రేపటి నుంచే పిల్లలకు టీకా.. కోవిన్ యాప్ లో రిజిస్ట్రేషన్లు

ఒకవైపు కోవిడ్ వ్యాప్తి, మరోవైపు ఒమిక్రాన్ దాడితో ప్రపంచం అతలాకుతలం అవుతోంది. పిల్లల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై పడింది. అందుకే భారత ప్రభుత్వం 15-18 ఏళ్ళ వయసున్న పిల్లలకు కరోనా వ్యాక్సిన్ వేయడానికి రెడీ అయింది. 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల లోపు వయసు పిల్లలకు 2022 జనవరి 3వ తేదీ నుంచి కోవిడ్ వ్యాక్సీన్లు ఇస్తామని.. వీరు కోవిన్ యాప్ ద్వారా లేదా వెబ్‌సైట్ ద్వారా కోవిడ్ వ్యాక్సీన్లకు స్లాట్లు బుక్ చేసుకోవచ్చునని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దానికి అనుగుణంగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. చిన్నారులకు కోవిడ్ టీకాలు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించినా.. అనేక యూరప్ దేశాలు అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, న్యూజీలాండ్ తదితర దేశాల కన్నా భారతదేశం కంటే ముందున్నాయి.

కరోనా పిల్లలపై చూపిన ప్రభావం తక్కువేనని చెప్పాలి. ప్రపంచం మొత్తం నమోదైన కేసుల్లో ఐదేళ్ల లోపు చిన్నారులు 2 శాతం మంది మాత్రమే. ప్రపంచం మొత్తం నమోదైన కోవిడ్ మరణాల్లో ఐదేళ్ల లోపు చిన్నారులు 0.1 శాతంగా ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచం మొత్తం నమోదైన కరోనా కేసుల్లో 5 నుంచి 14 ఏళ్ల వయస్సు లోపు పిల్లలు 7 శాతం మంది, ప్రపంచం మొత్తం నమోదైన కోవిడ్ మరణాల్లో వీరి సంఖ్య కేవలం 0.1 శాతంగా ఉంది. అయితే ముందు జాగ్రత్తగా పిల్లలకు టీకాలు ఇవ్వనున్నారు.

పిల్లలకు టీకా ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేశామని హైదరాబాద్ జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ వెంకట్ అన్నారు. రేపటి నుంచే పిల్లలకు టీకా ఇస్తామన్నారు. ‘కొవిన్‌’ రిజిస్ట్రేషన్‌ ఇప్పటికే ప్రారంభమయిందని రాష్ట్రంలో 15-18 ఏళ్లవారు 22.78 లక్షలు పిల్లలున్నారని తెలిపారు. జీహెచ్‌ఎంసీతో పాటు 12 కార్పొరేషన్లలో ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు.. మిగతా చోట్ల నేరుగా టీకాలు వేస్తామన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ పిల్లలకు వ్యాక్సిన్లు ఇస్తారన్నారు. పిల్లలకు కోవాగ్జిన్ మాత్రమే అందుబాటులో వుంటుందన్నారు. వాక్సినేషన్ తర్వాత అబ్సర్వేషన్ తప్పనిసరి అన్నారు డాక్టర్ వెంకట్.

Related Articles

Latest Articles