15 ఏళ్ళ ‘దేశముదురు’

నేడు టాప్ స్టార్ గా సాగుతున్న ‘స్టైలిష్ స్టార్’ అల్లు అర్జున్ కెరీర్ లో మరపురాని, మరచిపోలేని చిత్రంగా ‘దేశముదురు’ నిలచింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన తొలి చిత్రమిది. ఈ సినిమా బన్నీ కెరీర్ లో పలు రికార్డులను నమోదు చేసింది. బన్నీ కెరీర్ లో అత్యధిక కేంద్రాలలో శతదినోత్సవం చూసిన సినిమాగానూ, ఆయన నటజీవితంలో డైరెక్ట్ గా సిల్వర్ జూబ్లీ జరుపుకున్న ఏకైక చిత్రంగానూ నిలచింది. అప్పట్లో బన్నీ మూవీస్ లో అత్యధిక వసూళ్ళు చూసిన సినిమాగానూ ‘దేశముదురు’ రికార్డు సృష్టించింది. బన్నీని యూత్ కు మరింత దగ్గర చేసిన చిత్రంగానూ ‘దేశముదురు’ జేజేలు అందుకుంది. ఇలా బన్నీ కెరీర్ లో పలు విశేషాలకు కేంద్రమైన ‘దేశముదురు’ 2007 జనవరి 12న సంక్రాంతి సంబరాల్లో సందడి చేసింది. ఈ చిత్రాన్ని భగవాన్.జె సమర్పణలో డి.వి.వి. దానయ్య తమ యూనివర్సల్ మీడయా పతాకంపై నిర్మించారు. ఈ సినిమాతోనే హన్సిక తొలిసారి హీరోయిన్ గా వెలిగింది.

‘దేశముదురు’ కథ ఏమిటంటే – నీతికోసం పోరాడే బాల గోవింద్ అనే టీవీ జర్నలిస్ట్ ఓ సారి ఓ వ్యక్తిని కాపాడే క్రమంలో మురుగేశన్ అనే వాడిని చితక బాదుతాడు. వాడు పేరుమోసిన స్మగ్లర్ తంబి దురై కొడుకు. వాడి నుండి బాల గోవింద్ ను కాపాడేందుకు అతను పనిచేసే టీవీ యాజమాన్యం కులుమనాలీ పంపిస్తుంది. ట్రావెల్ ఎపిసోడ్ షూట్ చేయడానికి బాలగోవింద్ తన క్రూ తో కులుమనాలీ చేరుకున్నాక, అక్కడ సన్యాసినిగా ఉన్న వైశాలి అతణ్ణి ఆకర్షిస్తుంది. ఆమె బాలను తిరస్కరిస్తుంది. అయినా వెంట పడుతూనే ఉంటాడు. ఆమెకు కూడా అతనంటే ప్రేమ ఉన్నట్టు, ప్రధాన సన్యాసిని గమనిస్తుంది. వారి ప్రేమ ఫలించేలా ఆశీర్వదిస్తుంది. హైదరాబాద్ వెళ్ళి, వైశాలిని పెళ్ళాడాలని ఆశిస్తాడు బాల. ఈ లోగా ఆమెను తంబి దురై మనుషులు కిడ్నాప్ చేస్తారు. ఒకప్పుడు బాల రక్షించిన వ్యక్తి కనిపించి, అసలు విషయం చెబుతాడు. కోటీశ్వరుని కూతురైన వైశాలిని తన కొడుకు పెళ్ళి చేసుకుంటే, ఆమె ఆస్తి మొత్తం తనదే అవుతుందని తంబి దురై, అతని భార్య ఆండాళ్ భావించి ఉంటారు. వారి నుండి తప్పించుకొని కులు మనాలీలో సన్యాసినిగా జీవిస్తూ ఉంటుంది వైశాలి. ఈ విషయం తెలుసుకున్న బాల, పోలీస్ అధికారి ప్రసాద్ సాయం తీసుకుంటాడు. తంబి దురై కుటుంబాన్ని ఓ ఆట ఆడిస్తాడు. చివరకు తంబి దురై కుటుంబాన్ని నాశనం చేస్తాడు. తాను కోరుకున్న వైశాలి చేయిని బాల అందుకోవడంతో కథ ముగుస్తుంది.

అల్లు అర్జున్, హన్సిక, ప్రదీప్ రావత్, ఆలీ, చంద్రమోహన్, దేవన్, శకుంతల, సుబ్బరాజు, ఆహుతి ప్రసాద్, రమాప్రభ, రాజా రవీంద్ర, అజయ్, జీవీ సుధాకర్, కోవై సరళ, రఘుబాబు, గుండు సుదర్శన్, జీవా, హేమ, నర్సింగ్ యాదవ్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి కథ, మాటలు, దర్శకత్వం పూరి జగన్నాథ్ నిర్వహించగా, చక్రి సంగీతం సమకూర్చారు. భాస్కరభట్ల, కందికొండ పాటలు రాశారు. ఇందులోని “నిన్నే నిన్నే…”, “గిలి గిలిగా…”, “సత్తే ఏ గొడవలేదు…”, “గోల పెట్టినాదిరో…”, “అట్టాంటోడే…ఇట్టాంటోడే…” పాటలు అలరించాయి.

అప్పట్లో 400 థియేటర్లలో విడుదలైన బన్నీ తొలి చిత్రంగా నిలచింది ‘దేశముదురు’. వందకు పైగా థియేటర్లలో శతదినోత్సవం చూసిన ఈ సినిమా హైదరాబాద్ సుదర్శన్ 70 ఎమ్.ఎమ్.లో నేరుగా రజతోత్సవం పూర్తి చేసుకుంది. బన్నీ కెరీర్ లో అత్యధిక రోజులు ప్రదర్శితమైన చిత్రంగానూ ‘దేశముదురు’ నిలచింది. ఈ సినిమా ఘనవిజయంతో హన్సికకు అవకాశాలు భలేగా లభించాయి. “సత్తే ఏ గొడవా లేదు…” పాటకు నృత్యభంగిమలు సమకూర్చిన నోబెల్ కు ఉత్తమ నృత్య దర్శకునిగా నంది అవార్డు లభించింది. ఈ సినిమాలో సిక్స్ ప్యాక్ ప్రదర్శించిన బన్నీకి యూత్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఎంతోమంది తామూ సిక్స్ ప్యాక్ తెచ్చుకోవాలని తపించేలా కుర్రకారును ఉసిగొల్పిందీ చిత్రం.

Related Articles

Latest Articles