ఏపీ తెలంగాణ మధ్య మరో ‘కరెంట్’ ఫైట్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ, ఏపీ ప్రత్యేక రాష్ట్రాలుగా విడిపోయి ఏడేళ్లు గడుస్తోంది. అయినా ఈ రెండు రాష్ట్రాల మధ్య విభజన పెట్టిన చిచ్చు ఇంకా చల్లారడం లేదు. తరుచూ ఇరు రాష్ట్రాల మధ్య కొత్త పంచాయతీలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే జలవివాదాలు, సరిహద్దు వివాదాలు, నిధుల వాటా విషయాల్లో తెలుగు రాష్ట్రాల మధ్య ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తాజాగా ఇరు రాష్ట్రాల మధ్య కరెంట్ ఫైట్ నడుస్తుండటం చర్చనీయాశంగా మారింది. తమకు రావాల్సిన విద్యుత్ బకాయిలను ఇప్పించాలని తాజాగా ఏపీ ప్రభుత్వం ఏకంగా తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం సంచలనమైంది. అయితే ఏపీనే తమకు విద్యుత్ బకాయి ఉందంటూ తెలంగాణ సర్కారు వాదిస్తోంది. విభజన సమస్యలను పరిష్కరించాల్సిన కేంద్రం ప్రేక్షకపాత్ర పోషిస్తుంది. ఈనేపథ్యంలో ఈ వివాదం మరింత ముదిరే అవకాశం కన్పిస్తోంది.

విభజన నాటి నుంచే విద్యుత్ సరఫరా విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం నెలకొని ఉంది. లోటు బడ్జెట్లో ఉన్న ఏపీకి కరోనా కష్టాలు తోడుకావడంతో నిధులలేమితో కొట్టుమిట్టాడుతోంది. ఈక్రమంలోనే తమకు ఎక్కడెక్కడ పెండింగ్ నిధులు రావాలో ఏపీ సర్కారు దృష్టిసారించింది. దీనిలో భాగంగా తెలంగాణ నుంచి రావాల్సిన పెండింగ్ నిధులను రాబట్టేందుకు ప్రయత్నిస్తోంది. తెలంగాణ నుంచి ఏపీకి దాదాపు 6వేల కోట్ల విద్యుత్ బకాయిలు రావాల్సి ఉండటాన్ని గుర్తించింది. ఈమేరకు తెలంగాణ ప్రభుత్వానికి బకాయిలు చెల్లించాలని పలుమార్లు ఏపీ సర్కారు లేఖలు రాసింది. దీనిని తెలంగాణ సర్కారు పెద్దగా పట్టించుకోకపోవడం లేదు. దీంతో ఏపీ సర్కారు తెలంగాణ హైకోర్టులో ఏపీకి రావాల్సిన పెండింగ్ విద్యుత్ బకాయిలు ఇప్పించేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్ దాఖలు చేసింది.

విభజన హామీల్లో భాగంగా ఏపీ గతంలో తెలంగాణకు విద్యుత్ సరఫరా చేసిందని పేర్కొంది. ఈమేరకు ఆ రాష్ట్రం నుంచి తమకు 3,441 కోట్లు కావాల్సి ఉందని పిటిషన్లో పేర్కొంది. 2017 జూన్ నాటికి 2841కోట్ల వడ్డీ కూడా తెలంగాణ సర్కారు చెల్లించాల్సి ఉందని తమ పిటిషన్లో ఏపీ సర్కారు పేర్కొంది. పలుమార్లు ఇదే విషయాన్ని తెలంగాణ సర్కారు దృష్టికి తీసుకెళ్లినా పెద్దగా పట్టించుకోకపోవడంతో చివరికి విద్యుత్ సరఫరా నిలిపి వేసినట్లు వెల్లడించింది. మొత్తంగా తమకు బకాయి ఉన్న 6,283 కోట్ల రూపాయల బకాయిలను తెలంగాణ సర్కారు చెల్లించేలా ఆదేశాలివ్వాలని ఏపీ జెన్కో ఎండీ బి. శ్రీధర్ హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ సర్కారు బకాయిలు చెల్లించకుంటే ఏపీ జెన్కో ఇబ్బందుల్లో పడుతుందని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

మరోవైపు తెలంగాణ వాదన మాత్రం వేరేలా ఉంది. ఏపీ విద్యుత్ పంపిణీ సంస్థలే తమకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. ఏపీ నుంచి తమకు 5వేల కోట్ల రూపాయలు రావాల్సి ఉందని తెలంగాణ ట్రాన్స్ కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన లెక్కలు తమ వద్ద ఉన్నాయని ఈమేరకు ఏపీ విద్యుత్ సంస్థలకు లేఖలు రాసినట్లు తెలిపారు. ఏపీకి డిస్కంల నుంచి బకాయిలు రావాల్సి ఉంటే వాటి నుంచి వసూలు చేసుకోవాలి కానీ జెన్కోకు చెల్లించాల్సిన డబ్బులను నిలిపివేయడం ఏంటని తెలంగాణ వాదిస్తుంది.

గతంలోనే ఈ వివాదంపై జాతీయ కంపెనీల ట్రిబ్యునల్ లా లో విచారణ జరిగింది. మూడేళ్లుపాటు కొనసాగిన ట్రీబుల్లో వాదనలు కొనసాగిన తర్వాత ఏపీ తాను వేసిన పిటిషన్ ను ఉపసంహరించుకుంది. రెండేళ్లుగా సైలెంటుగా ఉన్న ఏపీ సర్కారు తాజాగా తమ బకాయిల కోసం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. దీనిపై అక్టోబర్ 28న కోర్టు విచారణ చేపట్టనుంది. కొద్దిరోజులుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న విభజన సమస్యలు మరోసారి వెలుగులోకి వస్తున్నాయి. ఈ సమస్యలు ఇప్పటికైనా కొలిక్కి వస్తాయా? లేదంటే రావణకాష్టంలా రగులుతూనే ఉంటాయా? అనేది మాత్రం వేచిచూడాల్సిందే.

Related Articles

Latest Articles

-Advertisement-