నాని ‘ఎఫ్ 2’ వదిలేసి తప్పు చేశాడా!?

ప్రతి బియ్యపుగింజపై తినేవాడి పేరు రాసి ఉంటుందట. అలాగే ఏ సినిమా ఏ హీరో ఖాతాలో పడాలనేది కూడా ఆ భగవంతుడు నిర్ణయించినట్లే జరుగుతుంది. ఎంతో మంది తారలు తమ వద్దకు వచ్చిన హిట్ సినిమాలను చేతులారా వదిలేసి ప్లాఫ్ సినిమాలవైపు అడుగులు వేస్తుంటారు. అందుకు ఉదాహరణలు కో కొల్లలు. నేచురల్ స్టార్ నానికి కూడా అలాంటి అనుభవాలు చాలా ఉన్నాయి. వాటిలో ‘ఎఫ్‌ 2’, ‘రాజా రాణి’ సినిమాలు ప్రత్యేకమైనవి. ఈ సినిమాల మేకర్స్ తమ సినిమాలో నటించమని నానిని అడిగారట. అయితే బిజీగా ఉండటం వల్లనో లేక పారితోషికం తదితర ఇతర విషయాల వల్లనో అవి నానీ కిట్టిలోంచి జారిపోయాయి. తన అప్ కమింగ్ రిలీజ్ ‘టక్ జగదీష్’ ప్రచారంలో ఉన్న నానికి ఈ సినిమాల గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.

టాలీవుడ్‌లో ప్రస్తుతం తను ఉన్న స్థాయి పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు నాని. తొలి చిత్రం ‘అష్టా చెమ్మ’ నుండి గత చిత్రం ‘వి’ వరకు చేసిన ప్రతి సినిమాని ఎంజాయ్ చేశానని అంటున్నాడు. అయితే కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ అవుతాయని తెలిసినప్పటికీ తిరస్కరించానంటున్నాడు. అందులో ‘ఎఫ్‌ 2’, ‘రాజా రాణి’ ఉన్నట్లు అంగీకరించాడు. ఆ యా చిత్రాల నిర్మాతలు సంప్రదించారని, అయితే ఆ టైమ్ లో వాటిలో నటించే పరిస్థితిలో తను లేకపోవడం వల్ల తిరస్కరించానంటున్నాడు. ఇక ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహించిన తన గత చిత్రం ‘వి’ ఫలితం పట్ల సంతోషంగానే ఉన్నాడట. నిర్మాత దిల్ రాజుతో పాటు ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్, చూసిన ప్రేక్షకులు అందరూ సంతోషంగానే ఉన్నారని… అయినా ప్లాఫ్ అని ఎందుకు అంటున్నారో తనకు అర్థం కావటంలేదంటున్నాడు నాని. మరి వినాయకచవితి కానుకగా వస్తున్న ‘టక్ జగదీష్’ అయినా నాని నమ్మకాన్ని నిలబెడుతుందేమో చూడాలి. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్, రీతూ వర్మ కథానాయికలు.

Related Articles

Latest Articles

-Advertisement-