తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖలో డిప్యుటేషన్లు రద్దు…

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో డిప్యుటేషన్ల రగడ కలకలం రేపుతోంది. కరోనా పీక్‌లో ఉన్న సమయంలో తమ పనితీరుతో మంచిపేరు తెచ్చుకున్న వారికి ఆ నిర్ణయం మింగుడు పడటం లేదట. కానీ.. అసలు విషయం తెలుసుకుని ఎక్కడివారు అక్కడే గప్‌చుప్‌ అయ్యారట. అదే ఇప్పుడు ఆ శాఖలో హాట్‌ టాపిక్‌గా మారింది. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం.

డిప్యుటేషన్ల రద్దుతో వైద్యశాఖలో కలకలం

వైద్యశాఖకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ పరిధిలో పనిచేస్తున్న వైద్యులు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది.. ఇతర సహాయక సిబ్బంది డిప్యుటేషన్లను రద్దు చేసింది. మాతృస్థానంలో కాకుండా డిప్యుటేషన్లు.. వర్క ఆర్డర్లపై వేర్వేరు చోట్ల పనిచేస్తున్నవారిని తక్షణమే తమ ఒరిజినల్‌ పోస్టింగ్‌లలో చేరాలని ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ఆదేశాలే వైద్య ఆరోగ్యశాఖలో కలకలం రేపుతున్నాయి.

చాలామంది నాటి మంత్రి ఈటల సిఫారసుతో వెళ్లారట

ప్రభుత్వ శాఖల్లో డిప్యుటేషన్లు సాధారణం. ఆ మధ్య కరోనా మొదలయ్యాక వైద్యశాఖలో వేర్వేరు కారణాలు చూపించి చాలా మంది రెగ్యులర్ పోస్టుల నుంచి బయటకొచ్చారు. తమకు అనుకూలంగా.. నివాస ప్రాంతాలకు దగ్గరగా ఉన్న చోటకు డిప్యుటేషన్‌ వేయించుకున్నారు. చాలా మంది ఆ విధంగా హైదరాబాద్‌ వచ్చారు కూడా. ఇలా డిప్యుటేషన్‌పై వెళ్లిన వారిలో చాలామంది నాటి వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ సిఫారసుతో కదలినవాళ్లేనట. ఆ విషయం బయటపడటంతో ప్రభుత్వం ఆగమేఘాలపై చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. డిప్యుటేషన్లను రద్దు చేసింది.

వెయ్యిమందికిపైగా డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నారట!

కొత్త ఉత్తర్వులకు అనుగుణంగా జిల్లా వైద్యాధికారులు… ఆస్పత్రి సూపరింటెండెంట్లు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల్లో ఉంది. ఈ నిబంధనలు ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తప్పదని హెచ్చరించారు ఉన్నతాధికారులు. సర్కార్‌ నిర్ణయంతో వైద్య ఆరోగ్యశాఖలో కలకలం మొదలైంది. ట్రాన్స్‌ఫర్లపై బ్యాన్‌ ఉండటంతో చాలా మంది డిప్యుటేషన్‌ పేరుతో నచ్చిన ప్రదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఈ విధంగా పనిచేస్తున్నవారి సంఖ్య వెయ్యికిపైగా ఉండొచ్చని సమాచారం.

కొన్నిసార్లు పైరవీలు.. ముడుపులు కీలకంగా మారతాయి!

కొన్ని సందర్భాలలో ఆయా ప్రాంతాల్లో అవసరాలను బట్టి ప్రభుత్వం కొందరిని ఒక చోటు నుంచి మరో చోటుకు డిప్యూట్‌ చేస్తుంది. కుటుంబ.. ఇతర అత్యవసరాలను దృష్టిలో పెట్టుకుని కొన్నిసార్లు ఉద్యోగులే డిప్యుటేషన్‌కు దరఖాస్తు చేస్తారు. ఈ సందర్భంగా పైరవీలు, ముడుపులు కీలకంగా మారతాయి. ప్రస్తుతం డిప్యూటేషన్‌పై పనిచేస్తున్నవారిలో ఎక్కువ మంది ఆ విధంగానే వెళ్లారని ప్రభుత్వానికి సమాచారం అందిందట. దీంతో మాతృస్థానాల్లో ఖాళీలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఆ డిప్యుటేషన్లు అన్నీ రద్దు చేశారు.

ఈటల ఎపిసోడ్‌ గురించి తెలిసి కిమ్మనడం లేదట

ప్రభుత్వం సడెన్‌గా ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందని కొందరు ఆరా తీశారట. చివరకు మాజీ మంత్రి ఈటల ఎపిసోడ్‌ గురించి తెలిసి కిమ్మనడం లేదట. అయితే డిప్యుటేషన్ల రద్దు వెనక కారణాలు ఏమైనా.. నిజంగా అవసరం ఉండి వేరేచోట ఉద్యోగం చేస్తున్నవారు మాత్రం ఇబ్బంది పడుతున్నారట. అయితే ఈ వివాదం ఇక్కడితో ఆగుతుందో.. లేక మరిన్ని మలుపులు తిరుగుతుందో అన్న చర్చ జరుగుతోంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-