నేతలూ ఆలోచించండి.. జనానికి ఇలా దగ్గరకండి.. కరోనాను నివారించండి!

కరోనా తీవ్రత ఇంకా తగ్గనేలేదు. ప్రతి రోజు ప్రతి రాష్ట్రంలో వందల సంఖ్యలో ఇంకా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. అయినా.. రాజకీయ కార్యకలాపాల జోరు మాత్రం తగ్గడం లేదు. ప్రత్యామ్నాయాలు ఉన్నా.. వాటిని పాటించడంలో పార్టీల నాయకత్వాలు, నేతలు ఏ మాత్రం పట్టింపు లేకుండా పోతుండడం.. జనానికి ముచ్చెమటలు పట్టిస్తోంది. లక్షలాదిగా జన సమీకరణ చేస్తుండడం కరోనా వ్యాప్తికి కారణం అవుతుందని.. నిపుణులు హెచ్చరిస్తున్నారు. బహిరంగ సభలు.. పాదయాత్రలు, సమావేశాలను కాస్త నివారించినా.. అది అందరికీ మేలు చేస్తుందని.. సాంకేతికతను వాడుకుని కూడా జనంలోకి వెళ్లే మార్గాలు చాలానే ఉన్నాయని.. కొందరు సూచిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా.. తమ ఉద్దేశాలను మరింత బలంగా చాటి చెప్పడమే కాదు.. సమయ నిబంధనలు లేకుండా.. లక్షలాది మందికి ఒకేసారి నేతలంతా కలిసి అందుబాటులోకి రావచ్చని.. తమ అభిప్రాయాలు పంచుకోవచ్చని చెబుతున్నారు.

సాధారణంగా.. ఓ బహిరంగ సభ ఏర్పాటు చేయాలంటే.. ఎంతో కసరత్తు చేయాలి. ప్రాంగణాన్ని ఎంపిక చేయాలి. చదును చేయించాలి. బారికేడ్స్ కట్టాలి. సభావేదిక బలంగా నిర్మించాలి. రక్షణ ఏర్పాట్లు చేయాలి. జన సమీకరణ చేయాలి. వారిలో కొందరిని రకరకాలుగా సంతృప్తి పరచాలి. చివరికి సభ పూర్తయ్యాక ఇంటికి సురక్షితంగా చేర్చాలి. రాకపోకలక వాహనాలను సమకూర్చాలి. ఈ తంతుకు ముందు.. విపరీతమైన ప్రచారాన్ని కూడా చేయాలి. వీటన్నిటి బదులుగా.. స్థానిక నాయకత్వంతో సమన్వయం చేసుకుని.. పెద్ద పెద్ద డిజిటల్ స్క్రీన్లు పెట్టి.. జనంతో బహిరంగ వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి.. నేతలు నేరుగా మాట్లాడే అవకాశాలు చాలానే ఉన్నాయి. ఏదైనా హాల్ లో కానీ.. మైదానంలో కానీ.. పెద్ద పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేసి.. ఓ వంద మంది ప్రజలను ఎంపిక చేసి… ఆ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అగ్ర నేతలు.. తమ అభిప్రాయాలను నేరుగా పంచుకోవచ్చు. వారితో స్క్రీన్ షేర్ చేసుకుని సెల్ఫీలు దిగవచ్చు. సోషల్ మీడియాలో.. తమ అనుకూల మీడియాలో ప్రమోట్ చేసి.. ప్రజల్లో ఆసక్తిని పెంచవచ్చు.

గ్రామాల యూనిట్ గా.. నిత్యం సమావేశాలు నిర్వహించవచ్చు. గ్రామాల నుంచి కొందరిని ఎంపిక చేసి.. మండలాల యూనిట్ గా.. అలా జిల్లాలకు ఒకటి.. రాష్ట్ర స్థాయిలో మరోటి సమావేశాలు నిర్వహించుకోవచ్చు. వారానికోసారి జనాన్ని సిద్ధం చేసి.. వీడియో సందేశాలు ఇస్తూ.. అభిప్రాయాలు సైతం తీసుకోవచ్చు. గతంలో ఇలా చేసి రాజకీయంగా ప్రధాని మోడీ సైతం మంచి పాపులారిటీ తెచ్చుకున్న ఉదాహరణ సైతం మన దగ్గర ఉంది. అలాంటి ప్రత్యామ్నాయాలను పాటిస్తే.. కరోనా వ్యాప్తి నివారణలో రాజకీయ పార్టీలు ఆదర్శంగా నిలిచే అవకాశం ఉంది. కాబట్టి నేతలారా.. దయచేసి ఆలోచించండి. అవకాశం ఉంటే ఆచరించండి. మీ జనాన్ని.. మీరే కాపాడండి.

Related Articles

Latest Articles

-Advertisement-