భారత్‌లో కొత్త వేరియంట్..? మూడో దశతో ముప్పు పెరగనుందా..?

భారత్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌ కేసులు పూర్తిగా అదుపులోకి రాకముందే.. మళ్లీ రోజువారి పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూ పోతోంది.. దీంతో కొత్త ప్రమాదం పొంచిఉందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. దేశంలో మరో కొత్తరకం కరోనా వైరస్‌ సెప్టెంబర్‌ నెలలో వెలుగు చూస్తే.. అక్టోబర్‌-నవంబర్‌ మధ్య కాలంలో గరిష్ఠానికి చేరుకోవచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది. సెకండ్‌ వేవ్‌తో పోలిస్తే దాని తీవ్రత అతి స్వల్పంగానే ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. దేశంలో కరోనా మూడో ముప్పు అనివార్యమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైరస్‌ తీవ్రతను తాజా అధ్యయనం మరోసారి అంచనా వేసింది. ఒకవేళ కొత్త వేరియంట్‌ వెలుగు చూడకపోతే పరిస్థితుల్లో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చని తెలుస్తోంది.

మరోవైపు.. కరోనా వైరస్‌లన్నింటినీ ఎదుర్కొనే వ్యాక్సిన్‌ రూపొందించే సమయం ఆసన్నమైందని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. ఇందుకోసం ప్రపంచ దేశాలన్నీ సహకరించాల్సిన అవసరం ఉందని వెల్లడించింది. వీటిని అభివృద్ధి చేయడంతో పాటు అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు పరిశోధకులు, సంస్థలు, అంతర్జాతీయ ఏజెన్సీలు కీలక పాత్ర పోషించాలని విజ్ఞప్తి చేసింది. దీని ద్వారా భవిష్యత్తులో ఎదురయ్యే ఇతర మహమ్మారుల నుంచి రక్షించుకోవచ్చని అన్నారు. ఇక, కేరళలో కొవిడ్‌ కేసుల ఉద్ధృతి కాస్త తగ్గుముఖం పట్టాయి… గడిచిన 24గంటల వ్యవధిలో 1.17లక్షల శాంపిల్స్‌ పరీక్షించగా.. 19,622 కేసులు నమోదయ్యాయి. కొత్తగా మరో 132 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కొవిడ్‌ కేసుల సంఖ్య 40.27లక్షలకు చేరగా.. మరణాల సంఖ్య 20,673కి పెరిగింది. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 16.74శాతంగా ఉన్నట్టు కేరళ ఆరోగ్యమంత్రి వీణా జార్జ్‌ వెల్లడించారు. దేశవ్యాప్తంగా నమోదవుతున్న మొత్తం కొవిడ్‌ కేసుల్లో… సగం కేసులు కేరళలోనే నమోదవుతున్నాయి. ఆ రాష్ట్రం నుంచి వచ్చిన ప్రయాణికులు ఏడు రోజుల పాటు సంస్థాగత క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని కర్ణాటక ప్రభుత్వం స్పష్టం చేసింది. వ్యాక్సినేషన్ పూర్తయినా‌, ముందస్తు ఆర్టీ పీసీఆర్‌ పరీక్షలు చేయించుకున్నప్పటికీ క్వారంటైన్‌ పూర్తయిన ఏడో రోజు పరీక్షలు నిర్వహించనున్నారు.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-