదని కొందరు ఎగ్జిబిటర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే… నాణానికి రెండో వైపు అన్నట్టుగా మరో కోణం కూడా ఉంది. కొన్ని వ్యవస్థలను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టకుండా ప్రభుత్వం నిర్వహించడమే సబబు అని కొందరు కోరుకుంటారు. అందుకే ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తుంటారు. కానీ ప్రైవేట్ వ్యక్తుల చేతిల్లో ఉన్న కొన్ని వ్యవస్థలను ప్రభుత్వం టేకోవర్ చేసుకోవాలని చూసినప్పుడు మాత్రం… ఇంకొందరు దీనిని వ్యతిరేకిస్తుంటారు. ఎందుకంటే… అధికారంలో ఉన్నది తాము అభిమానించే పార్టీ కాదు కాబట్టి. సో… ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వెనుక, వాటిని వ్యతిరేకించే శక్తుల వెనుక మొత్తం ఉన్నది రాజకీయమే! అంటున్నారు సినీ విమర్శకులు. ఏదేమైనా… ఏపీ ప్రభుత్వం టిక్కెట్ల రేట్లను నియంత్రించడంలో భాగంగా ఆన్ లైన్ టిక్కెటింగ్ ను ఎఫ్‌.డి.సి. ద్వారా జరపాలనుకుంటోందన్నది వాస్తవం. మరి దేవ కట్టా మాదిరి ఇంకెంత మంది తమ గళాన్ని వ్యతిరేకంగానూ, అనుకూలంగానూ విప్పుతారో చూడాలి.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-